Fear Review: వేదిక నటించిన థ్రిల్లర్‌ 'ఫియర్‌' ఆకట్టుకుందా..

ABN , Publish Date - Dec 14 , 2024 | 02:48 PM

ముంబై బ్యూటీ వేదిక 'ముని’, 'కాంచనా 2', 'బాణం' చిత్రాలతో టాలీవుడ్‌కి సుపరిచితమే. ఒకటిన్నర దశాబ్దంగా నటిగా దక్షిణాదిలో సినిమాలు చేస్తోందీ నటి. బాణం మినహా ఆమెకు గుర్తింపు తెచ్చిన చిత్రాలు తక్కువ. అయినా సరైన విజయం కోసం పోరాటం చేస్తూనే ఉంది.

సినిమా రివ్యూ: ఫియర్‌ (Fear Movie Review)
విడుదల తేది: 14–12–2024
నటీనటులు: వేదిక(Vedika), అరవింద్‌ కృష్ణ, పవిత్రా లోకేష్‌, జయప్రకాష్‌, అనీష్‌ కురువిల్లా, సాయాజీ షిండే, సాహితి దాసరి, సత్యకృష్ణ, షాని తదితరులు.

సాంకేతిక నిపుణులు
సినిమాటోగ్రఫీ: ఐ ఆండ్రూ
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌
నిర్మాతలు: వంకి పెంచలయ్య, ఏఆర్‌ అభి
కథ–ఎడిటింగ్‌–దర్శకత్వం: హరిత గోగినేని. (Haritha Gogineni)

ముంబై బ్యూటీ వేదిక 'ముని’, 'కాంచనా 2', 'బాణం' చిత్రాలతో టాలీవుడ్‌కి సుపరిచితమే. ఒకటిన్నర దశాబ్దంగా నటిగా దక్షిణాదిలో సినిమాలు చేస్తోందీ నటి. బాణం మినహా ఆమెకు గుర్తింపు తెచ్చిన చిత్రాలు తక్కువ. అయినా సరైన విజయం కోసం పోరాటం చేస్తూనే ఉంది. తాజాగా ఆమె కీలక పాత్రలో పోషించిన చిత్రం 'ఫియర్‌.’ డా.గోగినేని హరిత దర్శకత్వం వహించారు. సస్పెన్స్‌ సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో 70కిపైగా అవార్డ్స్‌ రావడం, టీజర్‌, ట్రైలర్‌ ఆకట్టుకోవడం సినిమాకు మంచి బజ్‌ క్రియేట్‌ అయింది. వేదిక నటించిన థ్రిల్లర్‌ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుంది అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే!

కథ:(Fear Movie Review)
సింధు (వేదిక) చిన్నప్పటి నుంచి భయస్తురాలు. తన క్లాస్‌మేట్‌ సంపత్‌ (అరవింద్‌ కృష్ణ)ను ఇష్టపడుతుంది. అయితే, తన బాయ్‌ఫ్రెండ్‌ మిస్‌ అయ్యాడని అతని కోసం వెతుకుతూ ఉంటుంది. మరోవైపు ఎవరికీ కనిపించని ఓ వ్యక్తి సింధూకు మాత్రమే కనిపిస్తూ తనను వెంటాడుతుంటాడు. దాంతో భయపడుతూ మెంటల్‌గా చాలా డిస్టర్బ్‌ అవుతుంది. తరచు ఆమె అనవసరమైన విషయాలకు భయపడటంతో ఆమెను మెంటల్‌ హాస్పిటల్‌లో జాయిన్‌ చేస్తారు తల్లిదండ్రులు. అక్కడ ఏం జరిగింది, చిన్నతనం, మెంటల్‌ ఆసుపత్రి, స్నేహితుల ఇల్లు ఇలా తెరపై కనిపించే ట్రయాంగిల్‌ స్టోరీ ఏంటి? సింధూకి మాత్రమే కనిపించే వ్యక్తి ఎవరు? ఆమె భయానకి కారణం ఏంటి? సింధూ, ఇందు, మధ్య ఉన్న సంబంధం ఏంటి? అన్నది కథ. (Vedika)

