Kiran Abbavaram Marriage: ఆ హీరోయిన్ ని పెళ్లిచేసుకోబోతున్న కిరణ్ అబ్బవరం, ఇంతకీ ఎవరంటే...
ABN , Publish Date - Mar 11 , 2024 | 03:02 PM
యువ నటుడు కిరణ్ అబ్బవరం త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్నాడని అధికారికంగా ప్రకటించాడు. పెళ్లి ఎప్పుడు, ఎక్కడ అనేది త్వరలో ప్రకటిస్తామని, పెద్దల సమక్షంలో పెళ్లి జరగనుందని చెప్పాడు. ఇంతకీ అతను చేసుకోబోయే ఆ కథానాయికి ఎవరంటే...
టాలీవుడ్ లో ఇంకో యువ నటుడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. తనదైన శైలిలో, యాసతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్న యువ నటుడు కిరణ్ అబ్బవరం ఇప్పుడు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. 'రాజావారు రాణిగారు' సినిమాతో తెలుగులో నటుడిగా ఆరంగేట్రం చేసిన కిరణ్ ఇప్పుడు అదే సినిమాలో కథానాయికగా చేసిన రహస్యని వివాహం చేసుకోబోతున్నాడు. (Young actor Kiran Abbavaram is all set to tie the knot soon with Rahasya)
ఈ విషయాన్నీ అయన ఈరోజు అధికారికంగా ప్రకటించారు. తన పక్కన కథానాయికగా చేసిన సహచర నటిని కిరణ్ అబ్బవరం పెళ్లిచేసుకోబోతున్నారని ఈరోజు ప్రకటించారు. వీరిద్దరూ ఆ సినిమా విడుదలైన దగ్గర నుంచి ప్రేమలో వున్నట్టుగా తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా ఇద్దరూ ఇక వివాహ బంధంలోకి అడుగు పెట్టాలని అనుకున్నారని, అందుకు తమ కుటుంబంలోని పెద్దల అనుమతి తీసుకున్నారని తెలిసింది.
కిరణ్ అబ్బవరం, రహస్య గత ఐదేళ్లుగా ప్రేమించుకుని, రిలేషన్ షిప్ లో ఉంటున్నారు అని ఈ ప్రకటనలో తెలిపారు. ఈ వారమే ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వీరి నిశ్చితార్ధం జరగనుంది అని తెలిపారు. తన జీవితాన్ని ఎప్పుడూ ప్రైవేట్ గా ఉంచుకుంటారు కిరణ్ అబ్బవరం. తన వ్యక్తిగత విషయాలు బయటకు ఫోకస్ కానివ్వరు.
ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్ గా, ప్రైవేట్ గా ఈ నిశ్చితార్ధ కార్యక్రమం జరగనుంది. ఈ నిశ్చితార్థం, పెళ్లికి సంబంధించిన తేదీలు, ఇతర వివరాలు త్వరలో కిరణ్ అబ్బవరం తరపున అతని టీమ్ వెల్లడించనుంది. కెరీర్ పరంగా చూస్తే కిరణ్ అబ్బవరం ప్రస్తుతం 'దిల్ రూబా' సినిమాతో పాటు 1970వ దశకం నేపథ్యంతో సాగే ఓ పీరియాడిక్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రాల పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తారు.