పట్నాలో పుష్ప రూల్
ABN , Publish Date - Nov 18 , 2024 | 04:14 AM
‘నేను మొదటిసారి బిహార్‌కు వచ్చాను. నా హిందీ అంత బావుండదు. తప్పులు మాట్లాడితే క్షమించండి. ఎవరికీ తలవంచని పుష్ప నేడు మీ ముందు తలవంచుతున్నాడు. మీ అభిమానమే ‘పుష్ప 2: ది రూల్’ లాంటి మంచి చిత్రాన్ని తీయడానికి మాకు ప్రేరణ’ అని అల్లు అర్జున్ అన్నారు....
‘నేను మొదటిసారి బిహార్‌కు వచ్చాను. నా హిందీ అంత బావుండదు. తప్పులు మాట్లాడితే క్షమించండి. ఎవరికీ తలవంచని పుష్ప నేడు మీ ముందు తలవంచుతున్నాడు. మీ అభిమానమే ‘పుష్ప 2: ది రూల్’ లాంటి మంచి చిత్రాన్ని తీయడానికి మాకు ప్రేరణ’ అని అల్లు అర్జున్ అన్నారు. ఆయన హీరోగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘పుష్ప 2’. ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని బిహార్ రాజధాని పట్నాలో భారీ జనసందోహం మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘‘పుష్ప’ చిత్రాన్ని పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఆ సినిమా సూపర్‌హిట్ అయ్యిందంటే ఆ గొప్పదనం నాది కాదు, ప్రేక్షకులదే. మీ ప్రేమే ‘పుష్ప 2: ది రూల్’ చిత్రాన్ని ఇంత గొప్పగా తీయడానికి కారణమైంది. డిసెంబర్ 5న మీ ముందుకు రాబోతోంది. తప్పకుండా మీ అందరినీ అలరిస్తుంది. మీ సమక్షంలో ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను’ అని చెప్పారు. రష్మిక మందన్న మాట్లాడుతూ ‘ఇంతమంది అభిమానులు ‘పుష్ప’ ప్రపంచంలోకి వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది.
రెండు సంవత్సరాలుగా అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. మీ అందరి అంచనాలకు మించి సినిమా ఉండబోతోంది’ అని తెలిపారు. ‘పట్నా ప్రజల నుంచి ఈ స్థాయి ఆదరణను ఊహించలేదు. ఈ గొప్పదనం అల్లు అర్జున్, సుకుమార్‌కు దక్కుతుంది’ అని నిర్మాత యలమంచిలి రవి, నవీన్ యెర్నేని తెలిపారు. ‘పుష్ప 2’ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం భారీ ఎన్నికల ప్రచార సభను తలపించింది. దేశవ్యాప్తంగా ఉన్న అల్లు అర్జున్ అభిమానులు తరలివచ్చారు. గాంఽధీ మైదానం జనాలతో కిటకిటలాడిపోయింది. ఈ కార్యక్రమానికి సుమారు రెండు లక్షలమంది హాజరయ్యారని అంచనా. ‘‘పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్’ అంటూ ఆయన చెప్పిన డైలాగ్‌లకు అభిమానుల కేరింతలతో సభాప్రాంగణం మార్మోగింది. బిహార్ డిప్యూటీ సీఎం విజయ్ సేన సాహెబ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.