BJYM - Tirumala Laddu: ప్రకాశ్‌రాజ్‌ను 'మా’ నుంచి తొలగించాలి
ABN , Publish Date - Sep 26 , 2024 | 03:36 PM
తిరుమల లడ్డూ (Tirumala Laddu) ప్రసాదం కల్తీ వివాదంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు ప్రకాష్ రాజ్‌ను 'మా’ అసోసియేషన్ నుంచి బహిష్కరించాలని బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
తిరుమల లడ్డూ (Tirumala Laddu) ప్రసాదం కల్తీ వివాదంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు ప్రకాష్ రాజ్‌ను 'మా’ అసోసియేషన్ నుంచి బహిష్కరించాలని బీజేపీ కార్యకర్తలు (BJYM) ఫిల్మ్ ఛాంబర్ ముందు ఆందోళన చేపట్టారు. హిందువులకు ప్రకాష్ రాజ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రకాష్‌రాజ్ దిష్టి బొమ్మను దగ్దం చేసి నిరసన తెలిపారు. ఈ నెల 20న లడ్డూ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) ట్విట్టర్ ‘ఎక్స్’ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ట్వీట్ విషయానికి వస్తే.. ‘‘తిరుపతి బాలాజీ పవిత్ర ప్రసాదాన్ని కల్తీ చేయడం ఆలయ కమిటీ చేసిన ద్రోహం మరియు అతి పెద్ద పాపం. ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకుని నిందితులను అరెస్ట్ చేయండి. ఈ విషయంలో హిందువులు తీవ్రంగా హర్టయ్యారు’’ అంటూ హిందూ ఐటీ విభాగం నుండి వచ్చిన ట్వీట్‌కు..‘‘తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వును వినియోగించడం అనేది భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. సాధ్యమైనంత కఠిన చర్యలు తీసుకోవడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆలయాల్లో జరిగే అంశాల పర్యవేక్షణకు జాతీయస్థాయిలో సనాతన ధర్మరక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. సనాతన ధర్మానికి ఏ రూపంలో ముప్పు వచ్చినా మనమంతా కలిసి నిర్మూలించాలి’’ అని పవన్ కళ్యాణ్ స్పందించారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన సమాధానం సరైనదిగా ఉందని, జాతీయస్థాయిలో ‘సనాతన ధర్మరక్షణ బోర్డు’ అవసరం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ ట్వీట్‌కు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) కౌంటర్ ఇచ్చారు. ఆయన ట్వీట్‌లో.. ‘‘డియర్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం లడ్డూ వివాదం జరుగుతున్న రాష్ట్రంలోనే మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. దయచేసి విచారణ జరపండి. ఈ విషయంలో తప్పు చేసింది ఎవరో కనిపెట్టి వారిని కఠినంగా శిక్షించండి. అంతేకానీ, మీరు ప్రజలలో భయాందోళనలను పెంచి, దీన్నో జాతీయ స్థాయి సమస్యగా చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే మన దేశంలో మతపరమైన ఉద్రిక్తతలు చాలానే ఉన్నాయి (కేంద్రంలో ఉన్న మీ మిత్రులకు ధన్యవాదాలు)’’ అని పేర్కొన్నారు. ప్రకాశ్ రాజ్ చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. మీ వల్లే మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయంటూ.. కొన్ని ఫొటోలను షేర్ చేస్తున్నారు. అలాగే రోజుకో ట్వీట్ తో సోషల్ మీడియాను వేడెక్కిస్తున్నారు. గురువారం కూడా ఓ ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్. "గెలిచే ముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఎందుకు మనకీ అయోమయం.. ఏది నిజం?’’ అని ప్రకాశ్‌రాజ్ గురువారం ట్వీట్ చేశారు. ఇది కూడా కల్యాణ్‌ను ఉద్దేశించే అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ట్వీట్ కూడా వైరల్ అవుతోంది.