హ్యాట్రిక్ సాధిస్తామనే నమ్మకం ఉంది
ABN , Publish Date - Feb 14 , 2024 | 06:10 AM
‘పంపిణీదారుడిగా నాకు పన్నెండేళ్ల అనుభవం ఉంది. సందీప్ కిషన్, నేను, దర్శకుడు ఆనంద్ స్నేహితులం. హాస్య మూవీస్ సంస్థను ప్రారంభించి తీయాలనుకున్న మొదటి సినిమా ‘ఊరు పేరు భైరవకోన’...

‘పంపిణీదారుడిగా నాకు పన్నెండేళ్ల అనుభవం ఉంది. సందీప్ కిషన్, నేను, దర్శకుడు ఆనంద్ స్నేహితులం. హాస్య మూవీస్ సంస్థను ప్రారంభించి తీయాలనుకున్న మొదటి సినిమా ‘ఊరు పేరు భైరవకోన’. ఆనంద్ చెప్పిన కథ కొత్తగా ఉండడంతో ఇలాంటి కంటెంట్‌తో సినిమా తీస్తే హిట్ అవుతుందనే నమ్మకంతోనే ఈ సినిమా తీశాం. సందీప్ కిషన్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్ చిత్రం ఇది. బిజినెస్ కూడా అదే స్థాయిలో జరిగింది. అందుకే విడుదలకు ముందే హ్యాపీగా ఉన్నాం’ అన్నారు నిర్మాత రాజేశ్ దండా. సందీప్ కిషన్ హీరోగా ఆయన నిర్మించిన ‘ఊరు పేరు భైరవకోన’ చిత్రం ఈ నెల 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం మీడియాతో చిత్ర విశేషాలు పంచుకొన్నారు. నచ్చిన కథలు చేసుకుంటూ వెళుతున్నామని చెబుతూ ‘మా సంస్థ సక్సెస్ ట్రాక్‌ను ‘ఊరు పేరు భైరవకోన’ కొనసాగించి హ్యాట్రిక్ అందిస్తుందనే నమ్మకం ఉంది. ప్రీమియర్ షోలన్నీ ఫుల్ కావడం ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌కు అద్ధం పడుతుంది. మా దర్శకుడు చెబితే సినిమాకు కచ్చితంగా సీక్వెల్ ఉంటుంది. ఈ కథకు సీక్వెల్, ప్రీక్వెల్ .. రెండూ చేయచ్చు. ఆ ఆలోచన ఉంది’ అని ఆయన చెప్పారు. చిత్రంలోని అంశాల గురించి వివరిస్తూ ‘ఇదొక ఫాంటసీ థ్రిల్లర్. ‘భైరవకోన’ అనే ఊరులో ఎవరూ ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. అలాగే గరుడ పురాణం పుస్తకంలో మిస్ అయిన పేజీలకు, ఈ కథకు ఉన్న లింక్ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. చిత్రంలో 47 నిముషాల అద్భుతమైన సీజీ వర్క్ ఉంది. సందీప్ కిషన్ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. తనే ఈ సినిమాకు హెల్ప్ అయ్యాడనే విధంగా నటించాడు. ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతినిచ్చే సినిమా ఇది’ అని రాజేశ్ చెప్పారు. నిర్మాత అనిల్ సుంకరతో ఉన్న అనుబంధం గురించి చెబుతూ ‘మొదట నేను కథ వింటాను. నాకు నచ్చితే అనిల్ వింటారు. అవసరసమైన సలహాలు, సూచనలు ఇస్తారు. ఈ సినిమాలో కూడా ఆయన ఓ విలువైన సూచన చేశారు. అది బాగా హెల్ప్ అయింది’ అని తెలిపారు.