Lucky Baskhar: ఈ స్థాయి స్పందన వస్తుందని ఊహించలేదంటోన్న టీమ్

ABN , Publish Date - Nov 01 , 2024 | 04:43 PM

‘మహానటి’, ‘సీతారామం’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన హ్యాట్రిక్ చిత్రం ‘లక్కీ భాస్కర్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రం మొదటి షో నుండే పాజిటివ్ టాక్‌‌ని సొంతం చేసుకుని థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తమ ఆనందాన్ని తెలియజేశారు.

Lucky Baskhar Movie Team

‘మహానటి’, ‘సీతారామం’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన హ్యాట్రిక్ చిత్రం ‘లక్కీ భాస్కర్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటించగా.. ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైందీ చిత్రం. ఈ సినిమా పట్ల ఎంతో నమ్మకంగా ఉన్న నిర్మాతలు, అక్టోబర్ 30వ తేదీ సాయంత్రం నుంచే ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. నిర్మాతల నమ్మకం నిజమై మొదటి షో నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. షో షోకి వసూళ్లు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ, దర్శకుడు వెంకీ అట్లూరి మీడియా సమావేశం నిర్వహించి తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతఙ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో ఎక్కడా సినిమా గురించి ఒక్క నెగటివ్ కామెంట్ కూడా కనిపించలేదు. అంతలా సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకే ప్రేక్షకులకు థాంక్స్ చెప్పడం కోసం మీడియా ముందుకి వచ్చాం. థాంక్స్ అనేది చాలా చిన్న మాట. సినిమా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమకు మాటల్లో చెప్పలేనంత సంతోషం కలుగుతోంది. అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలని అన్నారు.

Also Read- SS Rajamouli: సింహంతో రాజమౌళి.. ఇది ఊహకందని కథ


Lucky-Baskhar-1.jpg

దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. నాగవంశీ ఈ సినిమా మీద మొదటి నుండి ఎంతో నమ్మకంగా ఉన్నారు. సినిమా విడుదలకు ముందే వంశీ చెప్పారు. సినిమాకి ఎక్కడైనా నెగిటివ్ కామెంట్ వస్తే అడగండని. అయితే ఈ స్థాయి స్పందన లభిస్తుందని నేను కూడా ఊహించలేదు. ప్రీమియర్ షోల నుంచే సినిమాకి ఎంతో మంచి టాక్ వచ్చింది. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. దర్శకుడిగా ఇంత మంచి పేరు రావడమనేది చాలా అరుదైన విషయం. ఈ సినిమా పట్ల మీడియా మద్దతుకి, ప్రేక్షకుల ఆదరణకి చాలా చాలా థాంక్స్. పండగ అయినా కూడా మొదటిరోజు మంచి వసూళ్లు రావడం సంతోషంగా ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని చోట్లా మంచి స్పందన లభిస్తుంది. మలయాళం ప్రేక్షకులు దీనిని డబ్బింగ్ సినిమాలా చూడటం లేదు. సొంత సినిమాగానే భావిస్తున్నారు. ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం జరిగిందని సినిమా చూసిన ప్రేక్షకులు సంతృప్తి చెందుతున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు అనే తేడా లేకుండా సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికీ ప్రశంసలు దక్కుతున్నాయి. ఆ దేవుని ఆశీస్సులతోనే సినిమాకి ఈ స్థాయి ఆదరణ లభిస్తోందని నమ్ముతున్నానని తెలిపారు.

Also Read- ARM OTT: 2నెల‌ల త‌ర్వాత ఓటీటీకి.. టొవినో థామ‌స్ అదిరిపోయే యాక్ష‌న్ అడ్వెంచ‌ర్! ఎందులో, ఎప్ప‌టినుంచంటే


నటుడు రాజ్ కుమార్ కశిరెడ్డి మాట్లాడుతూ.. దుల్కర్ సల్మాన్ స్నేహితుడి పాత్ర కోసం వెంకీ నన్ను తీసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కశిరెడ్డి కొత్తగా కనిపించాడు అని అందరూ చెబుతుంటే సంతోషంగా ఉంది. అదే సమయంలో.. నా స్నేహితులు, తెలిసినవాళ్ళు సినిమా చూసి, ఫోన్ చేసి.. ముందు నా పాత్ర గురించి మాట్లాడట్లేదు. దర్శకుడు సినిమా అద్భుతంగా తీశాడని చెబుతున్నారు. సినిమా చూసి ఒక దర్శకుడి గురించి అలా మాట్లాడటం అనేది, నిజంగా గొప్ప విషయమని అన్నారు.


