ఖాకీ పాత్రల్లో కథానాయికలు
ABN , Publish Date - Aug 12 , 2024 | 03:17 AM
వెండి తెరపై ఎప్పటికీ చెదిరిపోని క్రేజ్ ఉన్న పాత్రల్లో పోలీస్ ఆఫీసర్ రోల్స్ ముందుంటాయి. హీరోలు పోషించిన పోలీస్ పాత్రలు ఏ రేంజ్‌లో ఉంటాయో మనకు తెలిసిందే...
వెండి తెరపై ఎప్పటికీ చెదిరిపోని క్రేజ్ ఉన్న పాత్రల్లో పోలీస్ ఆఫీసర్ రోల్స్ ముందుంటాయి. హీరోలు పోషించిన పోలీస్ పాత్రలు ఏ రేంజ్‌లో ఉంటాయో మనకు తెలిసిందే.. అదే పాత్రను కథానాయికలు పోషిస్తే... ప్రేక్షకులను అలరించడానికి పోలీస్ ఆఫీసర్స్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న బాలీవుడ్ కథానాయికలపై ఓ సారి లుక్కేద్దాం.
లేడీ సింగం...
రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ ‘సింగమ్’ ఫ్రాంచైజీలో వచ్చిన మొదటి రెండు సినిమాలు ఎంతటి ఘనవిజయాలు అందుకున్నాయో తెలిసిందే. ఇప్పుడు మూడో భాగంగా ‘సింగం ఎగైన్’ సినిమాలో దీపిక పదుకొనే పోలీ్‌సగా అదరగొట్టడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 1న విడుదల కానుంది. అజయ్ దేవగణ్, రణ్‌వీర్ సింగ్, రోహిత్ శెట్టి, అర్జున్ కపూర్, కరీనా కపూర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
మర్డర్ మిస్టరీని చేధించే పాత్రలో...
అగ్ర నటి కరీనా కపూర్ ఇది వరకు ‘ఆంగ్రేజీ మీడియమ్’ సినిమాలో పోలీసాఫీసర్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఆమె మరోసారి ‘బకింగ్‌హామ్ మర్డర్స్’లో ఖాకీ దుస్తుల్ని ధరిస్తున్నారు. విభిన్నమైన సినిమాలను తెరకెక్కించే దర్శకుడిగా పేరొందిన హన్షల్ మెహతా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఓ మర్డర్ మిస్టరీ కథాంశంతో సాగనుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం సెప్టెంబరు 13న విడుదల కానుంది.
శత్రు సంహారానికై...
‘సాక్రెడ్ గేమ్స్’ వెబ్ సిరీస్, ‘సుల్తాన్’ సినిమాలో పోషించిన పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కుబ్రా సైత్. ‘దేవా’ సినిమాలో ఆమె శత్రుమూకల అంతు చూసే పోలీస్ అధికారి పాత్రను పోషిస్తున్నారు. ఇందులో షాహిద్ కపూర్, పూజా హెగ్దే కీలక పాత్రలు పోషిస్తున్నారు. రోషన్ ఆండ్రూస్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల కానుంది.
వెబ్ సిరీ్‌సలోనూ..
వైవిధ్యమైన పాత్రలతో వెండితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక భూమి పడ్నేకర్. ఇటీవలే క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘భక్షక్’తో ప్రేక్షకులను అలరించిన భూమి.. ప్రస్తుతం ‘దల్‌దాల్’ అనే ఓ వెబ్ సిరీ్‌సలో డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఇందులో ఆమె ఓ సైకో కిల్లర్‌తో తలపడనున్నారు. అమ్రిత్‌రాజ్ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
రెండో సీజన్ వచ్చేస్తోంది...
‘దహాడ్’ తొలి సీజన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అంజలి భాటిగా అలరించారు సోనాక్షి సిన్హా. ఎనిమిది భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ క్రైమ్ డ్రామాకు రీనా కగ్తీ, రుచికా ఒబెరాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ వర్మ, గుల్షన్, సోహుమ్ షా కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సిరీస్ విడుదల కానుంది.
పవర్‌ఫుల్ పాత్రలో...
‘కితనీ మొహబ్బత్ హై’ సీరియల్‌తో పాపులర్ అయ్యారు నటి క్రితిక కమ్ర. ఆమె గ్యారహ్ గ్యారహ్ (11:11) అనే వెబ్ సిరీ్‌సలో నటించారు. ఇటీవలే విడుదలైన ఈ ఇన్‌వెస్టిగేటివ్ డ్రామాలో ఆమె పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు.