చిత్ర పరిశ్రమకు, అభిమానులకు అంకితం
ABN , Publish Date - Apr 14 , 2024 | 04:19 AM
హీరో రామ్‌చరణ్ ‘గౌరవ డాక్టరేట్’ అందుకున్నారు. సినీ, సామాజిక సేవా రంగాల్లో ఆయన చేసిన సేవలకు గాను చెన్నైలోని ప్రముఖ ‘వేల్స్ యూనివర్శిటీ’ ఆయనకు శనివారం...
హీరో రామ్‌చరణ్ ‘గౌరవ డాక్టరేట్’ అందుకున్నారు. సినీ, సామాజిక సేవా రంగాల్లో ఆయన చేసిన సేవలకు గాను చెన్నైలోని ప్రముఖ ‘వేల్స్ యూనివర్శిటీ’ ఆయనకు శనివారం సాయంత్రం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అఖిల భారత సాంకేతిక విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టీజీ సీతారాం, యూనివర్శిటీ వ్యవస్థాపకుడు, ఛాన్స్‌లర్ డాక్టర్ ఐసరి గణేశ్ చేతుల మీదుగా ఆయన ఈ డాక్టరేట్ అందుకున్నారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్ మాట్లాడుతూ... ‘నా పై ఇంత అభిమానంతో గౌరవ డాక్టరేట్ బహూకరించిన వేల్స్ వర్శిటీ యాజమాన్యానికి ధన్యవాదాలు. 38 ఏళ్లుగా నడుస్తున్న యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్ వస్తోందంటే ముందు మా అమ్మే నమ్మలేదు. ఆర్మీలాంటి గ్రాడ్యుయేషన్స్ మధ్య నేను ఇలా ఉండడం ఎంతో సంతోషంగా ఉంది. ఇది నా తల్లిదండ్రులకు, అభిమానులకు, దర్శకులకు, నిర్మాతలకు, తోటి నటీనటులకు అంకితమిస్తున్నా.’ అన్నారు. తాను చెన్నైలోని విజయా హాస్పిటల్లోనే జన్మించానని, పద్మశేషాద్రి స్కూల్లో చదివానన్నారు. ఈ ప్రాంతం తనకెంతో ఇచ్చిందన్నారు. తన తండ్రి చిరంజీవి జీవన ప్రయాణం కూడా ఇక్కడి నుంచే ప్రారంభించారన్నారు. తన సతీమణి ఉపాసన కుటుంబం అపోలో హాస్పిటల్స్‌ను కూడా ఇక్కడి నుంచే ప్రారంభించిందన్నారు. 80 శాతం తెలుగు సినిమాలు ఇక్కడే రూపొందేవని, తెలుగు సినీ పరిశ్రమకు ఇది పుట్టిల్లులాంటిదన్నారు. ఏదైనా సాధించాలని కలలు కని, చెన్నైకి వస్తే అది తప్పకుండా నెరవేరుతుందని వ్యాఖ్యానించారు. అది ఈ ప్రాంతం గొప్పతనమన్నారు. అన్ని రంగాల వారికి ఈ భూమి కలలు నెరవేర్చేదన్నారు. తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తను నటిస్తున్న ‘గేమ్ చేంజర్’ మూవీ సెప్టెంబర్-అక్టోబరు నెలల్లో విడుదలయ్యే అవకాశముందని రామ్‌చరణ్ పేర్కొన్నారు.
ఆంధ్రజ్యోతి, చెన్నై