Venky-Atluri.jpg

ఇదే కార్యక్రమంలో మీడియా అడిగిన ప్రశ్నలకు నిర్మాత సూర్యదేవర నాగవంశీ, దర్శకుడు వెంకీ అట్లూరి సమాధానమిచ్చారు.

దర్శకుడు వెంకీ అట్లూరి:

బ్యాంకింగ్ నేపథ్యంలో ఒక సినిమా చేయాలని ఎప్పటినుంచో ఉంది. ప్రేమకథలు చేసే నేను, కాస్త భిన్నంగా సందేశాత్మక సినిమా చేద్దామని ‘సార్’ కథ రాసుకోవడం జరిగింది. ఈసారి ఇంకా విభిన్నంగా ఏదైనా చేద్దామనుకున్నాను. ఆ ఆలోచన నుంచే ఈ సినిమా కథ పుట్టింది.

యువతతో పాటు కుటుంబ ప్రేక్షకుల నుంచి కూడా ఈ సినిమాకి ఆదరణ లభిస్తోంది. ఇంకో ఆశ్చర్యకర విషయమేంటంటే.. ఇందులో ఫైట్లు లేనప్పటికీ, మాస్ ప్రేక్షకులు ఈ సినిమా నచ్చిందని చెబుతున్నారు. సినిమాలో హీరో గెలిచిన ప్రతిసారీ తామే గెలిచినట్లు ప్రేక్షకులు భావిస్తున్నారు. అదే ఈ సినిమాకి ఇంతటి స్పందన రావడానికి కారణమైంది.

బ్యాంకింగ్, షేర్స్ గురించి కొంత రీసెర్చ్ చేశాను. మా నాన్నగారి స్నేహితుడు కుటుంబరావు గారికి వీటిపై అవగాహన ఉంది. ఆయనతో కలిసి కొన్నిరోజులు ట్రావెల్ చేసి, వాటికి సంబంధించిన విషయాలను తెలుసుకొని కథలో పొందుపరిచాను.

సంభాషణలకు మంచి పేరు వస్తుండటం సంతోషంగా ఉంది. మణిరత్నం, త్రివిక్రమ్ వంటివారి స్ఫూర్తితోనే నేను సినీ పరిశ్రమలోకి వచ్చాను. నా సంభాషణల్లో త్రివిక్రమ్‌గారి ప్రభావం ఎంతో కొంత ఉంటుంది.

దుల్కర్ గారు స్టార్ అయినప్పటికీ, ఒక వ్యక్తి కాళ్ళు పట్టుకునే సన్నివేశం చేయడానికి ఏమాత్రం వెనకాడలేదు. ఇప్పుడు ఆ సన్నివేశానికి అంత మంచి పేరు రావడానికి కారణమే ఆయనే.


నిర్మాత సూర్యదేవర నాగవంశీ:

తెలుగులో కొత్త జానర్ సినిమా చేశాము. ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది. మొదటిరోజు కలెక్షన్లు చాలా బాగా వచ్చాయి. విడుదలైన ప్రతి చోటా కలెక్షన్లు బాగున్నాయి. లాంగ్ రన్‌లో ఈ చిత్రం ఇంకా మంచి వసూళ్లను రాబడుతుంది.

విడుదలకు ముందే ‘లక్కీ భాస్కర్’కి నెగటివ్ రివ్యూలు రావని నేను నమ్మకం వ్యక్తం చేశాను. ఇప్పుడు ఆ నమ్మకం నిజమైనందుకు సంతోషంగా ఉంది.

‘రాజావారు రాణిగారు’ సినిమాలో కశిరెడ్డి నటన, డైలాగ్ డెలివరీ నచ్చింది. అప్పటినుంచే అతనికి మా బ్యానర్‌లో అవకాశం ఇవ్వాలి అనుకున్నాము. లక్కీ భాస్కర్ రూపంలో అది కుదిరింది.

బాలకృష్ణ గారి ‘NBK 109’ టీజర్ మరియు విడుదల తేదీకి సంబంధించిన అప్డేట్‌ను వారం రోజుల్లో ఇస్తాము. ప్రస్తుతం మా బ్యానర్‌లో పలు సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా పని చేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఒక భారీ రాజకీయ నేపథ్యమున్న సినిమా చేసే ఆలోచన ఉంది.

Also Read-NTR: కొత్త NTR వచ్చేశాడు.. జూ. ఎన్టీయార్ ఏమన్నాడంటే

Also Read-Star Heroine: ఈ ఫొటోలోని పాప ఇప్పుడొక స్టార్ హీరోయిన్.. ఎవరో కనిపెట్టండి చూద్దాం!

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 01 , 2024 | 04:52 PM