Hyderabad Drugs Case: సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ అరెస్టు

ABN , Publish Date - Jul 15 , 2024 | 04:22 PM

హైద్రాబాదులో నార్కోటిక్ బ్యూరో తాజాగా జరిపిన దాడిలో ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ అరెస్టయినట్టుగా సమాచారం. గతంలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. సినిమా పరిశ్రమతో సంబంధం వున్న పలువురు ఈ దాడిలో దొరికినట్టుగా తెలుస్తోంది

Rakul Preet Singh and her brother Aman Preet

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో డ్రగ్స్ అణచివేతకు ప్రాధాన్యం ఇచ్చి, ఎప్పటికప్పుడు వాటి నియంత్రణకు ఆదేశాలు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పదవిని అధిష్టించిన రోజు నుండి రేవంత్ రెడ్డి మాదక ద్రవ్యాలు అణచివేతకు ప్రత్యేక బలగాలను కూడా ఏర్పాటు చేసి, వాటి నియంత్రణ కోసం ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నారు. ఇందులో భాగంగానే నార్కోటిక్ బ్యూరో, పోలీసు డిపార్ట్మెంట్ ఆకస్మిక తనికీలు కూడా చేస్తున్నారు. ఇలా ఇప్పటికి ఎంతోమందిని అరెస్టు చేశారు, చేస్తున్నారు కూడా. అందులో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు, సినిమా రంగానికి చెందినవారు వున్నా, ఎవరినీ వదలకుండా తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యం మాట వినపడకూడదు అని ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా మంచి శుభ పరిణామం. (Rakul Preet Singh brother Aman Preet Singh arrested in a drugs case)

amanpreetsingh.jpg

ఇలా ఎప్పటికప్పుడు ఆకస్మిక దాడులు చేస్తూ తెలంగాణ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ భారీగా డ్రగ్స్ పట్టుకుంటున్నారు. తాజాగా సైబరాబాదు పరిధిలోని రాజేంద్రనగర్ డివిజన్ లో ఈ డిపార్ట్మెంట్ ఐదుగురు నైజీరియన్స్ ని అరెస్టు చేసింది. వాళ్ళ దగ్గర నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న మరి ఐదుగురిని కూడా అరెస్టు చేసినట్టుగా సమాచారం. వీరిలో ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు కూడా వున్నట్టుగా భోగట్టా. (Rakul Preet Singh brother Aman Preet Singh arrested)

ఇలా పట్టుబడ్డ వారిలో సినీ నటి రకుల్ ప్రీత్‌ సింగ్‌ సోదరుడు అమన్‌ ప్రీత్ సింగ్‌ అరెస్ట్‌ అయినట్టుగా తెలుస్తోంది. గతంలో రకుల్ ప్రీత్ కూడా ఈ డ్రగ్స్‌ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆమె సోదరుడు అమన్ ప్రీత్ అరెస్టు కావటంతో, పరిశ్రమతో సంబంధం వున్న చాలామంది ప్రముఖులు వున్నారు అని కూడా అంటున్నారు. గతంలో సినిమా పరిశ్రమకి చెందిన ఎంతోమందిని నార్కోటిక్ బ్యూరో పిలిపించి విచారణ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

Updated Date - Jul 15 , 2024 | 04:22 PM