August 15 releases: ముచ్చటగా మూడు సినిమాల మధ్యనే పోటీ, కానీ...

ABN , Publish Date - Jul 22 , 2024 | 02:38 PM

రవితేజ, రామ్ పోతినేని సినిమాలు ఆగస్టు 15న విడుదలవుతున్నాయి. వీరితో పాటు తమిళ నటుడు విక్రమ్ సినిమా కూడా ఇదే రోజు విడుదలవుతోంది. ఇలా మూడు సినిమాలు పండగలాంటి స్వాతంత్ర దినోత్సవం నాడు విడుదలవడం ఆసక్తికరం. ఈ ముగ్గురిలో గెలుపెవరిదో ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు.

Three big films are releasing on August 15

వచ్చే ఆగస్టు 15వ తేదీ వస్తోంది అంటే సినిమా ప్రియులకి మంచి శుభవార్త. ఆరోజు ముగ్గురు కథానాయకులు తమ సినిమాలతో పోటీ పడుతున్నారు. అందులో ఇద్దరు సీనియర్ నటులు కాగా, ఒకరు యువ నటుడు వున్నారు. రామ్ పోతినేని, పూరి జగన్ కాంబినేషన్ లో వస్తున్న 'డబుల్ ఇస్మార్ట్' ఆగస్టు 15న విడుదలవుతోంది. ఈ సినిమా ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్ లో విజయవంతంగా వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' కి సీక్వల్ గా వస్తోంది. కావ్య థాపర్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా పూరి జగన్ కి, రామ్ పోతినేనికి ఇద్దరికీ కీలకం. ఈ సినిమా విజయం ఇద్దరి కెరీర్ లపై చాలా ప్రభావం చూపిస్తుంది అని పరిశ్రమలో టాక్ నడుస్తోంది. పూరి జగన్, ఛార్మి ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. పూరి జగన్ ఇంతకు ముందు విజయ్ దేవరకొండతో తీసిన 'లైగర్' బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అందుకనే ఈ సినిమాపై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు పూరి జగన్.

HBDRamPothineni.jpg

ఇక రెండో సినిమా రవి తేజ, దర్శకుడు హరీష్ శంకర్ ల కాంబినేషన్ లో వస్తున్న 'మిష్టర్ బచ్చన్'. ఇది హిందీ సినిమా 'రైడ్' కి రీమేక్ గా వస్తోంది. రాజ్ కుమార్ గుప్త దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అజయ్ దేవగన్ కథానాయకుడు, ఇలియానా కథానాయికగా నటించింది. ఇన్కమ్ టాక్స్ రైడ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాని దర్శకుడు హరీష్ శంకర్ 'మిష్టర్ బచ్చన్' పేరుతో రీమేక్ చేశారు. సౌరబ్ శుక్ల నటించిన పాత్ర తెలుగులో జగపతి బాబు పోషిస్తున్నారని అంటున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయకురాలు. ఈ సినిమా ఆగస్టు 15న విడుదలవుతుందని అధికారికంగా ప్రకటించారు. రవి తేజ ముందు సినిమాలు 'ఈగల్', 'టైగర్ నాగేశ్వర రావు' సినిమాలు బాక్స్ ఆఫీస్ ముందు బోల్తా పడ్డాయి. ఇప్పుడు ఈ 'మిష్టర్ బచ్చన్' బాక్స్ ఆఫీస్ ముందు ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పటికే ఈ సినిమా నుండి ఒక పాటని విడుదల చేశారు, అది మంచి ప్రజాదరణ పొందింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తోంది.

mrbachchan.jpg

ఇంకో సినిమా తమిళ నటుడు విక్రమ్ నటించిన 'తంగలాన్'. పా. రంజిత్ దీనికి దర్శకుడు, ప్రముఖ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ ఈ సినిమాని పెద్ద బడ్జెట్ పెట్టి నిర్మిస్తోంది. కెఈ జ్ఞానవేల్ రాజా నిర్మాత. ఈ సినిమా కూడా ఆగస్టు 15న విడుదలవుతోంది. ఈ సినిమా అటు తమిళం, తెలుగు భాషలతో పాటుగా మిగతా అన్ని భాషల్లో కూడా విడుదలవుతోంది. ఈ సినిమా బడ్జెట్ కూడా రూ.100 కోట్ల పైమాటే అంటున్నారు. విక్రమ్ ఇందులో మూడు వైవిధ్యమైన పాత్రలలో కనిపించి మెప్పిస్తారు అని అంటున్నారు. ఈ సినిమా ఒక పీరియడ్ డ్రామాగా తెరకెక్కనుంది. ఇంతకు ముందు వచ్చిన 'కేజీఎఫ్' సినిమాకి ప్రీక్వల్ గా ఈ సినిమా ఉండొచ్చు అని కూడా అంటున్నారు. మాళవిక మోహనన్ ఇందులో ఇంకో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.

Thangalaan.jpg

ఇలా మూడు సినిమాలతో ముగ్గురు కథానాయకులు ఈ ఆగస్టు 15వ తేదీన వస్తున్నారు. ఆ తేదీ నుండి వరసగా సెలవులు కలిసి రావటం ఈ సినిమాలకి బాగా హెల్ప్ అవుతుందని కూడా అంటున్నారు. ఈ మూడు సినిమాలతో పాటు చిన్న సినిమా '35: చిన్న కథ కాదు' అనే సినిమా కూడా ఆగస్టు 15న విడుదలవుతోంది. ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి ఈ సినిమాకి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈమని నందకిషోర్ దర్శకుడు, కాగా నివేద థామస్, విశ్వదేవ్ రాచకొండ, ప్రియదర్శి ఇందులో ప్రధాన తారాగణం.

35chinnakathakaadu.jpg

Updated Date - Jul 22 , 2024 | 02:38 PM