అభ్యుదయ వాది.. ఎందరికో మార్గదర్శి!

ABN, Publish Date - Nov 16 , 2024 | 06:03 AM

తెలుగు సినిమా స్వర్ణయుగానికి చెందిన దర్శకుల్లో ఒకరు, ఉత్తమాభిరుచితో విజయవంతమైన చిత్రాలను అందించిన వ్యక్తి తాతినేని ప్రకాశరావు. కృష్ణాజిల్లా కపిలేశ్వరపురం గ్రామంలో 1924 నవంబర్‌ 16న జన్మించిన ప్రకాశరావు ప్రజానాట్యమండలి కళాకారుడు. అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి. నికార్సయిన కమ్యూనిస్ట్‌.

తాతినేని ప్రకాశరావు శత జయంతి సంవత్సరం పూర్తి

తెలుగు సినిమా స్వర్ణయుగానికి చెందిన దర్శకుల్లో ఒకరు, ఉత్తమాభిరుచితో విజయవంతమైన చిత్రాలను అందించిన వ్యక్తి తాతినేని ప్రకాశరావు. కృష్ణాజిల్లా కపిలేశ్వరపురం గ్రామంలో 1924 నవంబర్‌ 16న జన్మించిన ప్రకాశరావు ప్రజానాట్యమండలి కళాకారుడు. అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి. నికార్సయిన కమ్యూనిస్ట్‌. సినిమాల ద్వారా తన భావాలను ప్రజలకు చెప్పాలనీ, వారిని చైతన్యవంతుల్ని చేయాలనే ఉద్దేశంతో 1947లో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. ఎల్వీ ప్రసాద్‌ దగ్గర శిష్యుడిగా చేరి ‘ద్రోహి’, ‘మనదేశం’ చిత్రాలకు పని చేశారు. ఆ తర్వాత విజయా సంస్థలోని దర్శకత్వ శాఖలో చేరారు. ‘పాతాళభైరవి’, ‘పెళ్లి చేసి చూడు’ చిత్రాలకు పని చేశారు. ‘పెళ్లి చేసి చూడు’ చిత్రానికి పని చేస్తున్న సమయంలోనే ‘పల్లెటూరు’ (1952) చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. ఇక అప్పటినుంచి 30 ఏళ్ల పాటు దర్శకుడిగా, నిర్మాతగా ప్రకాశరావు సినీజీవితం విజయవంతంగా సాగింది. రాశి కంటే వాసికి ప్రాధాన్యం ఇవ్వడంతో ఈ 30 ఏళ్ల కాలంలో కేవలం 30 చిత్రాలు మాత్రమే రూపొందించగలిగారు ప్రకాశరావు. ఇందులో తెలుగు చిత్రాలే కాదు తమిళ, హిందీ చిత్రాలు కూడా ఉన్నాయి. కుటుంబ సంబంధాలకు, ఆ నాటి సమాజంలోని సమస్యలకు అద్దం పట్టిన చిత్రాలనే ఎక్కువగా ఆయన రూపొందించారు. అందుకే ఆయన సామాన్య ప్రేక్షకుడికి దగ్గర కాగలిగారు. తను అనుకున్న లక్ష్యం సాధించగలిగారు. ప్రకాశరావు దర్శకత్వం వహించిన చిత్రాలు అధిక శాతం విజయం సాధించడం గమనార్హం. శనివారంతో ప్రకాశరావు శత జయంతి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ఆయన సినీ జీవిత చిత్రంలోని కొన్ని రీళ్లు...

  • తాతినేని ప్రకాశరావు దర్శకత్వం వహించిన రెండో చిత్రం ‘పిచ్చిపుల్లయ్య’. ఇది నిర్మాతగా ఎన్టీఆర్‌కు తొలి సినిమా కావడం విశేషం. మాస్‌ హీరోగా ఇమేజ్‌ను పక్కన పెట్టి పూర్తి విభిన్నంగా ఉండే పల్లెటూరి బైతు పాత్రను ఎన్టీఆర్‌ ఇందులో పోషించడం విశేషం.

  • ఆ రోజుల్లోనే ఆయన మల్టీస్టారర్‌ చిత్రాలకు దర్శకత్వం వహించారు. - ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ కలసి నటించిన రెండు చిత్రాలు ‘చరణదాసి’, ‘పరివర్తన’ తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో రూపుదిద్దకున్నాయి. ‘చరణదాసి’ చిత్రంలోని ఓ స్వప్న సన్నివేశంలో ఎన్టీఆర్‌ శ్రీరాముడిగా, అంజలీదేవి సీతగా కనిపిస్తారు. ఎన్టీఆర్‌ తొలిసారిగా శ్రీరాముడి గెటప్‌ వేసుకుంది ఈ చిత్రంలోనే. అలాగే ‘పరివర్తన’ చిత్రంలో ఏయన్నార్‌ హీరో అయితే, విలన్‌గా ఎన్టీఆర్‌ నటించడం మరో విశేషం. ఇందులో అక్కినేనికి చెల్లెలిగా, ఎన్టీఆర్‌కు భార్యగా సావిత్రి నటించారు.

  • హిందీలో దాదాపు పది చిత్రాలకు దర్శకత్వం వహించారు ప్రకాశరావు. తెలుగు, తమిళ సినిమాల జోలికి పోకుండా ఆయన ఎనిమిదేళ్ల పాటు హిందీ చిత్రాల మీదే దృష్టి పెట్టడం గమనార్హం.

  • ముగ్గురు ముఖ్యమంత్రులు ఎమ్జీఆర్‌, ఎన్టీఆర్‌, జయలలితలను డైరెక్ట్‌ చేసిన ఘనత తాతినేని ప్రకాశరావుదే.

  • ఎన్టీఆర్‌ను ‘బావగారు’ అని పిలిచేవారు ప్రకాశరావు. ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు మద్దతు పలికారు. తెలుగుదేశం పార్టీకి కోశాధికారిగా వ్యవహరించిన ప్రకాశరావు ఒక దశలో ఎన్టీఆర్‌తో విభేదించి, ఆయనకు వెన్నుపోటు పొడిచిన నాదెళ్ల భాస్కరరావుకు మద్దతు పలకడం ఆసక్తికర పరిణామం.

  • ప్రకాశరావు తనయుడు ప్రసాద్‌ కూడా దర్శకుడై తండ్రికి తగ్గ తనయుడనిపించుకున్నారు. ప్రసాద్‌ కుమారుడు సత్య కూడా దర్శకుడిగా మారడం గమనార్హం. ఇలా ఒకే కుటుంబంలో మూడు తరాలకు చెందిన వాళ్లు దర్శకులు కావడం అరుదైన విషయమే.

Updated Date - Nov 16 , 2024 | 06:03 AM