Superstar Krishna: వేలాదిమంది అభిమానుల మధ్య కృష్ణ విగ్రహావిష్కరణ.. ఎక్కడో తెలుసా?
ABN , Publish Date - Mar 12 , 2024 | 05:08 PM
భీమవరం పట్టణం ఈరోజు కృష్ణ అభిమానులతో సందడిగా వుండింది. కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు చేతుల మీదుగా కృష్ణ విగ్రహావిష్కరణ ఈరోజు భీమవరం పట్టణంలో జరిగింది. వేలాదిగా వచ్చిన కృష్ణ అభిమానులు కృష్ణ చిత్రపటాలను శకటాలపై ఊరేగింపుగా తీసుకెళ్లి ఇదొక పెద్ద పండగలా జరిపారు. నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ప్రత్యేక అతిధిగా హాజరయ్యారు.
సూపర్ స్టార్ కృష్ణ గారు భౌతికంగా లేకపోయినా, కృష్ణ గారి అభిమానులు నిరంతరం ఆయన్ని స్మరించుకుంటూనే వున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కృష్ణగారికి వున్నన్ని అభిమాన సంఘాలు మరెవరికీ లేవంటే అతిశయోక్తి కాదు. ఈరోజు (మంగళవారం) భీమవరంలో కృష్ణగారి అభిమానులు సూపర్ స్టార్‌ని స్మరించుకుంటూ ఆయన విగ్రహావిష్కరణ చేశారు. దీనికి కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు హాజరయ్యారు.
ఆదిశేషగిరి రావుతో పాటు నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ, చదలవాడ శ్రీనివాసరావు కూడా ఈ కార్యక్రమానికి హాజరై.. కృష్ణ గారు సమాజానికి, చలన చిత్ర పరిశ్రమకి చేసిన సేవలను కొనియాడారు. 'కృష్ణగారు ఎల్లప్పుడూ, సమాజ హితం కోసం, తన చుట్టూ వుండే వారి కోసం, చలన చిత్ర పరిశ్రమ కోసం ఆలోచిస్తూ ఉండేవారు. ఎప్పుడూ నవ్వుతూ అందరికీ మంచి జరగాలి అని కోరుకునే వ్యక్తుల్లో కృష్ణగారు ముందుంటారు, అందుకే ఆయన సూపర్ స్టార్ అయ్యారు,' అని తమ్మారెడ్డి ఈ సందర్భంగా కృష్ణగారి సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిమంది కృష్ణ అభిమానులు భీమవరం చేరుకొని ఈ కార్యక్రమాన్ని ఒక పెద్ద పండగలా చేయడం విశేషం. కృష్ణ గారి అభిమానులు ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఐదు విగ్రహాలు పెట్టి ఈరోజు 6వ విగ్రహంగా భీమవరంలో భారీ ఎత్తున ఊరేగింపుగా వెళ్లి నివాళులు అర్పించారు.
అంతకు ముందు భారీ ఊరేగింపుగా పద్మాలయ థియేటర్ నుండి కృష్ణ అభిమానులు కృష్ణ చిత్రపటాలు వున్న శకటాలతో ఊరేగింపుగా విగ్రహావిష్కరణ ప్రదేశానికి వెళ్లి సందడి చేశారు. కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు చేతుల మీదుగా ఈ విగ్రహావిష్కరణ జరగడం అభిమానులకు సంతోషాన్ని కలిగించింది.
కృష్ణకి, అతని సోదరులు ఆదిశేషగిరి రావు, హనుమంతరావు ఇద్దరూ రెండు భుజాలవలే.. ఆయనకి చేదోడువాదోడుగా ఎల్లప్పుడూ ఉండేవారు. హనుమంతరావు కొన్ని సంవత్సరాల క్రితం కాలధర్మం చేశారు, నవంబర్ 2022లో కృష్ణ గారు కన్నుమూశారు.