Dil Raju: నాగ వంశీలో ఒకప్పటి నన్ను నేను వెతుక్కుంటున్నా..

ABN , Publish Date - Nov 03 , 2024 | 04:43 PM

‘లక్కీ భాస్కర్’ సినిమాతో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. తాజాగా ఈ చిత్ర సక్సెస్ మీట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దిల్ రాజు.. సినిమా టీమ్‌పై ప్రశంసలు కురిపిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Naga Vamsi and Dil Raju

‘లక్కీ భాస్కర్’ సినిమాతో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. ‘మహానటి’, ‘సీతారామం’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. వెంకీ అట్లూరి దర్శకుడు. మీనాక్షి చౌదరి కథానాయిక. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌తో సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఆదివారం విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించింది. చిత్ర బృందంతో పాటు నిర్మాత దిల్ రాజు, ప్రముఖ దర్శకులు నాగ్ అశ్విన్, హను రాఘవపూడి తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

Also Read-Malavika Mohanan: టాలీవుడ్‌ ఎంట్రీనే ప్రధానం.. ప్ర‌భాసే కాపాడాలి

ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ముందుగా నాగవంశీకి శుభాకాంక్షలు. ఒకప్పుడు నన్ను నేను ఇప్పుడు వంశీలో వెతుక్కుంటున్నాను. లక్కీ భాస్కర్ సినిమా చూసిన తర్వాత నాకు దర్శకుడు వెంకీ అట్లూరిపై చాలా గౌరవం పెరిగింది. ప్రేమ కథలతో దర్శకుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన వెంకీ, ‘సార్’ సినిమా నుంచి రూట్ మార్చాడు. ఈ సినిమాలో తను రాసిన డైలాగ్‌లకు, క్యారెక్టర్లను హ్యాండిల్ చేసిన విధానానికి హ్యాట్సాఫ్. దుల్కర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. తెలుగులో మూడు సినిమాలు మూడు క్లాసిక్స్. జి.వి. ప్రకాష్ మంచి సంగీతం అందించారు. హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా చక్కగా నటించింది. టీం అందరూ కష్టపడి ఒక క్లాసిక్ సినిమాను ఇచ్చారు. ఈ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్‌లో రావడం మరింత సంతోషంగా ఉంది. నేను ఒకప్పుడు చిన్న, మీడియం రేంజ్ సినిమాలు కూడా చేస్తూ ఘన విజయాలు సాధించాను. ఇప్పుడు వంశీ అది మెయింటైన్ చేస్తున్నాడు. అందుకే వంశీలో నన్ను నేను వెతుక్కుంటున్నాను అని చెప్పానని అన్నారు.


Hanu-and-Nag-Ashwin.jpg

దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. నాకు సినిమా వేడుకకు వచ్చినట్టు లేదు. కుటుంబ వేడుకకు వచ్చినట్టు ఉంది. అందరూ నవ్వుతూ ఎంతో సంతోషంగా ఉన్నారు. అందరూ కలిసి ఓ కుటుంబంలా ఈ సినిమా చేసి ఉంటారు. అదే ఈ వేడుకలో కనిపిస్తోంది. నాకు వెంకీ ఎప్పటి నుంచో తెలుసు. సినీ పరిశ్రమలో ఎంతో జీవితాన్ని చూశాడు. అందుకే ఇప్పుడు ఇంత మంచి సినిమాలు చేస్తున్నాడు. వెంకీ, దుల్కర్ కలిసి ‘లక్కీ భాస్కర్’ చేయడం, అది ఇంతటి విజయం సాధించడం సంతోషంగా ఉంది. మీనాక్షికి మంచి పాత్ర లభించింది. జి.వి. ప్రకాష్ అద్భుతమైన సంగీతం అందించారు. లక్కీ భాస్కర్ టీం అందరికీ కంగ్రాట్స్ అని తెలపగా మరో దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ.. తెలుగులో దుల్కర్ ఫస్ట్ హ్యాట్రిక్ కొట్టారు. తొందరగా సెకండ్ హ్యాట్రిక్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఒక సగటు మనిషి మీద సినిమా తీస్తూ, దానిని చాలా పద్ధతిగా చెప్పి, చాలా మంచి సినిమా కింద టర్న్ చేసి, సక్సెస్ ఫుల్ సినిమా చేయడం అనేది కష్టమైన పనే. అది వెంకీ, ‘సార్’ సినిమాతో స్టార్ట్ చేసి, ‘లక్కీ భాస్కర్’తో ల్యాండ్ అయ్యాడు. ‘సార్’ సినిమా నుంచి వెంకీ నచ్చడం మొదలెట్టాడు. ఎందుకంటే తను ముందు చేసిన లవ్ స్టోరీలు లాంటివి చాలామంది చేశారు. కానీ ‘సార్’ సినిమాలో ఒక సోషల్ ఇష్యూని తీసుకొచ్చి అంత హృద్యంగా చెప్పడం గ్రేట్. నేను ఆ సినిమా చూసి ఏడ్చాను. అప్పటినుంచి నేను వెంకీకి ఫ్యాన్ అయ్యాను. మా అమ్మగారు, అమ్మమ్మగారు ‘లక్కీ భాస్కర్’ సినిమా చూసి.. నువ్వెప్పుడు ఇలాంటి సినిమా తీస్తావురా అని అడిగారు. ప్రేమకథలు కాదు, ఇలాంటి పనికొచ్చే సినిమాలు చేయమని చెప్పారు. 70-80 ఏళ్ళ వయసున్న వారు కూడా సినిమా గురించి ఇలా మాట్లాడటం అనేది చాలా గొప్ప విషయమని చెప్పుకొచ్చారు.

Also Read-యంగ్ చాప్ ఎన్టీఆర్‌కు నారా భువనేశ్వరి ఆశీస్సులపై వైవిఎస్ చౌదరి స్పందనిదే..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 03 , 2024 | 06:41 PM