Kalki2898AD: అశ్వద్ధామ, కర్ణుడు స్నేహితులా, అర్జునుడుపై కర్ణుడి పైచెయ్యి? ఎక్కడ భారతం ఇది...
ABN , Publish Date - Jun 29 , 2024 | 11:51 AM
'కల్కి 2898ఏడి' సినిమాలో అశ్వద్ధామ, కర్ణుడు స్నేహితులుగా చూపించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అలాగే కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడిని మహావీరుడుగా చూపిస్తూ, ఒక సమయంలో కర్ణుడు ధాటికి అర్జునుడు వెనకడుగు వేసినట్టుగా చూపిస్తాడు. ఇది ప్రేక్షకులకి సరిగ్గా మింగుడు పడటం లేదు. ఈ విషయాలు దర్శకుడు ఎక్కడ స్ఫూర్తిగా తీసుకున్నాడు అని ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన 'కల్కి 2898ఏడి' సినిమా జూన్ 27 న విడుదలైంది. ఈ సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, కమల్ హాసన్ ఇంకా చాలామంది నటీనటులు నటించారు. ఈ సినిమా తీయడానికి తనకి భారతీయ పురాణాలు స్ఫూర్తి అని చెప్పారు దర్శకుడు నాగ్ అశ్విన్ పలు సందర్భాల్లో. ఈ సినిమా కథ మొదలవడం ద్వాపరయుగంలో మహాభారత సంగ్రామం అయిన తరువాత శ్రీకృష్ణుడు, అశ్వద్ధామకి శాపం ఇస్తాడు. అలాగే అశ్వద్ధామ చేసిన పాపం పోవాలంటే కలియుగంలో కల్కిగా పుడతాను, అప్పుడు నువ్వు ఆ బిడ్డని కాపాడాలి అని కూడా చెప్తాడు కృష్ణుడు. ఇక కథ కలియుగంకి వస్తుంది.
దీపికా పదుకోన్ గర్భంలో పెరుగుతున్న బిడ్డ కల్కి అవతారమని అశ్వద్ధామ (అమితాబ్ బచ్చన్) ఆ బిడ్డని కాపాడటానికి సర్వప్రయత్నం చేస్తూ ఉంటాడు. చివర్లో విలన్స్ పైచేయిగా అనిపించినప్పుడు భైరవ పాత్రలో వున్న ప్రభాస్ ని కర్ణుడిగా చూపించి, అశ్వద్ధామకి సహాయం చెయ్యడానికి వస్తాడు. అదే సమయంలో కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడితో యుద్ధం చేస్తున్న అర్జునుడు కర్ణుడు ధాటికి తట్టుకోలేక అతని రథం కొంచెం వెనక్కి వెళుతుంది, ఎందుకంటే కర్ణుడి ప్రభావం తట్టుకోలేక అర్జునుడు వెనకడుగు వేసినట్టుగా చూపిస్తారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ సినిమా చూసి బయటకి వచ్చిన ప్రేక్షకులకి మాత్రం ఇది మింగుడు పడటం లేదు. ఎందుకంటే కర్ణుడు, అశ్వద్ధామ ఎక్కడ స్నేహం కలిపారు, ఏ భారతంలో చెప్పారు? అలాగే అర్జునుడిపై కర్ణుడిని గొప్ప వీరుడుగా చూపించాడు నాగ్ అశ్విన్, ఇది కూడా ఎక్కడ భారతంలో వుంది? మరి ఏ పురాణాలు నాగ్ అశ్విన్ చదివారు అని బయటకి వచ్చిన ప్రేక్షకులు అడుగుతున్నారు.
మహాభారతంలో కర్ణుడు గొప్ప వీరుడే, కానీ అర్జునుడి కన్నా కాదు. కర్ణుడు ఎంత గొప్ప దానాలు చేసినా, గొప్ప వీరుడైనా అధర్మంవైపు వుండి యుద్ధం చేశాడు. అలాగే అర్జునుడి చేతిలో కురుక్షేత్రం కన్నా ముందు చాలాసార్లు ఓడిపోయాడు కర్ణుడు. ద్రౌపది స్వయంవరంలో మారువేషాల్లో వున్న పాండవులకు, కౌరవులకు యుద్ధం జరుగుతుంది. అప్పుడు కర్ణుడు కౌరవుల పక్షానే యుద్ధం చేస్తాడు. అప్పుడు ఒకసారి ఓడిపోయి పలాయనం చిత్తగిస్తాడు. రెండోసారి కౌరవులు, కర్ణుడితో సహా ఘోష యాత్రకి వెళ్లి చిత్రసేనుడు అనే గంధర్వుడు చేతిలో చిక్కుతారు. కర్ణుడు ఓడిపోయి పలాయనం సాగిస్తాడు. అప్పుడు ధర్మరాజు ఆజ్ఞతో అర్జునుడు చిత్రసేనుడితో యుద్ధం చేసి కౌరవులని విడిపిస్తాడు. ఇది కర్ణుడికి రెండో పరాభవం. కర్ణుడు వీరుడు అయితే చిత్రసేనుడుతో యుద్ధం చెయ్యాలి కదా, ఓడిపోయి పారిపోయాడు.
