పుష్ప ఇంటికి సినీ ప్రముఖులు

ABN , Publish Date - Dec 15 , 2024 | 01:46 AM

‘పుష్ప 2’ ప్రీమియర్‌ షో సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అరెస్టయిన అల్లు అర్జున్‌ మధ్యంతర బెయిలుపై శనివారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. అక్కడి నుంచి...

  • కంటతడి పెట్టిన సురేఖ, సుకుమార్‌

  • పలువురు సినీ ప్రముఖుల పరామర్శ

‘పుష్ప 2’ ప్రీమియర్‌ షో సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అరెస్టయిన అల్లు అర్జున్‌ మధ్యంతర బెయిలుపై శనివారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. అక్కడి నుంచి తన తండ్రి అల్లు అరవింద్‌తో కలసి నేరుగా గీతా ఆర్ట్స్‌ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ న్యాయవాది అశోక్‌ రెడ్డితో అరగంట చర్చించిన అనంతరం ఇంటికి వెళ్లారు. ఆయన ఇంటికి చేరుకోగానే అక్కడ వాతావరణం అంతా ఒక్కసారిగా ఉద్విగ్నభరితంగా మారింది. అల్లు అర్జున్‌ సతీమణి స్నేహారెడ్డి, కుమారుడు అయాన్‌, కూతురు అర్హ భావోద్వేగానికి గురయ్యారు. ఆయనను చూడడానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. పలువురు సినీ ప్రముఖులు అల్లు అర్జున్‌ను కలసి పరామర్శించారు. దర్శకుడు సుకుమార్‌, చిరంజీవి సతీమణి, సురేఖ.. అల్లుఅర్జున్‌ను హత్తుకుని కంటతడి పెట్టారు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, హరీష్‌ శంకర్‌, బోయపాటి శ్రీను నిర్మాత నవీన్‌ యెర్నేని,


వై. రవిశంకర్‌, దిల్‌రాజు, డి. సురేశ్‌బాబు హీరో వెంకటేశ్‌, విజయ్‌ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ, దగ్గుబాటి రానా, నాగచైతన్య, ఉపేంద్ర, సిద్ధు జొన్నలగడ్డ, సుధీర్‌బాబు, శర్వానంద్‌, ఆర్‌.నారాయణమూర్తి, సంగీత దర్శకుడు తమన్‌, రాజశేఖర్‌, జీవిత తదితరులు అల్లు అర్జున్‌ను కలిశారు. ప్రభాస్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ అల్లు అర్జున్‌తో ఫోన్‌లో మాట్లాడారు. శ్రీలీల, మంచు మనోజ్‌ సోషల్‌ మీడియా వేదికగా బన్నీకి మద్దతు తెలిపారు.

Updated Date - Dec 15 , 2024 | 01:46 AM