NTR: నాలుగో తరం నందమూరి వారసుడిని పరిచయం చేస్తున్న వైవిఎస్

ABN , Publish Date - Jun 10 , 2024 | 01:18 PM

లెజండరీ నటుడు ఎన్టీఆర్ ని దైవంగా భావించే దర్శకుడు వైవిఎస్ చౌదరి ఇప్పుడు నాలుగో తరం నందమూరి వంశానికి చెందిన నందమూరి తారక రామారావు అనే యువకుడిని తన సినిమా ద్వారా కథానాయకుడిగా పరిచయం చేస్తున్నారు. ఎప్పటినుండో కథానాయకుడి కోసం గాలిస్తున్న వైవిఎస్ కి ఈ నందమూరి యువకుడు ఎలా పరిచయం జరిగింది ఆ విశేషాలు చదవండి...

NTR: నాలుగో తరం నందమూరి వారసుడిని పరిచయం చేస్తున్న వైవిఎస్
YVS Chaudhary and the young Nandamuri Taraka Rama Rao

గత కొన్ని సంవత్సరాలుగా కొత్తవాళ్లతో సినిమా తీయడానికి ప్రముఖ దర్శకుడు, నిర్మాత వైవిఎస్ చౌదరి ప్రయత్నాలు చేస్తున్నారు. నందమూరి తారకరామారావు సినిమాలు చూస్తూ పెరిగిన వైవిఎస్ అతనిపైన వున్న అభిమానంతో, ఎన్టీఆర్ రూపంచూసి ఆకర్షితుడై, చిత్ర రంగంలోకి అడుగు పెట్టారు. మొదటిసారిగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దగ్గర నందమూరి బాలకృష్ణ సినిమాకి పనిచెయ్యడం, ఆ తరువాత తన స్వయంకృషితో, పట్టుదలతో, అంకిత భావంతో దర్శకుడిగా 'శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి' అనే సినిమాతో పరిచయం అవటం జరిగింది. ఆ తరువాత వైవిఎస్ ఎన్నో విజవంతమైన సినిమాలకి దర్శకత్వం వహించారు.

వైవిఎస్ చివరి సినిమా 'రేయ్', సాయి ధరమ్ తేజ్ కథానాయకుడు, సయామీ ఖేర్ కథానాయిక. ఈ ఇద్దరినీ ఆ సినిమాతో పరిచయం చేశారు. ఇంతకుముందు కూడా తన సినిమాలలో ఎక్కువగా కొత్తవారిని పరిచయం చేశారు వైవిఎస్ చౌదరి. ఆలా పరిచయం అయిన వారే రామ్ పోతినేని, ఇలియానా, అంకిత, ఆదిత్య ఓం. అంతే కాదు తన నిర్మాణ సంస్థ పేరు కూడా బొమ్మరిల్లు అని పెట్టి, దానికి తన ఆరాధ్య దైవం ఎన్టీఆర్ బొమ్మని ఎప్పుడూ వాడతారు వైవిఎస్.

yvsgeetha.jpg

'రేయ్' సినిమా 2015లో వచ్చింది, మళ్ళీ చాలా కాలం తరువాత ఇప్పుడు వైవిఎస్ ఒక కొత్త సినిమాకి శ్రీకారం చుట్టారు. అయితే ఈ సినిమాకి తన పాత బొమ్మరిల్లు ప్రొడక్షన్ హౌస్ నుండి కాక, తన భార్య గీత నిర్మాతగా ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్ ని ప్రారంభించారు. దానిపేరు న్యూ టాలెంట్ రోర్స్ (ఎన్టీఆర్) అని పెట్టారు. ఈ సంస్థ నుండి కొత్తవాళ్ళని పరిచయం చెయ్యాలనే ఉద్దేశంతో పెట్టిన సంస్థగా చెప్పారు. ఈ సంస్థ నుండి ఇప్పుడు రాబోయే సినిమాకి కథానాయకుడి ఎంపిక జరిగింది అని ప్రకటించారు.

