Bachhala Malli Review: అల్లరి నరేష్‌ 'బచ్చలమల్లి’ ఎలా ఉందంటే.

ABN , Publish Date - Dec 20 , 2024 | 07:40 AM

కామెడీ కంటెంట్‌ను పక్కనపెట్టి సీరియస్‌ కథలవైపు దృష్టి పెట్టాడు. తనలోని మరో యాంగిల్‌ ఉందని, నిరూపించే ప్రయత్నం చేశారు. అయితే కొత్తగా చేసే ప్రయత్నాల్లో కొన్ని సఫలం అయ్యాయి. కొన్ని విఫలం అయ్యాయి, నరేష్‌ మాత్రం నటుడిగా ఎక్కడా ఫెయిల్‌ కాలేదు. మరో కొత్త క్యారెక్టర్‌ బచ్చలమల్లి’తో మరోసారి అలాంటి ప్రయత్నం చేశారు.

సినిమా రివ్యూ: బచ్చలమల్లి (Bachhala Malli)
విడుదల తేది: 20–12–2024
నటీనటులు: అల్లరి నరేశ్‌, అమృత అయ్యర్‌,(Amritha Aiyer) రోహిణి, రావు రమేష్‌, అచ్యుత్‌ కుమార్‌, బలగం జయరామ్‌, హరి తేజ, ప్రవీణ్‌, వైవా హర్ష తదితరులు
సాంకేతి నిపుణులు:
సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ఎమ్‌.నాథన్‌
సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్‌;
ఎడిటింగ్‌: ఛోటా కె ప్రసాద్‌
ప్రొడక్షన్‌ డిజైన్‌: బ్రహ్మ కడలి
నిర్మాతలు: రాజేష్‌ దండా, బాలాజీ గుత్తా
స్ర్కీన్‌ ప్లే: విప్పర్తి మధు
కథ, మాటలు, దర్శకత్వం: సుబ్బు మంగాదేవి. (Subbu Mangadevi)


అల్లరి నరేశ్‌ (Allari NAresh)అంటే కామెడీకి కేరాఫ్‌. అయితే ఆయన సరైన సక్సెస్‌ రుచి చూసి చాలాకాలమైంది. నాందితో నరేష్‌  స్టైల్‌, కథల ఎంపిక మారిపోయింది. కామెడీ కంటెంట్‌ను పక్కనపెట్టి సీరియస్‌ కథలవైపు దృష్టి పెట్టాడు. తనలోని మరో యాంగిల్‌ ఉందని ,నిరూపించే ప్రయత్నం చేశారు. అయితే కొత్తగా చేసే ప్రయత్నాల్లో కొన్ని సఫలం అయ్యాయి. కొన్ని విఫలం అయ్యాయి, నరేష్‌ మాత్రం నటుడిగా ఎక్కడా ఫెయిల్‌ కాలేదు. మరో కొత్త క్యారెక్టర్‌ 'బచ్చలమల్లి’తో మరోసారి అలాంటి ప్రయత్నం చేశారు. టైటిల్‌, టీజర్‌, ట్రైలర్‌లతో నరేష్‌ కొత్తగా ప్రయత్నించిన చిత్రమిదని అర్ధమైంది. ఈ మరి ఈ మూవీ ఎలా ఉంది? నరేశ్‌కు ఆశించిన సక్సెస్‌ ఇచ్చిందా? (Bachhala Malli Review)

Bm-1.jpg
కథ:

బచ్చలమల్లి (అల్లరి నరేశ్‌) చిన్నప్పటి నుంచీ తండ్రి అంటే చాలా ఇష్టం. తెలివైనవాడు. తండ్రి గర్వపడేలా పదో తరగతి పరీక్షల్లో జిల్లా ఫస్ట్‌ ర్యాంక్‌ తెచ్చుకుంటాడు. తండ్రి అంటే ప్రాణం. కానీ ఆయన తీసుకున్న నిర్ణయం మల్లిని బాధిస్తుంది. దాంతో అతి చిన్న వయసులోనే చెడు వ్యసనాలకు అలవాటు పడతాడు. కాలేజీ చదువు పక్కనపెట్టి తండ్రి చేసిన పనికి కోపంతో మొండితనం, మూర్ఖత్వం అలవరతాయి. ఆ సమయంలో తన జీవితంలోకి వచ్చిన కావేరి  (అమృత అయ్యర్‌)తో ప్రేమలో పడతాడు. మూర్ఖుడిగా ఉన్న మల్లి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు. ఆ మూర్ఖత్వం నుంచి బయటపడ్డాడా లేదా? తండ్రితో వచ్చిన సమస్య ఏంటి? ప్రియురాలితో ప్రేమ సుఖాంతం అయిందా అన్నది తెరపైనే చూడాలి. (Allari Naresh moVie)