పాండవుల అజ్ఞాతవాసం భంగపరచడానికి కౌరవులు విరాటరాజు పాలిస్తున్న మత్సదేశానికి రెండువైపులనుండి యుద్ధం ప్రకటిస్తారు. సుశర్మ ఒక పక్క యుద్ధం ప్రకటిస్తే అర్జునుడు కాకుండా, మిగతా పాండవులు విరాట మహారాజుకి తోడుగా సుశర్మపైకి యుద్ధానికి వెళతారు. గెలుస్తారు. ఇంకోపక్క కౌరవులు, కర్ణుడు, భీష్ముడు, ద్రోణాచార్యుడు, అశ్వద్ధామ లాంటి వీరులందరితో ఉత్తర గోగ్రహణం చేస్తారు. అప్పుడు బృహన్నల వేషంలో వున్న అర్జునుడు, ఉత్తరునికి రథసారధిగా వెళ్లి, ఆ తరువాత అక్కడ తన నిజస్వరూపం తెలిపి, కౌరవులను ఒక్క అర్జునుడే ఓడిస్తాడు. ఓడించటమే కాదు, విరాట రాజకుమారి ఉత్తరకి కానుకగా కౌరవుల తలపాగాలను కూడా తీసుకువెళతారు. అప్పుడు కూడా కర్ణుడు అర్జునుడిని ఏమీ చెయ్యలేకపోయాడు. ఇలా చాలాసార్లు అర్జునుడిదే పైచేయి అయింది, కర్ణుడు ఓడిపోతూ ఉంటాడు, అంతేకానీ కర్ణుడు ఎప్పుడూ గెలవలేకపోయాడు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నిండు సభలో కౌరవులు పాండవుల పట్టమహిషి అయిన ద్రౌపదీదేవిని వలువలు ఊడ్పించి అవమానం చేస్తున్నప్పుడు కర్ణుడు ఆ సభలో కౌరవులకు సహకరించాడు గానీ, అది తప్పు అని చెప్పి, నిలువరించలేకపోయాడు. ఎంత గొప్ప వీరుడు అయినా తన కళ్ళముందు అధర్మం జరుగుతూ ఉంటే అది తప్పు అని చెప్పకపోవటం వలన అతన్ని వీరుడుగా పిలవరు. అదీ కాకుండా కర్ణుడు అబద్ధాలు చెప్పి గురువుల వద్ద విద్య నేర్చుకున్నాడు, దుర్యోధనుడికి కూడా ఎన్నడూ నిజం చెప్పలేదు.
ఇక కర్ణుడికి గురువైన ద్రోణాచార్యుడుపై కూడా గురుభక్తి లేదు. ఎన్నోసార్లు ద్రోణాచార్యుడుని అధిక్షేపించాడు కర్ణుడు, అశ్వద్ధామకి కూడా అందుకే కర్ణుడు అంటే పడదు. కర్ణుడు మాటలు విని దుర్యోధనుడు పాడైపోతున్నాడు అని అశ్వద్ధామ కూడా ఎన్నోసార్లు హెచ్చరించాడు దుర్యోధనుడిని. అందువలన అశ్వద్ధామకి, కర్ణుడికి స్నేహం ఎక్కడా వున్నట్టుగా భారతంలో లేదు. అశ్వద్ధామకి పాండవులపై కోపం ఎప్పుడు వచ్చిందంటే, తన తండ్రి ద్రోణాచార్యుడని అన్యాయంగా చంపారని అతను భావించాడు. దుష్టద్యుమ్నుడు కత్తితో ద్రోణాచార్యుడు తల నరుకుతాడు, అది చూసి అశ్వద్ధామ పగ పెంచుకుంటాడు. అయితే ఎక్కడా కూడా కర్ణుడికి, అశ్వద్ధామకి స్నేహం ఉందని మాత్రం చెప్పలేదు. అలాగే అర్జునుడు కన్నా కర్ణుడు ఎందులోనూ సమానుడు కాదు, అర్జునుడే మహావీరుడు.
మరి నాగ్ అశ్విన్ ఎక్కడ పురాణాలూ చదివాడో అర్ధం కావటం లేదని ప్రేక్షకులు అంటున్నారు. అర్జునుడిపై కర్ణుడిని ధీరోదాత్తముగా చూపించడం ప్రేక్షకులకి ఒక పట్టాన మింగుడు పడటం లేదు. అలాగే అశ్వద్ధామకి సహాయంగా కర్ణుడు రావటం ఏంటి అని కూడా అడుగుతున్నారు. నాగ్ అశ్విన్ బహుశా పాత తెలుగు పౌరాణికాలు చూసి స్ఫూర్తి పొంది ఉంటాడు, ఒరిజినల్ పౌరాణిక గ్రంధాలు చదివి ఉండదు అని కూడా ప్రేక్షకులు అంటున్నారు.