మన హీరోలకు ఏం తక్కువ?
ABN , Publish Date - Nov 13 , 2024 | 04:31 AM
వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మట్కా’ ఈనెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కరుణకుమార్ మీడియాతో మాట్లాడుతూ ‘‘మట్కా’ కథకి ఆలోచన ఒక మ్యారేజ్ ఫంక్షన్‌లో వచ్చింది. ఇక్కడే ఈ గేమ్ గురించి...
వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మట్కా’ ఈనెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కరుణకుమార్ మీడియాతో మాట్లాడుతూ ‘‘మట్కా’ కథకి ఆలోచన ఒక మ్యారేజ్ ఫంక్షన్‌లో వచ్చింది. ఇక్కడే ఈ గేమ్ గురించి మొదటి సారి విన్నాను. ఈ గేమ్ ఎవరిదని రీసెర్చ్ చేశాను. వాస్తవానికి దీని గురించి తెలుసుకున్నాక ‘వాడి పోయిన పూలు’ అని ఒక కథ రాద్దామనుకున్నా. మట్కాలో ఒక వెలుగు వెలిగి బలైపోయిన ఓ వ్యక్తి జీవితంపై షార్ట్ స్టోరీ రాద్దామనుకున్నా. అలా మొదలు పెట్టిన తర్వాత ఇది సినిమా మెటీరియల్ అని నాకు అర్థమైంది. దీనిని తిరిగి సినిమా వర్షన్‌లో కథ రాసుకున్నా. చాలా మంది తమిళ సినిమాలు బాగుంటాయి, కన్నడ సినిమాలు బాగుంటాయి, హిందీ సినిమాలు బాగుంటాయి అని అంటుంటారు. కానీ, మన తెలుగువాళ్లు తీసిన సినిమాలు ఇప్పటి వరకూ ఎవరూ తీయలేదు. ఆ సత్యాన్ని గుర్తించడం లేదు. బెంగాలీ సాహిత్యం తరవాత బెస్ట్ సాహిత్యం ఉన్నది తెలుగులోనే. ఒక తమిళ సినిమా వస్తే మనం సూపర్‌హిట్ చేసి ఆదరిస్తాం. రజనికాంత్ హోదా సూపర్‌స్టార్. ఇక్కడ కూడా ఆయనను సూపర్ స్టార్ హోదాలోనే ఆదరిస్తున్నాం. రజనీకాంత్ కంటే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్ ఏ విధంగా తక్కువ?. ‘మట్కా’ పక్కా కమర్షియల్ సినిమా.
ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. ఆ రోజుల్లో టెలిఫోన్ సౌకర్యం సరిగా లేదు, టెలిగ్రామ్ రెండు రోజులు పడుతుంది. ఒక ట్రంకాల్ బుక్ చేయాలంటే ఆరు, ఏడు గంటలు పడుతుంది. కానీ ప్రతి రోజూ ఐదు గంటలకు దేశం మొత్తం ఒకే నంబరు వస్తుంది. ఇదంతా ఒకరు ఆర్గనైజ్ చేస్తారు. ఇదే నాకు ఇంట్రస్టింగ్ పాయింట్ అనిపించింది కథ రాయడానికి. ఈ సినిమాను వరుణ్ తేజ్‌తో చేస్తే బాగుంటుందని వైరా ప్రొడక్షన్స్ వాళ్లే సూచించారు. ఈ సినిమాలో ఆయన అత్యద్భుతంగా నటించారు’ అని అన్నారు.