విశ్లేషణ:

1985 తుని మండలం సురవరం గ్రామంలో కథ మొదలవుతుంది. మూర్ఖత్వంతో కూడిన హీరో క్యారెక్టరైజషన్‌కి తోడు, సంచుల వ్యాపార నేపథ్యం, తండ్రి నిర్లక్ష్యానికి గురైన అన్న, అవమానంతో కుమిలిపోయే తమ్ముడు.. ఓ మంచి ఫ్యామిలీ కథ ఉన్నా ఆ విషయంపై దర్శకుడు పెద్దగా దృష్టి పెట్టలేదు. సినిమా అంతా హీరో పాత్ర మీదే డ్రైవ్‌ చేశారు. అయితే హీరోకి తగిలిన దెబ్బలకు ఆయా సందర్భాలను బట్టి జాలి, కోపం, ప్రేమ కలగాలి. సినిమా చూస్తున్నప్పుడు అలా ఎక్కడా అనిపించలేదు. 1980, 90నుంచి 2005 మూడు కోణాల్లో కథ సాగినా ఎక్కడా కన్‌ఫ్యూజ్‌ లేకుండా కథ డ్రైవ్‌ అయింది. అలాగని ముందు ఏం జరగబోతుంది అనే ఆసక్తి కలిగించదు. విరామ సన్నివేశాల్లో కనిపించే కొత్త పాత్ర, ఆ నేపథ్యం ఓ టర్న్‌ తీసుకుంది. అయితే దర్శకుడు సుబ్బు కథ కంటే క్యారెక్టరైజేషన్‌ని నమ్ముకొన్నాడు. తన కోపం, పంతం, మూర్ఖత్వం ఇదే ప్రతీ ఫ్రేమ్ లో చూపించారు. మల్లి చిన్నతనం, తండ్రిపై కోపం, జీవితాన్ని నాశనం చేసుకోవడం.. ఇవన్నీ వన్‌ బై వన్‌ వచ్చి పోతుంటాయి, లవ్‌ స్టోరీ వచ్చాక.. కాస్త గాడిలో  పడుతుంది. అంత మొండోడు, మూర్ఖుడికి అందమైన అమ్మాయి ఎలా పడిపోయింది అనిపిస్తుంది. ‘ఎవరి కోసం మారాలి? ఎందుకు మారాలి’ అంటూ జీవితం సాగించే మల్లి చెడు వ్యసనాలు మానేయ్‌ అనగానే నీ కోసం ఎందుకు మారాలి అనే టైప్‌ మల్లి. అక్కడ హీరోలో సడెన్‌ చేంజ్‌ కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. తండ్రితో గొడవ సినిమాకు మేజర్‌. దాన్ని కాస్త ఎస్టాబ్లిష్‌ చేసుంటే బావుండేది. విలన్‌ దగ్గర కూడా బలమైన సంఘర్ణణ లేదు. క్లైమాక్స్‌ సన్నివేశాలను కాస్త బలంగా రాసుకున్నాడు దర్శకుడు. ఆస్పత్రిలో రోహిణి మాటలు, ఆ మాటలు విని మల్లిని ఆలోచనలో పెట్టిన సన్నివేశాలు హృద్యంగా సాగాయి. గుండె కూడా రక్తాన్ని పట్టుకుని విడుస్తుంది. అలాగే పట్టుకుని ఉంటే జీవితం ఆగిపోతుంది. జీవితంలో పట్టు విడుపు రెండు ఉండాలని చెప్పే సన్నివేశాలు భావోద్వేగాన్ని కలిగిస్తాయి. పెళ్లిమండపం సీన్‌, రావు రమేష్‌ ఇంటికి పెళ్లి చూపులకు వెళ్లే సీన్‌, ప్రీ కే్ౖలమాక్స్‌లో రావురమేష్‌తో సంభాషణలను దర్శకుడు బాగా రాసుకొన్నాడు. ఆసుపత్రి నుంచి బయటకు వస్తూ హరితేజ తపై చేయి వేసి, ఆశీర్వదించిన సీన్‌ కూడా హృదయానికి హత్తుకొంటుంది.

