అలుసుగా తీసుకుంటే సహించేది లేదు

ABN , Publish Date - Dec 13 , 2024 | 02:08 AM

తనపై నిరాధార వార్తలు ప్రచురిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కథానాయిక సాయిపల్లవి హెచ్చరించారు. తన మౌనాన్ని అలుసుగా తీసుకొని ఇష్టం వచ్చినట్లు అసత్యాలను ప్రచారం చేస్తున్నారంటూ...

తనపై నిరాధార వార్తలు ప్రచురిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కథానాయిక సాయిపల్లవి హెచ్చరించారు. తన మౌనాన్ని అలుసుగా తీసుకొని ఇష్టం వచ్చినట్లు అసత్యాలను ప్రచారం చేస్తున్నారంటూ మీడియా వైఖరిని తప్పుపట్టారు. ‘ఇక సహించేది లేదు. నా సినిమాలు, వ్యక్తిగత జీవితానికి సంబంఽధించి నిరాధార వార్తలు ప్రచురిస్తే, అది ఎంత పెద్ద మీడియా సంస్థ అయినా చర్య తీసుకోవడానికి వెనుకాడేది లేదు’ అని ఆమె ఘాటుగా స్పందించారు. ఓ కోలీవుడ్‌ మీడియా సంస్థ రాసిన వార్త సాయిపల్లవిలో ఈ ఆగ్రహానికి కారణమైంది. బాలీవుడ్‌ చిత్రం ‘రామాయణ’లో సాయిపల్లవి సీత పాత్ర పోషిస్తున్నారు. ఈ పాత్ర కోసం సాయిపల్లవి తన అలవాట్లను పక్కనపెట్టారనీ, పద్దతులు మార్చుకున్నారని ఓ కోలీవుడ్‌ వెబ్‌సైట్‌ వార్తను ప్రచురించింది. మాంసాహారం త్యజించి, పూర్తి శాఖాహారిగా మారారని, బయట భోజనం చేయడం లేదని, విదేశాలకు వెళ్లినా వంటవాళ్లను వె ంటపెట్టుకు వెళుతున్నారనేది ఆ వార్తల సారాంశం.


అయితే శాఖాహారిగా మారడం, ఇంటిభోజనం తినడం అసత్యమే అయినా ఈ మాత్రానికే సాయిపల్లవి మనసు ఇంతలా నొచ్చుకోవడం ఏమిటో అర్థం కావడం లేదంటున్నారు నెటిజన్లు. భారత సైన్యాన్ని అవమానించారనీ, కశ్మీర్‌ వేర్పాటువాదులను, గోసంరక్షణ ఉద్యమకారులను ఒకే గాటన కట్టారని గతంలో తనపై సోషల్‌ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్‌ జరిగినప్పుడు ఏమీ మాట్లాడని సాయిపల్లవి ఇప్పుడు మాత్రం ఇంత తీవ్రంగా స్పందించడం ఆశ్చర్యం కలిగిస్తుందని అంటున్నారు. అయితే పురాణేతిహాసాల ఆధారంగా తెరకెక్కే చిత్రాల్లో దేవీ దేవతల పాత్రలను పోషించే నటీనటులు భక్తిభావంతో తమ ఆహార విహారాల్లో మార్పులు చేసుకోవడం, సాత్వికంగా మారడం చాలాకాలంగా ఉన్నదే.

Updated Date - Dec 13 , 2024 | 02:08 AM