విశ్లేషణ:
సైకలాజికల్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్స్‌ టాలీవుడ్‌లో తక్కువగా వస్తుంటాయి. ఈ జానర్‌ చిత్రాలకు నెరేషన్‌, స్ర్కీన్‌ప్లే గ్రిపింగ్‌గా ఉండాలి. ఆడియన్స్‌ను ఎంగేజ్‌ చేసేలా ఉండాలి. అనుభవం ఉన్న దర్శకులు ఇలాంటి జానర్‌ను కరెక్ట్‌గా డీల్‌ చేయగలరు. కొత్తవారికి ఈ జానర్‌ కాస్త సవాల్‌తో కూడుకున్నదే. టేకింగ్‌లో ఏమాత్రం తేడా వచ్చినా రిజల్ట్‌ తారుమారు అవుతుంది. థియేటర్‌లో ప్రేక్షకుడు తల పట్టుకోవలసిందే. అయితే ఈ చిత్రం ప్రారంభం అలాగే ఉంటుంది. హీరోయిన్‌ క్యారెక్టర్‌ చిన్నతనం ఓ పక్క, మెంటల్‌ ఆస్పత్రి మరో పక్క, బంఽధువుల కుటుంబం ఇలా మూడు చోట్ల కథ నడుస్తుంది. ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో ఏం అర్థం కానీ పరిస్థితి. ప్రేక్షకుడిని పూర్తిగా కన్‌ఫ్యూజ్‌ చేసిన భావన కలుగుతుంది. థిల్లర్‌ కథకు హారర్‌ ఫీల్‌ తీసుకురావాలంటే కథనం, సీన్‌ కంపోజిషన్‌ విషయంలో జాగ్రత్త వ్యవహరించాలి. అది  ఈ చిత్రం ప్రథమార్థంలో మిస్‌ అయింది. సెకండాఫ్‌ వచ్చేసరికి సింధూ పాత్రఽధారి అలా మారడానికి కారణం ఏంటి? అన్న ఆలోచన వచ్చేలా సన్నివేశాలున్నాయి. నిజంగానే సింధూకి  సైకాలాజికల్‌ డిజార్డర్‌ ఉందా? ఎవరికీ కనిపించని వ్యక్తులు ఆమెకు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నారు? సింధూకి కనిపిస్తున్న వారంతా ఆమె జీవితంలో ఉన్నారా? లేదంటే కావాలనే తాను అలా ప్రవర్తిస్తోందా?  అనే క్యూరియాసిటీ ఉండేలా కథను మలిచారు దర్శకురాలు. అది క్లైమాక్స్‌ వరకూ కొనసాగింది. అక్కడ మొదలైన ట్విస్ట్‌లు, సస్పెన్స్‌ ఆడియన్స్‌కి ఆకట్టుకుంటాయి. అయితే కథ నెమ్మదిగా సాగడం బోరింగ్‌గా అనిపిస్తుంది. స్ర్కీన్‌ప్లే మీద  దర్శకురాలు కాస్త దృష్టి పెట్టి ఉంటే ఆ సమస్య ఉండేది కాదు. కొన్ని చోట్ల సీన్‌ టు సీన్‌ లింక్‌ మిస్‌ అయింది. దాని వల్ల కథ ఏటో పోతుంది అనిపిస్తుంది. అయితే ఈ చిత్రంలో ఓ పాయింట్‌ మాత్రం తల్లిదండ్రులను ఆలోచింపజేసేలా ఉంది. పిల్లలు పెరిగి పెద్దవుతున్న తరుణంలో తల్లిదండ్రులు వాళ్లకి ఎంత సమయం కేటాయించాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. పట్టించుకోని పరిస్థితుల్లో పిల్లల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందనే సన్నివేశాలతో చక్కని సందేశం ఇచ్చారు. అయితే ఆ ఇంపాక్ట్‌ మరింత బలంగా చెబితే ఇంకా బావుండేది. అసలు సింధూ ప్రవర్తన అలా ఎందుకు ఉంది అన్న  విషయాన్ని క్లైమాక్స్‌లో రివీల్‌ చేసే సన్నివేశాలు ఎంగేజింగ్‌గా ఉన్నాయి. (Fear Movie Review)

నటీనటులు, సాంకేతిక నిపుణుల విషయానికొస్తే.. ఈ సినిమాకు మెయిన్‌ లీడ్‌ వేదిక. సిందూ, ఇందు పాత్రల్లో చక్కగా నటించింది. సింధూ పాత్రలో భయపడాల్సిన సన్నివేశాల్లో వేదిక నటన నేచురల్‌గా లేదు. ఎవరో తనని వెండిస్తున్నారు అన్న సన్నివేశాల్లో ఆమెలో భయపడని ఎక్స్‌ప్రెషన్స్‌ ఎక్కడా కనిపించలేదు. సినిమా మొత్తం ఒకటే టైప్‌ కాస్ట్యూమ్‌.. కలర్‌ మారింది అంతే. ఎంటైర్‌ సినిమా వేదికను ఆ డ్రెస్‌లో చూడటం కష్టంగా అనిపిస్తుంది. అయితే తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. అరవింద్‌ కృష్ణకు తక్కువ నిడిది. ఉన్నంతలో బాగానే చేశారు. పవిత్రా లోకేష్‌, జయప్రకాశ్‌, అనీష్‌ కురివిల్లా పరిధి మేరకు నటించారు. ఫ్రెండ్‌గా సాహితీ దాసరి ఓకే. అనూప్‌ సంగీతం బావుంది. కెమెరా వర్క్‌ ప్లస్‌ అయింది. నిర్మాణ విలువలు ఫర్వాలేదనిపించాయి. కథ, ఎడిటింగ్‌, కాస్టూమ్స్‌, దర్శకత్వం బాధ్యతలు అన్ని హరిత గోగినేని తన భుజాలపై వేసుకుని ఒత్తిడికి గురైనట్లు అనిపించింది. గతంలో 'లక్కీ లక్ష్మణ్‌’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించి సినిమా మేకింగ్‌పై సాధించిన పట్టుతో హరిత గోగినేని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టాలీవుడ్‌లో లేడీ డైరెక్టర్స్‌ సంఖ్య చాలా తక్కువ. ఇప్పుడిప్పుడే కొందరు మహిళలు దర్శకత్వం బాధ్యతలు తీసుకుని తామని తాము నిరూపించుకుంటున్నారు. హరిత కూడా అలాంటి ఓ ప్రయత్నం చేశారు. దర్శకత్వ శాఖపై ఆమె కాస్త పట్టు పెంచుకుని ఈ చిత్రం తెరకెక్కించి ఉంటే సినిమా రిజల్ట్‌ ఇంకాస్త బావుండేది. కాస్త ఓపికతో ఈ సినిమా చూస్తే క్లైమాక్స్‌ 15 నిమిషాలు ప్రేక్షకుల్ని ఇంప్రెస్‌ చేస్తుంది. (Fear Movie Review)

ట్యాగ్‌లైన్‌: క్లైమాక్స్‌ ఇంప్రెస్‌ చేస్తుంది

 

Updated Date - Dec 14 , 2024 | 02:48 PM