ప్రేక్షకులకు చాలా సర్ర్పైజ్‌లు ఉన్నాయి
ABN , Publish Date - Jan 07 , 2024 | 02:54 AM
‘తొలి సినిమాలోనే నాగార్జున గారి లాంటి పెద్దస్టార్‌ని డైరెక్ట్ చేయడం నా అదృష్టం. 1980ల్లో సాగే కథ కావడంతో ‘నా సామిరంగ’ చిత్రంలో ఆయన్ను డిఫరెంట్‌గా, కొత్తగా చూపించబోతున్నాం...

‘తొలి సినిమాలోనే నాగార్జున గారి లాంటి పెద్దస్టార్‌ని డైరెక్ట్ చేయడం నా అదృష్టం. 1980ల్లో సాగే కథ కావడంతో ‘నా సామిరంగ’ చిత్రంలో ఆయన్ను డిఫరెంట్‌గా, కొత్తగా చూపించబోతున్నాం. అభిమానులకు పాత చిత్రాల్లో నాగార్జున గుర్తుకొస్తారు’ అని దర్శకుడు విజయ్ బిన్ని చెప్పారు. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈనెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా విజయ్ బిన్ని సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
దర్శకుడు కావాలనే లక్ష్యంతో పరిశ్రమకు వచ్చాను. ఆ విభాగంలో రాణించడానికి ఉపయోగపడుతుందని నృత్య దర్శకుడిగా మారాను. అలా నాగార్జున గారి సినిమాలకు కొరియోగ్రఫీ చేయడం వల్ల ఆయనతో పరిచయం ఏర్పడింది. నాగార్జున గారికి ఒక కథ వినిపించాను. ఆయన ‘నా సామిరంగ’ సినిమా చేయమని అవకాశం ఇచ్చారు. కథను ఆకళింపు చేసుకొని నాదైన శైలిలో తెరకెక్కించాను. సినిమా అవుట్‌పుట్ పట్ల ఆయన సంతోషంగా ఉన్నారు. నాగార్జున గారి సహకారంతో ఇబ్బందిపడకుండా సజావుగా, వేగంగా చిత్రీకరణ పూర్తి చేశాం.
స్నేహం, ప్రేమ, భావోద్వేగాల సంఘర్షణ నేపథ్యంలో కథ సాగుతుంది. నాగార్జున గారి స్నేహితుడిగా అల్లరి నరేశ్ కనిపిస్తారు. రాజ్‌తరుణ్‌ది కీలకమైన పాత్ర. మూడు పాత్రల మధ్య ఉన్న సంబంధం, వారికెదురైన సవాళ్లు, వారు ఎలా స్పందించారు అనేది ఆసక్తికరంగా చూపించబోతున్నాం. ‘నా సామిరంగ’లో ప్రేక్షకులకు చాలా సర్ర్పైజ్‌లు ఉన్నాయి. అవేంటో తెరపైన చూస్తేనే బాగుంటుంది. కీరవాణి గారు స్వరపరిచిన మూడు పాటలూ సూపర్‌హిట్టయ్యాయి.