Kalki 2898 AD : అన్నింటికీ సమాధానం పార్ట్-2లో ఉంటుంది
ABN , Publish Date - Jul 06 , 2024 | 05:20 AM
సినిమా సినిమాకు అంచెలంచెలుగా ఎదిగిన డైరెక్టర్లు కొందరైతే.. చేసిన కొన్ని సినిమాలతోనే అపారమైన ప్రతిభావంతులుగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకులు కొంతమంది. ఆ రెండో కోవకు వస్తారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. డైరెక్టర్‌గా తొలి ప్రాజెక్ట్ ‘ఎవడే సుబ్రమణ్యమ్’తో సున్నితమైన ఎమోషన్స్ ఉన్న
సినిమా సినిమాకు అంచెలంచెలుగా ఎదిగిన డైరెక్టర్లు కొందరైతే.. చేసిన కొన్ని సినిమాలతోనే అపారమైన ప్రతిభావంతులుగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకులు కొంతమంది. ఆ రెండో కోవకు వస్తారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. డైరెక్టర్‌గా తొలి ప్రాజెక్ట్ ‘ఎవడే సుబ్రమణ్యమ్’తో సున్నితమైన ఎమోషన్స్ ఉన్న సినిమాలను బాగా హ్యాండిల్ చేయగలడని నిరూపించుకున్నారు. రెండో సినిమా ‘మహానటితో’ మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకుని.. మూడవ సినిమాగా ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘కల్కి 2898 ఏ.డీ’ సినిమాను తెరకెక్కించారు. సినిమాను దృశ్యకావ్యంలా మలచి.. విమర్శకుల చేత, ప్రేక్షకుల చేత ఔరా! అనిపించుకున్నారు నాగ్ అశ్విన్. సినిమా విడుదలైన అన్ని చోట్లా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో ముచ్చటించారు.
‘‘ముందుగా ఇంతటి ఘనవిజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మన పురాణాల్లో అద్భుతమైన కథలు ఉన్నాయి. పురాణాలకు కాసింత సృజనాత్మకత జోడించి ఈ సినిమాను తెరకెక్కిద్దామనుకున్నాను. ‘మాయాబజార్’ సినిమా ఈ ఆలోచనకు స్ఫూర్తి. మొదటగా ఈ సినిమాను ఒక భాగంగానే తెరకెక్కించాలనుకున్నా. షూటింగ్ కూడా ఆ విధంగానే సాగింది. కానీ కొన్ని షెడ్యూళ్ల షూటింగ్ తర్వాత.. ఇంత కాన్వాస్ ఉన్న కథను రెండు భాగాలుగా విడదీద్దాం అనే ఆలోచన వచ్చింది. పార్ట్-2కి సంబంధించి 20 రోజుల షూటింగ్ చేశాం. కథకు న్యాయం చేసే పాత్రల్ని వెతికే సమయంలో సినిమాలోని కీలక పాత్రలకు అమితాబ్, కమల్‌హాసన్, దీపిక పదుకునే వంటి స్టార్స్ అయితే కరెక్ట్ అని భావించి వారిని తీసుకున్నాం. ఈ సినిమాతో నాలుగున్నరేళ్లు చిత్రబృందం ప్రయాణం చేసింది. ఈ సమయంలో వారెన్నో సవాళ్లను దాటుకొని చిత్ర విజయానికి దోహదపడ్డారు. ప్రభా్‌సకు మొదటి నుంచి సినిమాపై అపార నమ్మకం ఉండేది. ఆయన ప్రోత్సాహమే కష్టసమయాల్లో నన్ను, నిర్మాతల్ని ముందుకు నడిపించింది. సినిమా చూసినవారందరూ అనేక ప్రశ్నలు అడుగుతున్నారు. వాటన్నింటికీ సమాధానం పార్ట్-2లో ఉంటుంది. ‘కల్కి’ అవతారంలో ఏ నటుడ్ని చూపిస్తాం తెలియడానికి మరింత సమయం ఉంది’’ అని చెప్పారు.