ఆ కథానాయకుడు ఎవరో కాదు, అతని పేరు కూడా నందమూరి తారక రామారావు. "ఇతను నందమూరి వంశానికి చెందిన నాలుగో తరం కుర్రాడు. నా ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అయితే, అతని కుమారుడు హరికృష్ణ, అతని పెద్ద కుమారుడు జానకి రామ్, అతని పెద్ద కుమారుడు అయిన ఈ నందమూరి తారక రామారావు నా సినిమాలో కథానాయకుడు" అని అధికారికంగా ప్రకటించారు వైవిఎస్ చౌదరి. ఆసక్తికరం ఏనంటే ఈ ఎన్టీఆర్ తండ్రి జానకిరామ్, తాత హరికృష్ణ పూర్తి ఆయుష్షు నిండకుండానే ఈ లోకం విడిచి వెళ్లిపోయారు.

"అయినా కూడా అతని తల్లిగారి పెంపకంలో అద్భుతమైన నడవడికతో పెరిగాడు నందమూరి తారక రామారావు. మంచి ముఖ వర్చస్సు, అందమైన కళ్ళు, మంచి శరీరధారుడ్యం, మంచి ఎత్తు, ఇవన్నీ కాకుండా అతనిలో నటుడు అవ్వాలన్న తపన ఉండటం ఇంకో ప్లస్ పాయింట్. ఇవన్నీ నన్ను నా సినిమాలో కథానాయకుడు అతనే అని అతనివైపు తీసుకువెళ్ళింది," అని చెప్పుకొచ్చారు వైవిఎస్. ప్రముఖ నిర్మాత టి ప్రసన్నకుమార్ తనకు అత్యంత సన్నిహితుడని అతని ద్వారానే ఈ నాలుగో తరం నందమూరి యువకుడిని కలుసుకోవటం జరిగిందని చెప్పారు వైవిఎస్.

అతను గత సంవత్సరం నుండి తన శిక్షణలో వున్నాడని, తనకు తగిన సలహాలు అన్నీ ఇస్తున్నాను అని, అవన్నీ సినిమాకి ఉపయోగపడతాయని, అతను నటుడిగా మరింత పరిపక్వత రావటానికి సహకరిస్తాయని, త్వరలోనే అతన్ని అందరికీ పరిచయం చేస్తాను అని చెప్పారు వైవిఎస్. ఈ సినిమాలో కథానాయిక కూడా త్వరలోనే పరిచయం చేస్తానని చెప్పారు. "ఎప్పుడూ మనం ముంబై వెళ్లి అక్కడి వాళ్ళని ఇక్కడ పరిచయం చేస్తూ ఉంటాం, ఈసారి నేను ఒక అచ్చమైన, అందమైన తెలుగమ్మాయిని పరిచయం చేస్తున్నాను" అని చెప్పారు. త్వరలోనే ఈ సినిమా గురించి మరికొంత సమాచారం ఇస్తానని, ఎప్పుడు ప్రారంభం అవుతుంది, సినిమా కథా నేపధ్యం ఏంటి అనే విషయాలు ముందు ముందు పంచుకుంటాను అని చెప్పారు వైవిఎస్. ఈ సినిమాకి నిర్మాతగా తన భార్య గీత వ్యవహరిస్తున్నారని, ఆమె స్నేహితులు అమెరికానుండి కొంతమంది పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారని కూడా ఈ సందర్భంగా చెప్పారు.

నందమూరి తారకరామారావు ముని మనవడిని తన సినిమాతో పరిచయం చేస్తున్నందుకు తనపైన ఎటువంటి ఒత్తిడి ఉండదని చెప్పారు వైవిఎస్. ఎందుకంటే తను కొత్తవాళ్లతో తీసేటప్పుడు వాళ్ళకి ఎటువంటి కంఫర్ట్స్ ఇవ్వనని చెప్పారు. నా సినిమానుండి బయటకి వచ్చినతరువాత ఆ నటీనటులు తనపేరు నిలబెట్టే విధంగా ఉండాలని, అందుకని వాళ్ళని మంచి నటీనటులుగా తీర్చిదిద్దుతానని చెప్పారు వైవిఎస్. ఇప్పుడు ఈ నందమూరి తారక రామారావుని కూడా కొత్త నటుడిగానే చూస్తాను అని చెప్పారు. అయితే అతని బాబాయిలు, తాతగారు నటులుగా కొనసాగుతున్నారని, వారి ఆశీస్సులు ఈ కుర్రాడికి ఉన్నాయని చెప్పారు.

-- సురేష్ కవిరాయని

Updated Date - Jun 10 , 2024 | 01:20 PM