అందుకే వేడుకలా నిర్వహిస్తున్నాం

ABN , Publish Date - Nov 06 , 2024 | 03:21 AM

‘వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న తండేల్‌ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించడం మాకు ఎంతో ప్రత్యేకమైన విషయం. అందుకే రిలీజ్‌ ప్రకటించే కార్యక్రమాన్ని ఒక వేడుకలా నిర్వహిస్తున్నాం’ అని...

‘వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న తండేల్‌ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించడం మాకు ఎంతో ప్రత్యేకమైన విషయం. అందుకే రిలీజ్‌ ప్రకటించే కార్యక్రమాన్ని ఒక వేడుకలా నిర్వహిస్తున్నాం’ అని నిర్మాత అల్లు అరవింద్‌ అన్నారు. ఆయన సమర్పణలో చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. బన్నీవాస్‌ నిర్మాత. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్నారు. మంగళవారం చిత్రబృందం రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌మెంట్‌ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ ‘సినిమా అంటే ఇలానే తీయాలి అనేలా ‘తండేల్‌’ ఉండబోతోంది. ఇది మామూలు సినిమా కాదు. శ్రీకాకుళంలోని కొందరు మత్స్యకారుల జీవితం, వారి కష్టం మొత్తం దేశం దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్‌ చేసినా పండగే అవుతుంది. మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నందుకు ఆనందంగా ఉంది. బన్నీవా్‌సతో మరోసారి పనిచేయడం ఆనందాన్నిచ్చింది. నన్ను తెరపైన బాగా చూపించేందుకు చందు చాలా కష్టపడ్డాడు. సాయిపల్లవి సినిమాలోని అన్ని పాత్రల గురించి ఆలోచించి బాగా సపోర్ట్‌ చేశారు’ అని చెప్పారు.


సాయిపల్లవి మాట్లాడుతూ ‘అల్లు అరవింద్‌గారు నన్ను సొంత కూతురిలా చూసుకుంటారు. నా సినిమా హిట్టయినా, నాకు ఏదైనా అవార్డు వచ్చినా ఆయన ఎంతో సంతోషిస్తారు. ‘తండేల్‌’ కోసం మేమంతా చాలా కష్టపడ్డాం. మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’ అన్నారు. ‘అక్కినేని అభిమానులందరూ కాలర్‌ ఎగురవేసే సినిమా ఇది. సాయిపల్లవి క్వీన్‌ ఆఫ్‌ ద బాక్సాఫీస్‌. ఈ చిత్రం తప్పకుండా వంద కోట్ల క్లబ్‌లో చేరుతుంది’ అని బన్నీవాస్‌ చెప్పారు. ‘తండేల్‌’ మంచి వసూళ్లను సాధించడంతో పాటు ప్రేక్షక హృదయాలను కొల్లగొడుతుందనే నమ్మకం ఉంద’ని చందు మొండేటి తెలిపారు.

Updated Date - Nov 06 , 2024 | 03:21 AM