‘లోపలికి రా చెప్తా’.. ఇదేం టైటిలయ్యా..
ABN , Publish Date - Dec 07 , 2024 | 10:59 PM
‘లోపలికి రా చెప్తా’. టైటిల్ వినగానే అందరూ అనుకునే మాట.. ‘ఇదేం టైటిలయ్యా’ అనే. మేకర్స్ వినూత్నంగా ఆలోచించి పెట్టిన ఈ సినిమా నుండి శనివారం ఫస్ట్ సాంగ్‌ని విడుదల చేశారు. వివరాల్లోకి వెళితే..
మాస్ బంక్ మూవీస్ పతాకంపై కొండా వెంకట రాజేంద్ర, మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ హీరోహీరోయిన్లుగా లక్ష్మీ గణేష్ మరియు వెంకట రాజేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న హర్రర్ బేస్డ్ కామెడీ ఎంటర్ టైనర్ చిత్రం ‘లోపలికి రా చెప్తా’. టైటిల్ వినగానే అందరూ అనుకునే మాట.. ‘ఇదేం టైటిలయ్యా’ అనే. మేకర్స్ వినూత్నంగా ఆలోచించి ఈ టైటిల్ పెట్టారో, లేక కంటెంట్ పరంగా అదే టైటిల్ కరెక్ట్ అని భావించారో తెలియదు కానీ.. ఈ టైటిల్‌తో సినిమా ప్రకటించగానే ఒక్కసారిగా అంతా ఈ టైటిల్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర మొదటి సాంగ్‌ని శనివారం వినూత్నంగా విడుదల చేశారు మేకర్స్.
Also Read-Allu Arjun: చెప్పను బ్రదర్ టు థ్యాంక్యూ కళ్యాణ్ బాబాయ్.. మీరు మారిపోయారు సార్
‘లోపలికి రా చెప్తా’ సినిమాలో హీరో డెలివరీ బాయ్‌గా నటించడంతో.. ఈ సినిమా మొదటి సాంగ్‌ని ఓ డెలివరీ బాయ్‌తోనే విడుదల చేయించి.. సినిమా కంటెంట్‌కు కరెక్ట్ అర్థాన్నిచ్చారు మేకర్స్. సహజత్వానికి భిన్నంగా ఓ సామాన్యమైన డెలివరీ బోయ్ జాఫర్‌తో ఈ చిత్ర ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్ర ఆడియో హక్కులను సరెగమ ఆడియో కంపెనీ దక్కించుకుంది.
ఇక ఫస్ట్ సాంగ్ విడుదల సందర్భంగా చిత్ర దర్శకుడు వెంకట రాజేంద్ర మాట్లాడుతూ.. మా చిత్రంలో హీరో క్యారెక్టర్ డెలివరీ బాయ్. అందుకే మా చిత్రంలో మొదటి సాంగ్‌ను ఓ డెలివరీ బాయ్‌తో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. అలాగే సంగీత దర్శకులు డేవ్ జాండ్ (‘ఈగల్’ ఫేమ్) సారథ్యంలో కపిల్ కపిలన్ ఈ పాట పాడారు. ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రస్తుతం షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతున్నాము. త్వరలోనే మరో పాటను, టీజర్‌ను విడుదల చేస్తామని తెలిపారు.