Raashi Khanna: రాశి'ఫలం' బాగోలేదు
ABN , Publish Date - Apr 30 , 2024 | 01:41 PM
అప్పుడెప్పుడో వచ్చిన 'ప్రతి రోజు పండగే' సినిమా రాశి ఖన్నాకి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తరువాత ఓ రెండు తెలుగు సినిమాలు చేసినా అవి బాక్స్ ఆఫీస్ దగ్గర నడవలేదు. గత మూడేళ్ళ నుండి ఆమె తెలుగు సినిమా విడుదల కాలేదు, ఇప్పుడు ఒక అనువాద సినిమా విడుదలవుతోంది. ఇప్పుడైనా రాశి'ఫలం' ఎలా ఉంటుందో చూడాలి
తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టి సుమారు పదేళ్లు అవుతున్నా రాశి ఖన్నాకి పెద్దగా చెప్పుకోదగ్గ బ్రేక్ రాలేదనే చెప్పాలి. కథానాయికగా మొదటి సినిమా 'ఊహలు గుస గుస లాడే' తో మంచి పేరు తెచ్చిపెట్టినా ఆ తరువాత రాశిఖన్నాకి అంత చెప్పుకోదగ్గ పాత్రలు రాలేదనే చెప్పాలి. మధ్యలో ఏవో ఒకటి రెండు సినిమాలు 'సుప్రీమ్', 'జై లవకుశ' లాంటివి విజయం సాధించినా రాశి ఖన్నాకి పెద్దగా బ్రేక్ రాలేదు.
2019లో వచ్చిన 'ప్రతిరోజు పండగే' సినిమా చాలా పెద్ద విజయం సాధిచింది. సాయి దుర్గ (ధరమ్) తేజ్ ఇందులో కథానాయకుడు, మారుతీ దర్శకుడు. ఈ సినిమా వినోదాత్మక నేపధ్యంలో వచ్చిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఇదే రాశి ఖన్నా కెరీర్ లో కూడా పెద్ద విజయం అని చెప్పొచ్చు.
ఆ తరువాత రాశి ఖన్నా, 'వరల్డ్ ఫేమస్ లవర్' లో విజయ్ దేవరకొండ పక్కన నటించింది, కానీ ఆ సినిమా పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఆ తరువాత రెండు తెలుగు సినిమాలు చేసింది రాశి ఖన్నా కానీ అవేమీ అంత పెద్దగా నడవలేదనే చెప్పాలి. ఈ రెండు సినిమాలు 2022లో వచ్చాయి.
ఆ తరువాత రాశి ఖన్నా తెలుగు సినిమాలు ఏవీ విడుదల కాలేదు. తమిళం, హిందీ సినిమాలు చేసింది, కానీ ఎక్కడా ఆమెకి బ్రేక్ వచ్చినట్టు మాత్రం కనిపించలేదు. ఇప్పుడు కూడా ఆమె నటించిన తమిళ సినిమా 'అరన్ మనై 4' తెలుగులో 'బాక్' అని విడుదలవుతోంది. తెలుగులో అయితే ఈ సినిమాకి బజ్ అసలు లేదనే చెప్పాలి. ఖుష్బూ భర్త సుందర్ సి ఈ సినిమాకి దర్శకుడు.
తెలుగులో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక చేశారు కానీ, ఆ ఈవెంట్ కి వొంట్లో బాగోలేదని దర్శకుడు రాలేదు, ముఖ్య అతిధులు కూడా అంతంత మాత్రంగానే వచ్చారు. ఖుష్బూ ఈ వేడుకకి తన భర్త తరపున వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఆమె చేతిలో తమిళ సినిమాలు, ఒక తెలుగు సినిమా వున్నాయి. 'తెలుసు కదా' అనే సినిమాలో సిద్దు జొన్నలగడ్డ పక్కన చేస్తోంది, ఈ సినిమా చిత్రీకరణ దశలో వుంది. ప్రముఖ డిజైనర్ నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా మారుతున్నారు.
ఇప్పుడు రాశిఖన్నా ఆశలన్నీ ఈ తెలుగు సినిమాపైనే వున్నాయి. ఎందుకంటే తెలుగులో ఆమెకి చాలా విరామం వచ్చేసింది, దానికి తోడు ఇక్కడ బ్రేక్ కూడా ఈమధ్యకాలంలో రాలేదు. అదీ కాకుండా పెద్ద సినిమాలో ఛాన్సులు కూడా రావటం లేదు. ఆలా రావాలంటే ఒక మంచి బ్రేక్ ఆమెకి రావాలి. అది 'తెలుసు కదా' పైనే ఆధారపడి వుంది.