Manmohan Singh: మార్గదర్శకుడికి సినీలోకం నివాళి
ABN , Publish Date - Dec 27 , 2024 | 10:46 AM
ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, భారతదేశ 14వ ప్రధాన మంత్రి మహ్మోహన్ సింగ్ వృద్ధాప్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్‌లో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి తన అనుభవాన్ని పంచుకొని ఎమోషనల్ అయ్యారు.
ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, భారతదేశ 14వ ప్రధాన మంత్రి మహ్మోహన్ సింగ్ వృద్ధాప్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్‌లో మృతిచెందిన సంగతి తెలిసిందే. గురువారం సాయంత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఎయిమ్స్‌కు తరలించారు. కాగా, చికిత్సపొందుతూ గురువారం రాత్రి సమయంలో ఆయన మృతిచెందారు. ఢిల్లీ ఎయిమ్స్ నుంచి మన్మోహన్ సింగ్ పార్థివదేహాన్ని ఆయన అధికారిక నివాసం మోతిలాల్ నెహ్రు మార్గ్-3కి తరలించారు. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో శనివారం నిర్వహించనున్నారు. మాజీ ప్రధాని మృతితో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. నిస్వార్థ సేవలు అందించిన ఓ మహనీయుడిని దేశం కోల్పోయిందంటూ పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి తన 'X' ఖాతా ద్వారా సంతాపం తెలిపారు.. "దేశంలోని గొప్ప రాజనీతిజ్ఞులలో ఒకరు, ఉన్నత విద్యావంతులు, మృదుస్వభావి, వినయంగా ఉండే నాయకుడు మన్మోహన్ సింగ్. వరుసగా రెండుసార్లు భారతదేశ ప్రధానిగా ఉండి చరిత్రలో నిలిచిపోయే మార్పులు తెచ్చారు. అలాంటి మహానుభావుడి హయాంలో పార్లమెంట్ సభ్యుడిగా, పర్యటక శాఖ సహాయమంత్రిగా పనిచేయడం నా అదృష్టంగా బావిస్తున్నా. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఆయన మృతి మన దేశానికి తీరని లోటు. మన్మోహన్ సింగ్ కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా" అంటూ రాసుకొచ్చారు.
కమల్ హాసన్ 'X' వేదికగా రాస్తూ.. "భారతదేశం ఒక గొప్ప పండితుడిని కోల్పోయింది. మన్మోహన్ సింగ్ మరణంతో భారత రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. దూరదృష్టితో కూడిన ఆర్ధిక, సామాజిక విధానాలతో దేశాన్ని పునర్నిర్మించారు. దేశాన్ని ఈ స్థాయిలో ప్రభావితం చేసినవారు చాలా తక్కువ. ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు లక్షలాది మందికి ఉపయోగపడ్డాయి. సామాజిక న్యాయంపై లోతైన నిబద్ధత కలిగిన పాలన అందించారు. ఆయన వారసత్వం భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి" అంటూ సంతాపం తెలిపారు.
ఇక నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం.. "దేశాన్ని ఆర్థికంగా కొత్తపుంతలు తొక్కించిన నేత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. ఆయన దివంగతులయ్యారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యా. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా. దేశ ఆర్థిక వ్యవస్థకు విప్లవాత్మక సంస్కరణలతో ఆద్యం పోసిన వారిలో మన్మోహన్ సింగ్ ఒకరు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా, యూజీసీ ఛైర్మన్‌గా విశిష్ట సేవలందించిన ఆయన ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వారి హయాంలో చేపట్టిన సంస్కరణల వల్లే మన ఆర్థిక వ్యవస్థ కొత్తపుంతలు తొక్కింది. ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవి. మన్మోహన్ సింగ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా" అంటూ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్.. "ఈ రోజు మన దేశం అత్యుత్తమ ప్రధానమంత్రులలో ఒకరిని కోల్పోయింది. దేశ ఆర్థికవృద్ధిని ముందుకుతీసుకెళ్లిన వ్యక్తి, గౌరవం, వినయానికి మారుపేరు. ఆయనకు మనం ఎప్పటికీ రుణపడిఉంటాం" అని రాసుకొచ్చారు.