Bm.jpg
నటీనటుల పనితీరుకొస్తే.. కామెడీ పండించడంతో నరేష్‌ కింగ్‌. కానీ ఇది కాస్త సీరియస్‌ సినిమా. ఇందులో మూర్ఖత్వంతో కూడిన వ్యకిగా నరేష్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఆ పాత్ర గుర్తుండిపోతుంది. నరేష్‌ కెరీర్‌లో పేరు తెచ్చిన పాత్రలు తీసుకుంటే అందులో బచ్చలమల్లి తప్పకుండా ఉంటుంది. సినిమాలో ఎన్ని పాత్రలు ఉన్నా నరేష్‌ పోషించిన మల్లి పాత్ర గుర్తుండిపోతుంది. హీరోయిన్‌గా అమృత అయ్యర్‌ కూడా అంతే. తెరపై చాలా సంప్రదాయబద్థంగా కనిపించింది. రావు రమేష్‌ ఎప్పటిలాగే తనదైన మార్క్‌ నటన ప్రదర్శించాడు. ప్రవీణ్‌కి చాలాకాలం తరవాత వెరైటీ క్యారెక్టర్‌ పడింది. తన నటన ఆకట్టుకుంది. హరితేజకు కూడా మంచి పాత్ర దక్కింది. ప్రసాద్‌ బెహరా, వైవా హర్ష కాసేపు ఎంటర్‌టైన్‌ చేశారు. వీళ్లిద్దరి మధ్య పత్తిగింజ అంటూ వచ్చే సంభాషణలు అలరిస్తాయి. అత్యుత్‌ కుమార్‌ ఓకే అనిపించారు.  ఆయన్ను ఇంకాస్త ఉపయోగించుకుంటే బావుండేది. తల్లిగా రోహిణి తనదైన శైలిలో చేసుకుంటూ వెల్లిపోయారు. బలగం జయరామ్‌ నటన కూడా బావుంది. టెక్నికల్‌ సినిమా క్వాలిటీగా ఉంది. రిచర్డ్‌ ఎమ్‌.నాథన్‌ కెమెరా పనితనం గ్రామీణ వాతావరణాన్ని పక్కాగా ఆవిష్కరించింది. విశాల్‌ చంద్రశేఖర్‌ స్వరపరిచిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ఎసెట్‌ అయ్యాయి. ఎడిటింగ్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌గా కూడా తమ ప్రతిభ చూపించారు నిర్మాణ విలువలు బావున్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలో పటుట్దల ఎంత అవసరమో... అవసరమైన సందర్భంలో ఓ అడుగు తగ్గాలి విడుపు కూడా ఉండాలి. అప్పుడు జీవతం సాఫీగా సాగుతుంది. బంధం, అనుబంధం నిలవాలంటే కోపతాపాలు, ప్రతీకారాలు పక్కకు పెట్టి ముందడుగు వేయాలి.. లేదంటా చివరికి ఎవరూ లేకుండా సోలోగాలనే ఉండిపోవాల్సి ఉంటుంది. ఇది నిజజీవితంలో చూసిందే. బచ్చలమల్లి జీవితం కూడా అలాంటిదే అన్నది ఇతివృత్తంగా ఈ సినిమా తెరకెక్కింది. బచ్చలమల్లి జీవితంలో జరిగిన మూడు సంఘటనల్ని తీసుకుని ఈ కథని మలిచామని టీమ్‌ తెలిపింది. ఆ సంఘటనలు సినిమాలో చాలా సాధారణంగా, చాలా సినిమాల్లో చూసినట్టే అనిపిస్తాయి. కొత్తగా ఏమీ అనిపించదు.

ట్యాగ్‌ లైన్‌: ‘ఎవరి కోసం చూడాలి? ఎందుకు చూడాలి’ అంటే.. నరేష్‌ కోసం అంతే!

Updated Date - Dec 20 , 2024 | 09:51 AM