Tollywood box office: వరుణ్ తేజ్ కి మరో ఫ్లాప్ 'ఆపరేషన్ వాలెంటైన్'
ABN , Publish Date - Mar 04 , 2024 | 05:45 PM
గతవారం విడుదలైన సినిమాలంటిలో 'ఆపరేషన్ వాలెంటైన్' పెద్ద బడ్జెట్ సినిమా. వరుణ్ తేజ్ కథానాయకుడిగా ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో విడుదలయింది, కానీ ప్రేక్షకులు ఈ సినిమాని తిరస్కరించారు. అలాగే ఇంకో మూడు సినిమాలు కూడా విడుదలయ్యాయి..
వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా నటించిన 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమా గతవారం విడుదలైంది. శక్తి ప్రతాప్ సింగ్ దీనికి దర్శకుడు. ఈ సినిమాపై వరుణ్ తేజ్ ఎంతో ఆశలు పెట్టుకున్నారు. మొట్టమొదటిసారిగా తెలుగులో విమాన యుద్ధం నేపథ్యంలో వచ్చిన సినిమా ఇది. హిందీలో కూడా విడుదలై, వరుణ్ తేజ్ కి ఆరంగేట్రం చెయ్యడానికి ఉపకరించింది. కానీ ఈ యుద్ధ నేపథ్యంలో తీసిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఎటువంటి ప్రభావం చూపలేకపోయింది. (Tollywood box office)
తెలుగు ప్రేక్షకులు వైవిధ్యమైన సినిమాలని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ వుంటారు, కానీ ఈ 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమాని మాత్రం ప్రేక్షకులు తిరస్కరించారు. ఇదే కథా నేపథ్యంలో ఇంతకు ముందు 'ఫైటర్' అనే సినిమా విడుదలవడం ఒక కారణం అని విశ్లేషకులు అంటున్నారు. (Varun Tej gets another flop with Operation Valentine) అందులో హ్రితిక్ రోషన్, దీపికా పడుకొనే జంటగా నటించారు. అదే కథా నేపథ్యంలో ఇప్పుడు వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమా కూడా ఉండటం ఈ సినిమాకి పెద్ద మైనస్ అని చెపుతున్నారు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విఫలం అయినా, వరుణ్ తేజ్ ని అందరూ ఒక వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు రావటం ప్రశంసించారు.
ఇంకో మూడు చిన్న సినిమాలు కూడా గతవారం విడుదలయ్యాయి. అందులో వెన్నెల కిషోర్ నటించిన 'చారి 111' అనే గూఢచారి నేపథ్యంలో వచ్చిన సినిమా. మురళి శర్మ ఇందులో ఇంకో ప్రధాన పాత్ర పోషించారు. కానీ ఈ సినిమాకి సరైన ప్రచారాలు లేకపోవటం, సినిమాలో చాలా సన్నివేశాలు మరీ చుట్టేసినట్టుగా తీయడంతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకర్షించ లేకపోయింది.
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రాజకీయ చిత్రం 'వ్యూహం' అసలు విడుదలైనట్టే ఎవరికీ తెలియదు. ఆర్జీవీ కెరీర్ లో ఇది ఇంకో డిజాస్టర్, ఈ సినిమాలో సన్నివేశాలు అన్నీ యూట్యూబ్ లో వచ్చే కంటెంట్ లా వుంది కానీ, సినిమాకి పనికొచ్చే కంటెంట్ లా లేదని విమర్శకులు అంటున్నారు. (Ram Gopal Varma's Vyooham is a complete washout)
శివ కందుకూరి, రాశి సింగ్ జంటగా నటించిన 'భూతద్దం భాస్కర నారాయణ్' సినిమా కూడా విడుదలైంది. ఇది ఒక థ్రిల్లర్ నేపథ్యంలో, ప్రైవేట్ డిటెక్టివ్ కథాంశంతో తెరకెక్కింది. శివ కందుకూరి డిటెక్టివ్ భాస్కర నారాయణ పాత్రలో కనిపించారు. విడుదలైన సినిమాలలో ఈ సినిమాకి కొంచెం బాగుంది అనే పేరు వచ్చింది. అయితే ఈ చిత్ర నిర్వాహకులు మాత్రం ఈ సినిమా కలెక్షన్స్ బాగున్నాయని అధికారికంగా ప్రకటించారు.
ఇంగ్లీష్ సినిమా 'డ్యూన్ 2' కూడా విడుదలైంది. ఈ సినిమాకి మల్టీప్లెక్స్ లలో ప్రేక్షకులు ఆదరించినట్టుగా తెలుస్తోంది. కానీ కలెక్షన్స్ మాత్రం అంత చెప్పుకోదగ్గగా లేవు అని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు. ప్రేక్షకులకి ఈ సినిమా మొదటి పార్టు చూడాలి అనుకుంటే ఆ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.