బిగ్‌బాస్ సీజన్ 8 గెలుపుగుర్రం నిఖిల్
ABN , Publish Date - Dec 16 , 2024 | 05:11 AM
ఒక టీవీ షో.. ప్రతి సంవత్సరం దాదాపు మూడు నెలల పాటు ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోయేలా చేస్తోంది. కొన్ని సంవత్సరాలుగా ప్రేక్షకులకు అంతులేని వినోదంతో పాటు మరిచిపోలేని జ్ఞాపకాల్ని పంచిన ఆ షో బిగ్‌బాస్....
ఒక టీవీ షో.. ప్రతి సంవత్సరం దాదాపు మూడు నెలల పాటు ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోయేలా చేస్తోంది. కొన్ని సంవత్సరాలుగా ప్రేక్షకులకు అంతులేని వినోదంతో పాటు మరిచిపోలేని జ్ఞాపకాల్ని పంచిన ఆ షో బిగ్‌బాస్. గత ఏడు సీజన్‌లు అందించిన వినోదానికి ఏ మాత్రం తగ్గకుండా సెప్టెంబర్ 1న మొదలైంది తెలుగు బిగ్‌బాస్ సీజన్ 8. 105 రోజుల పాటు ఆసక్తికరమైన మలుపులతో ప్రేక్షకులను విశేషంగా అలరించి.. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేతో ముగిసింది. బిగ్‌బాస్ సీజన్ 8 గేమ్ షో విజేత ఎవరో తెలిసిపోయింది. ఈ ఏడాది షో విన్నర్‌గా నిఖిల్‌ను వ్యాఖ్యాత నాగార్జున ప్రకటించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రామ్‌చరణ్.. విజేతకు ట్రోఫీతో పాటు రూ.55 లక్షల ప్రైజ్‌మనీ, మారుతీ సుజుకీ డాజ్లింగ్ డిజైర్ కారుని అందజేశారు. ఇప్పటివరకు జరిగిన అన్ని సీజన్ల కన్నా ఈ సీజన్ ప్రైజ్ మనీ ఎక్కువ కావడం విశేషం. విజేతకు చివరి వరకు గట్టి పోటీనిచ్చిన గౌతమ్‌కృష్ణ రన్నరప్‌గా మిగిలారు.
టాప్ 5 కంటెస్టెంట్లుగా పోటీ చేసిన నబీల్, ప్రేరణ, అవినాశ్‌లకు ప్రేక్షకుల నుంచి వచ్చిన ఓట్ల ఆధారంగా వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాలు దక్కాయి. ఎలిమినేషన్ ప్రక్రియలో ఐదో స్థానంలో నిలిచిన అవినాశ్‌ను హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ .. నాలుగో స్థానంలో ఉన్న ప్రేరణను కన్నడ స్టార్ ఉపేంద్ర.. మూడో స్థానంలో మిగిలిన నబీల్‌ను విజయ్‌సేతుపతి, మంజు వారియర్ బయటకు తీసుకుని వచ్చారు.
నభానటేష్ స్టెప్పులు
ఈ ఏడాది గ్రాండ్ ఫినాలేలో హీరోయిన్ నభా నటేశ్ స్పెషల్ పర్ఫామెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘పుష్ప 2’లోని ‘వస్తున్నాయ్ పీలింగ్స్’ పాటతో పాటు మరికొన్ని సాంగ్స్‌కు స్టెప్పులేసి అలరించారు. పలువురు సినీతారలు తళుక్కుమనడం.. శ్రీకృష్ణ, గీతా మాధురి పాటల ప్రదర్శన... టాప్ 5 కంటెస్టెంట్స్ ఆటపాటలతో షో ఆకట్టుకుంది. నాగార్జున జరిపిన సరదా సంభాషణలు.. సీజన్ 8 హౌజ్‌ను చూపించి అందర్నీ గతంలోకి తీసుకెళ్లడం.. ఇలా ఫినాలే ఆరంభం నుంచి విన్నర్‌ని ప్రకటించేదాకా వరకు హౌజ్‌లో జరిగిన హంగామా అంతా ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది.
పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు
సీజన్ 7 ఫినాలే తర్వాత జరిగిన గొడవల్ని, అల్లర్లను దృష్టిలో పెట్టుకున్న పోలీసులు.. ఈ ఏడాది అలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 300 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. అభిమానులు ఎవ్వరూ స్టూడియోస్‌కు రావొద్దని.. విజేతను ప్రకటించాక ఊరేగింపులు, ర్యాలీలు చేయొద్దని పోలీసులు సూచించారు.