Mad Square: ‘లడ్డూ గాని పెళ్లి’ తర్వాత ‘స్వాతి రెడ్డి’ వచ్చేసింది..
ABN , Publish Date - Dec 28 , 2024 | 07:23 PM
‘లడ్డూ గాని పెళ్లి’ తర్వాత ‘స్వాతి రెడ్డి’ని వదిలారు ‘మ్యాడ్ స్క్వేర్’ మేకర్స్. ‘మ్యాడ్’ సినిమాతో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్‌ల త్రయం ఎలా ఎంటర్‌టైన్ చేసిందో తెలిసిందే. ఇప్పుడదే త్రయం మొదటి భాగానికి మించిన వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా నుండి సెకండ్ లిరికల్ సాంగ్‌ని మేకర్స్ వదిలారు.
2023లో విడుదలైన ‘మ్యాడ్’ మొదటి భాగం సంచలన విజయం సాధించడంతో.. దానికి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రం అనౌన్స్‌మెంట్‌తోనే భారీ అంచనాలు ఏర్పడేలా చేసుకుంది. అలాగే అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రచార చిత్రాలు ఆకట్టుకుంటూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా ‘మ్యాడ్’ విజయంలో సంగీతం కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. దీంతో ‘మ్యాడ్ స్క్వేర్’ పాటలపై ప్రేక్షకుల్లో మరింతగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన ‘లడ్డూ గాని పెళ్లి’ మంచి స్పందనను రాబట్టుకోగా.. ఇప్పుడు రెండవ గీతం ‘స్వాతి రెడ్డి’ అంటూ సాగే పాటను విడుదల చేసింది చిత్ర బృందం. ఇప్పుడీ పాట టాప్‌లో ట్రెండింగ్ అవుతోంది.
Also Read-Pawan Kalyan: అల్లు అర్జున్ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ ఎలా స్పందించారంటే..
మొదటి భాగంలో ‘కళ్ళజోడు కాలేజ్ పాప’ వంటి బ్లాక్ బస్టర్ పాటతో ఒక ఊపు ఊపిన భీమ్స్ సిసిరోలియో, ‘స్వాతి రెడ్డి’తో మరోసారి తన సత్తా చాటారు. రాబోయే రోజుల్లో ఈ పాట తెలుగునాట ఒక ఊపు ఊపడం ఖాయం అనేలా బీట్స్‌తో ఉత్సాహభరితమైన సంగీతాన్ని ఈ పాటకు కంపోజ్ చేశారు. అంతేనా.. ఈ పాటను స్వయంగా ఆయనే ఆలపించడం విశేషం. సురేష్ గంగుల సాహిత్యం ప్రేక్షకుల నాడిని పట్టుకున్నట్టుగా ఉంది. అందరూ పాడుకునేలా తేలికైన పదాలతో ఈ పాటకి ఆయన సాహిత్యం అందించారు.
సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్‌ల త్రయం మరోసారి నవ్వించడానికి.. మొదటి భాగానికి మించిన వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నారు. అదే ఉత్సాహం తాజాగా విడుదలైన రెండవ గీతంలోనూ కనిపించింది. ఇక ఈ పాటలో రెబా మోనికా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాట ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందించడం ఖాయంగా కనిపిస్తోంది. ‘మ్యాడ్’ సినిమాలో తనదైన ప్రత్యేక శైలి హాస్య సన్నివేశాలు, ఆకర్షణీయమైన కథనంతో ఎంతో పేరు తెచ్చుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్, ఈ సీక్వెల్‌తో మరోసారి నవ్వుల విందుని అందించబోతున్నారు. నిర్మాత సూర్యదేవర నాగ వంశీ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై శ్రీకర స్టూడియోస్‌తో కలిసి హారిక సూర్యదేవర, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2025, ఫిబ్రవరి 26న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.