ప్లీజ్‌.. అలా పిలవొద్దు

ABN , Publish Date - Nov 12 , 2024 | 06:29 AM

తన అభిమానులతో పాటు సినీ ప్రముఖులకు అగ్రనటుడు కమల్‌ హాసన్‌ ఓ విజ్ఞప్తి చేశారు. తనను ‘ఉలగనాయకన్‌’ (విశ్వనటుడు) అంటూ పిలవొద్దని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో కోరారు. కమల్‌ హాసన్‌, లేదా కమల్‌ లేదా కేహెచ్‌ అని పిలిస్తే...

తన అభిమానులతో పాటు సినీ ప్రముఖులకు అగ్రనటుడు కమల్‌ హాసన్‌ ఓ విజ్ఞప్తి చేశారు. తనను ‘ఉలగనాయకన్‌’ (విశ్వనటుడు) అంటూ పిలవొద్దని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో కోరారు. కమల్‌ హాసన్‌, లేదా కమల్‌ లేదా కేహెచ్‌ అని పిలిస్తే చాలని సూచించారు. కళ కంటే కళాకారుడు గొప్పకాదని ఆయన అభిప్రాయపడ్డారు. భారతీయ చిత్రపరిశ్రమలో అగ్రహీరోగా ఉన్న కమల్‌ హాసన్‌ను అనేక మంది ‘ఉలగనాయగన్‌’ అంటూ సంభోదిస్తుంటారు. ఇకపై అలా పిలవొద్దని ఆయన కోరారు. ‘నాపై మీకున్న అపారమైన ప్రేమాభిమానాల వల్ల ‘ఉలగనాయగన్‌’ అంటూ ముద్దుగా పిలుస్తుంటారు. మీ ప్రేమకు ఎన్నటికీ కృతజ్ఞుడను. సినిమా కళ అనేది ఒక వ్యక్తి కంటే గొప్పది. అలాంటి కళను మరింతగా నేర్చుకుంటూ పరిణామం చెందుతున్న నిత్యనూతన విద్యార్థిని నేను. ఇతర కళల తరహాలోనే సినిమా కూడా ప్రతి ఒక్కరికీ చెందినది.


ప్రతిభావంతులైన కళాకారులు, సాంకేతిక నిపుణులు, ప్రేక్షకుల కలయికతోనే సినిమా రూపుదిద్దుకుంటుంది. కళ కంటే కళకారుడు గొప్పవాడు కాదన్నది నా ప్రగాఢ విశ్వాసం. నిరంతర అభ్యాసంతోనే పురోగతిని సాధించవచ్చు’ అని కమల్‌ విజ్ఞప్తి చేశారు. గతంలో హీరో అజిత్‌ను ఆయన అభిమానులు ‘తల’ అంటూ సంబోధించేవారు. దీన్ని గ్రహించిన అజిత్‌.. తనను ‘తల’ అని పిలవొద్దని అజిత్‌ లేదా అజిత్‌ కుమార్‌ లేదా ఏకే అని మాత్రమే పిలవాలని విజ్ఞప్తి చేసిన విషయం తెల్సిందే.

చెన్నై (ఆంధ్రజ్యోతి)

Updated Date - Nov 12 , 2024 | 06:29 AM