వ్యూహం సర్టిఫికెట్‌పై ఈనెల 9లోగా నిర్ణయం తీసుకోండి
ABN , Publish Date - Feb 06 , 2024 | 01:09 AM
రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘వ్యూహం’ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ జారీచేసే అంశంపై మరోసారి నిర్ణయం తీసుకోవాలని.. ఇందుకోసం రివైజింగ్ కమిటీని మళ్లీ ఏర్పాటు చేయాలని...
సెన్సార్ బోర్డుకు హైకోర్టు ఆదేశాలు
రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘వ్యూహం’ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ జారీచేసే అంశంపై మరోసారి నిర్ణయం తీసుకోవాలని.. ఇందుకోసం రివైజింగ్ కమిటీని మళ్లీ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు జారీచేసిన సెన్సార్ సర్టిఫికెట్‌ను సింగిల్ జడ్జి రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ నిర్మాత దాసరి కిరణ్‌కుమార్, దర్శకుడు రాంగోపాల్ వర్మ దాఖలు చేసిన అప్పీళ్లపై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. తాజాగా మళ్లీ నియామకమయ్యే రివైజింగ్ కమిటీ ఈ సినిమాను వీక్షించి.. ఈనెల 9లోగా సర్టిఫికెట్ జారీచేసే అంశంపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సింగిల్ జడ్జి తీర్పుతో ఏకీభవించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో భావప్రకటనా స్వేచ్ఛ ప్రాథమిక హక్కు అని.. కానీ అది చట్టబద్ధమైన పర్యవేక్షణలో కొనసాగుతుందని వ్యాఖ్యానించింది. ఆర్టికల్ 19 కల్పించిన స్వేచ్ఛ ప్రకారం వాస్తవ ఘటనలను తమ తమ కోణాల్లో ప్రస్తావించుకునే ప్రాథమిక హక్కు అందరికీ ఉంటుందని తెలిపింది. రివైజింగ్ కమిటీని పునర్నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎ్‌ఫసీ) ఛైర్మన్ చెప్పారని పేర్కొంది. ఒకవేళ ఇప్పటికీ ఏర్పాటు చేయకపోయినా రివైజింగ్ కమిటీని మళ్లీ ఏర్పాటు చేయాలని తాము ఆదేశాలు జారీచేస్తున్నామని స్పష్టం చేసింది. ఆ కమిటీ సినిమాను వీక్షించి.. ఈనెల 9లోగా నిర్ణయం తీసుకోవాలని.. ఆ నిర్ణయాన్ని అప్పీలుదారులకు తెలియజేయాలని పేర్కొంది. ఈ మేరకు పిటిషన్లలో విచారణను ముగించింది. తొలుత ఈ సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వడానికి సెన్సార్ బోర్డు ఎగ్జామినేషన్ కమిటీ తిరస్కరించింది. ఆ తర్వాత ఏర్పాటైన రివైజింగ్ కమిటీ పలు సవరణలు సూచిస్తూ సర్టిఫికెట్ జారీచేసింది. ఒకసారి తిరస్కరించిన తర్వాత మళ్లీ సర్టిఫికెట్ ఇవ్వడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సినిమా ప్రతిపక్ష నాయకులను కించపర్చేలా.. కోర్టు ధిక్కారణకు దారితీసేలా ఉందని పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి ధర్మాసనం.. సదరు సినిమాకు జారీచేసిన సెన్సార్ సర్టిఫికెట్‌ను కొట్టేస్తూ.. చట్టప్రకారం మూడువారాల్లో మళ్లీ నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీచేసింది. సింగిల్ జడ్జి ఆర్డర్‌పై దర్శక నిర్మాతలు డివిజన్ బెంచ్‌లో అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్.. ఈనెల 1న తీర్పు రిజర్వు చేసి.. సోమవారం తుది తీర్పు వెలువరించింది.