మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నా
ABN , Publish Date - Aug 31 , 2024 | 06:05 AM
తెలుగు సినిమాల్లో తండ్రి పాత్రలు దాదాపు ఒకేలా ఉంటున్నాయి. అయినా తనకు ఇచ్చిన పాత్రల్లో వైవిధ్యం చూపించడానికి కృషి చేస్తున్నారు నటుడు ఆనంద చక్రపాణి. ‘దాసి’ చిత్రంతో తొలిసారిగా తెరపై కనిపించి లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ‘మల్లేశం’ సినిమాలో తండ్రి పాత్రతో ఎంట్రీ ఇచ్చారు.
తెలుగు సినిమాల్లో తండ్రి పాత్రలు దాదాపు ఒకేలా ఉంటున్నాయి. అయినా తనకు ఇచ్చిన పాత్రల్లో వైవిధ్యం చూపించడానికి కృషి చేస్తున్నారు నటుడు ఆనంద చక్రపాణి. ‘దాసి’ చిత్రంతో తొలిసారిగా తెరపై కనిపించి లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ‘మల్లేశం’ సినిమాలో తండ్రి పాత్రతో ఎంట్రీ ఇచ్చారు. ఒకే ఒక్క ఛాన్స్ జీవితాన్ని మలుపు తిప్పుతుందని చాలా సందర్భాల్లో నిజమైన విషయం. అలాగే ‘మల్లేశం’ చిత్రం ఆనంద చక్రపాణి కెరీర్‌ని మలుపు తిప్పింది. ఇప్పటికి 45పైగా చిత్రాల్లో నటించేలా చేసింది.. అవన్నీ విభిన్న పాత్రలు కావడం తన అదృష్టం అంటూ ఆనంద చక్రపాణి చెప్పిన విశేషాలు ఇవి.
చిన్నప్పటి నుంచి నాకు నటన అంటే ఇష్టం. మంచి నటుడుగా పేరు తెచ్చుకోవాలనే కోరిక ఉండేది. మంచి బ్రేక్ కోసం ఎదురు చూశాను. అది ‘మల్లేశం’ రూపంలో వచ్చింది. ఇప్పటివరకూ చాలా సినిమాలు చేశాను. ఒక పెద్ద హిట్ పడితే అందరి దృష్టిలో పడతాను. ‘రాజు యాదవ్’ చిత్రంలో నా పాత్రకు మంచి పేరు వచ్చింది. సినిమా తేడాగా ఉండడంతో ఆడలేదు. ఒక్కోసారి మనం ఎంత బాగా చేసినా సినిమా ఆడకపోతే ప్రయోజనం ఉండదు కదా ‘మల్లేశం’ స్థాయి పాత్ర నాకు మళ్లీ ‘అనగనగా ఒక అతిధి’ సిరీ్‌సలో వచ్చింది. అందులో నాలుగే నాలుగు పాత్రలు. అందులో తండ్రి పాత్ర కూడా నాకు మంచి పేరు తెచ్చింది.
ఇంతకుముందు అడ్వర్‌టైజ్‌మెంట్ రంగంలో ఉన్నాను. యాడ్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేశాను. ఇప్పుడు మాత్రం నటన మీదే దృష్టి పెట్టాను. నాకు ఇచ్చిన పాత్రకు పూర్తి న్యాయం చేకూర్చడానికి చాలా హోమ్ వర్క్ చేస్తుంటాను. ఆ పాత్రలో ప్రవేశించడానికి మానసికంగా స్ట్రగుల్ అవుతాను. అందరూ అలాగే చేస్తుంటారు కానీ నాకు కూడా ఆ గుణం ఉంది. అందుకేనేమో ఎమోషనల్ ఫాదర్ వేషం అంటే నాకే పిలుపు వస్తుంది.
పాత రోజుల్లో నేషనల్ ఫిల్మ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ నిర్మించిన చిత్రాలన్నీ వదిలిపెట్టకుండా చూసేవాణ్ణి. ఆర్ట్ ఫిల్మ్స్‌తోనే నా నడక మొదలైంది కనుక ఆ తరహా చిత్రాలంటే చాలా ఇష్టం. ఆ రోజుల్లో షబానా అజ్మీ, నజీరుద్దిన్ షా, ఓంపురి, స్మితాపాటిల్ నటించిన సినిమాలు ఎక్కువగా వచ్చేవి. ఆ చిత్రాల ప్రభావం నా మీద బాగా ఉండేది. ఈమధ్య కాలంలో నవాజుద్దీన్, ఇఫ్రాన్ ఖాన్ వంటి నాచురల్ ఆర్టిస్టులు ఎంతో అద్భుతంగా నటిస్తున్నారు. పాత్రలో రాణించడానికి చాలా హోమ్ వర్క్ చేస్తారు. అవన్నీ చూసి ప్రేరణ పొంది, నాచురల్‌గా నటించడానికి కృషి చేస్తున్నాను. మెలో డ్రామా నాకు నచ్చదు.
ప్రస్తుతం నాలుగు చిత్రాలు షూటింగ్ దశలో, మరో రెండు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. నిఖిల్ నటిస్తున్న ‘స్వయంభూ’లో మంచి పాత్ర చేస్తున్నాను. అలాగే పర్యావరణం మీద చేస్తున్న ‘గాంధీతాత జట్టు’ కూడా నాకు మంచి పేరు తెస్తుందనే ఆశతో ఉన్నా.