Kalki 2898AD: 'కల్కి 2898ఏడి' సినిమా టార్గెట్ వెయ్యి కోట్లు?

ABN , Publish Date - Jun 24 , 2024 | 05:13 PM

ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వస్తున్న 'కల్కి 2898ఏడి' ఈనెల 27న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా వ్యాపారపరంగా సంచలనాల దిశగా వెళుతోంది. రికార్డు మొదటి రోజు కలెక్షన్స్ ఉండొచ్చని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చాలా కాలంగా థియేటర్ కి రాని ప్రేక్షకులు ఈ సినిమాతో మళ్ళీ థియేట్ర్స్ కి వస్తారని సినిమా పరిశ్రమ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది

Kalki 2898AD: 'కల్కి 2898ఏడి' సినిమా టార్గెట్ వెయ్యి కోట్లు?
Kalki 2898 AD

ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని, మాళవిక నాయర్ లాంటి నటీనటులతో వస్తున్న 'కల్కి 2898 ఏడి' సినిమా మొదటి రోజు కలెక్షన్స్ సంచలనంగా మారనుంది అని విశ్లేషకుల అభిప్రాయం. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ కథా నేపధ్యంగా వస్తున్న ఈ సినిమా ఈనెల 27న విడుదల కానుంది. ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఈ సినిమాకి టికెట్ ధరలు పెంచుకోవచ్చని, అలాగే అదనంగా ఒక షో కూడా వేసుకోవచ్చని ఉత్తర్వులు ఇచ్చింది.

అలాగే ఈ సినిమా వ్యాపారం కూడా మునుపెన్నడూ ఈ సినిమాకి లేని విధంగా జరిగిందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. 'కల్కి 2898ఎడి' సినిమాకు మొత్తంగా రూ. 389 కోట్ల థియేట్రికల్ హక్కుల వ్యాపారం జరిగినట్టు తెలుస్తొంది. ఈ సినిమా ఆంధ్రా థియేట్రికల్ హక్కులకు రూ. 85 కోట్లు దక్కాయి. సీడెడ్‍లో రూ. 27 కోట్లకు ఈ రైట్స్ అమ్ముడయ్యాయి. నైజాం థియేట్రికల్ హక్కులను రూ.70 కోట్లకు విక్రయించారు. ఆంధప్రదేశ్, తెలంగాణ రాష్టాల్లో ఈ సినిమాకి రూ.180 కోట్లకు పైగా థియేట్రికల్ వ్యాపారం జరిగిందని లెక్కలు వెల్లడయ్యాయి. వీటిలో కొన్ని ఇప్పటికే అడ్వాన్స్ రూపంలో ఇచ్చారు అని అంటున్నారు.

kalki.jpg

ఇదిలా ఉంటే ఈ సినిమా ఉత్తరాది థియేట్రికల్ హక్కులు రూ. 80 కోట్లకు అమ్ముడయ్యాయి అని తెలుస్తోంది. కర్ణాటక ప్రాంతంలో ఈ సినిమాకు రూ. 25 కోట్ల థియేట్రికల్ వ్యాపారం జరిగినట్టుగా తెలుస్తోంది. ఇతర రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ థియేట్రికల్ హక్కులు రూ. 22 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇక ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులు కూడా బాగానే పోయాయి, ఆ ప్రాంతం లో సుమారు రూ. 80 కోట్ల వరకు అమ్ముడుపోయింది అంటున్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 389 కోట్లకు ఈ సినిమా థియేట్రికల్ హక్కులు అమ్ముడయ్యాయి.

ఇదిలా ఉంటే, థియేట్రికల్ బిజినెస్ లెక్కల ప్రకారం, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే మొత్తం రూ. 800కోట్ల గ్రాస్ వసూళ్ళు రావాల్సి ఉంది. ప్రభాస్ అభిమానులు అయితే ఈ సినిమాని రూ. 1000 కోట్ల క్లబ్బులోకి చేర్చాలని చూస్తున్నారు. తమ అభిమాన నటుడి బాక్సాఫీసు సత్తా చూపించాలని అనుకుంటున్నారు. తెలంగాణాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు, ఆంధ్రప్రదేశ్ లో ఇంకా ఆన్ లైన్ బుకింగ్ ఓపెన్ చెయ్యలేదు. కానీ ఇప్పటి వరకు జోరు చూస్తుంటే మొదటిరోజు రూ. 50 కోట్ల వరకు రీచ్ అయ్యే అవకాశముందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఓవర్సీస్ లో 2.6 మిలియన్స్ డాలర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ క్రాస్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు.

Kalki-2.jpg

ఇక ఈ సినిమా ఓటీటీ బిజినెస్ కూడా రూ.300 కోట్ల వరకు జరిగిందని సమాచారం. దేశవ్యాప్తంగా ధియేటర్స్ లో ఎటు చూసినా ఇప్పుడు ఈ సినిమా మినహా మరో ఆప్షన్ లేకపోవడంతో మల్టీప్లెక్స్ చైన్స్ లో ఈ సినిమా ప్రదర్శన భారీగా ఉండనుంది. ఈ సినిమా ఐమ్యాక్స్ వెర్షన్ ను ఎక్స్ పీరియన్స్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో నెటిజెన్స్ తన అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు.

ఉత్తర భారతదేశంలో ప్రభాస్ కి మంచి క్రేజ్ వున్న సంగతి తెలిసిందే. దానికితోడు ఇందులో చాలామంది హిందీ నటులు అమితాబ్, దీపికా, దిశా పటాని లాంటి నటులు ఉండటంతో ఈ సినిమాకి అక్కడ కూడా మంచి ఓపెనింగ్స్ ఉంటుంది అని అంటున్నారు. రెండు

తెలుగు రాష్ట్రాలలో గత ఐదు నెలలుగా అగ్ర నటుడి సినిమా విడుదల కాలేదు. ఈ క్రమంలో ప్రభాస్ సినిమా కోసం సినిమా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫస్ట్ డే ఫస్ట్ షో టాక్ పాజిటివ్ గా వస్తే చాలు రెండు వారాల పాటు బాక్సాఫీసు వద్ద ఈ సినిమాకి కలెక్షన్ ల వర్షమే!!

Updated Date - Jun 25 , 2024 | 12:39 PM