కన్నడ హీరో దర్శన్ అరెస్టు
ABN , Publish Date - Jun 12 , 2024 | 03:42 AM
ప్రియురాలి కోసం ఓ వ్యక్తిని హత్య చేయించారన్న ఆరోపణలతో ప్రముఖ కన్నడ హీరో దర్శన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నటి పవిత్ర గౌడతో దర్శన్ సన్నిహితంగా ఉండేవారు. ఈ నేపథ్యంలో పవిత్రకు అసభ్యకర సందేశాలు పంపిన రేణుకాస్వామి...

ప్రియురాలి కోసం ఓ వ్యక్తిని హత్య చేయించారన్న ఆరోపణలతో ప్రముఖ కన్నడ హీరో దర్శన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నటి పవిత్ర గౌడతో దర్శన్ సన్నిహితంగా ఉండేవారు. ఈ నేపథ్యంలో పవిత్రకు అసభ్యకర సందేశాలు పంపిన రేణుకాస్వామి (33) దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య కన్నడ ఇండస్ట్రీని కుదిపేసింది. దర్శన్ సూచనల మేరకే ఈ హత్య జరిగినట్టు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మైసూర్‌లో దర్శన్‌ను, ఆయన ప్రియురాలు పవిత్ర గౌడను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. దీంతో ఇప్పటివరకు రేణుకాస్వామి హత్య కేసులో సంబంధం ఉన్న మొత్తం 13 మందిని అరెస్టు చేసినట్టు మంగళవారం ప్రకటించారు. రేణుకాస్వామి ఓ మెడికల్ షాపులో పనిచేసేవాడు. ఆయన ఇటీవల పవిత్రగౌడపై సోషల్ మీడియాలో అసభ్య సందేశాలు పోస్టు చేశారని ఆరోపణలున్నాయి.
ఇదే విషయాన్ని ఆమె నటుడు దర్శన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో చిత్రదుర్గలోని దర్శన్ అభిమాన సంఘం ముఖ్యుడు రాఘవేంద్రకు సమాచారం ఇచ్చి, రేణుకాస్వామిని బెంగళూరుకు రప్పించారు. కామాక్షిపాళ్యలోని దర్శన్ అనుచరుడికి చెందిన కారుషెడ్‌లో ఈ నెల 8న రేణుకాస్వామిపై దాడి చేసి చంపేశారు. పోలీసులు దర్యాప్తులో 11 మంది అనుమానితులను అరెస్టు చేశారు. వారు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ హత్యతో సంబంధం ఉన్న దర్శన్, పవిత్రలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో పవిత్రగౌడ ఏ1 కాగా, దర్శన్ ఏ2గా ఉన్నారు. వారిని మంగళవారం సాయంత్రం 24వ ఏసీఎంఎం కోర్టు ముందు హాజరు పరిచారు.
బెంగళూరు (ఆంధ్రజ్యోతి)