VK Naresh : అది నా అదృష్టం
ABN , Publish Date - Jan 20 , 2024 | 12:17 AM
నటుడిగా 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను అని వీకే నరేశ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటిస్తూ. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం
వీకే నరేశ్
నటుడిగా 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను అని వీకే నరేశ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటిస్తూ. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్లే నటుడిగా సుదీర్ఘ కెరీర్ సాధ్యమైందని చెప్పారు. జీవితాంతం పరిశ్రమకు సేవ చేస్తానని పేర్కొన్నారు. ఊహ తెలిసినప్పటి నుంచి సినిమాల మధ్యనే పెరగడం వల్ల ఇదే తన జీవితం కావాలని కోరుకున్నానని చెప్పారు. తొమ్మిదో ఏట ‘పండంటి కాపురం’ లాంటి చిత్రంతో బాలనటుడిగా అరంగేట్రం చేయడం, ఎస్వీఆర్ లాంటి గొప్ప నటులతో కలసి పనిచేయడం తన జీవితంలో మర్చిపోలేని అనుభవం అని తెలిపారు. ఒక్క సినిమాలో హీరోగా నటించినా చాలు అనుకున్న తనకు ప్రేక్షకులు ఇంత సుదీర్ఘ సినీ కెరీర్‌ను ఇచ్చారని, వారికి రుణపడి ఉంటానని అన్నారు. నంది పురస్కారాలను అందించకపోవడంపై నరేశ్ స్పందిస్తూ ‘నంది పురస్కారాలను చిత్ర పరిశ్రమలో చాలా గౌరవంగా, ఒక గుర్తింపుగా భావిస్తారు. కానీ ఇప్పుడు ఆ పురస్కారాలను ప్రభుత్వాలు అందజేయకపోవడం చాలా బాధాకరం. దీనివల్ల ఒక తరం నటీనటులకు అసలు నంది పురస్కారాలు అంటే తెలిసే అవకాశం కూడా లేకుండా పోతుంది. నంది పురస్కారాలు ఇచ్చే సంప్రదాయాన్ని ప్రభుత్వాలు మళ్లీ పునరుద్ధరించాలి’ అని కోరారు. ‘సేవాభావంతోనే నేను రాజకీయాల్లోకి వెళ్లాను, కానీ అక్కడ మారిన పరిస్థితుల్లో ఇమడలేక బయటకు వచ్చాను, మళ్లీ ఆ వైపు వెళ్లే ఆలోచన ప్రస్తుతానికైతే లేదు’ అని నరేశ్ తెలిపారు. రాజమౌళి, మహేశ్‌బాబు కాంబినేషన్‌లో రూపొందే సినిమా తెలుగు పరిశ్రమ ఖ్యాతిని మరో స్థాయికి తీసుకెళుతుందని చెప్పారు. నటుడిగా తనని తాను కొత్త కోణంలో ఆవిష్కరించుకొనే పాత్రలు మరిన్ని వస్తున్నాయనీ, నెగెటివ్ రోల్స్ చేయాలనుందని ఆయన చెప్పారు.