అంజమ్మ అందరికీ నచ్చేస్తుంది
ABN , Publish Date - Jan 11 , 2024 | 02:44 AM
‘నేను భాష గురించి ఆలోచించను. పాత్ర గురించి మాత్రమే ఆలోచిస్తాను. నచ్చితే బెంగాలీ సినిమా అయినా చేసేస్తాను. హీరోయిన్ అనిపించుకోవడం కంటే మంచి నటి అనిపించుకోవడమే నాకిష్టం...

‘నేను భాష గురించి ఆలోచించను. పాత్ర గురించి మాత్రమే ఆలోచిస్తాను. నచ్చితే బెంగాలీ సినిమా అయినా చేసేస్తాను. హీరోయిన్ అనిపించుకోవడం కంటే మంచి నటి అనిపించుకోవడమే నాకిష్టం. హీరోయిన్ అని ట్యాగ్ తగిలిస్తే ఆనందపడిపోయే టైప్ కాదు నేను. కథలో ప్రాధాన్యం ఉండాలి. ‘వీరసింహారెడ్డి’ సినిమా చూస్తే బాలకృష్ణగారి తర్వాత అంతా నేనే కనిపిస్తా. అది కదా కావాల్సింది..!.’ అంటూ చెప్పుకొచ్చారు వరలక్ష్మి శరత్‌కుమార్. తేజ సజ్జా కథానాయకుడిగా ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హను-మాన్’. కె.నిరంజన్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా అందులో కీలకపాత్ర పోషించిన వరలక్ష్మి శరత్‌కుమార్ విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించారు.
ప్రశాంత్‌వర్మ ఈ కథ చెప్పినప్పుడు కచ్చితంగా చేయాల్సిన కథ అనిపించింది. ఈ సినిమాలో నా పాత్రపేరు అంజమ్మ. నేనూ, తేజా అక్కాతమ్ముళ్లం. మాపై తీసిన సరదా సన్నివేశాలు చక్కటి వినోదాన్ని పంచుతాయి. ఇది సూపర్‌హీరో కాన్సెప్ట్‌లో తెరకెక్కిన సినిమా. నేను కూడా ఒక యాక్షన్ సీక్వెన్స్ చేశాను. ఒక మాస్ హీరోకి ఉన్నంత ఎలివేషన్ వుండే యాక్షన్ సీక్వెన్స్ అది. ప్రశాంత్‌వర్మ ఎంత అద్భుతంగా ఈ కథ చెప్పాడో, అంత అద్భుతంగా తీశాడు. చిన్న సినిమాగా మొదలైన ఈసినిమా.. ఇంతింతై, వటుడింతై అన్నట్టు ఇంత పెద్ద స్కేల్‌లో గ్రాండ్‌గా రావడం చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకుల్లో కూడా పాజిటివ్ బజ్ ఉంది.
నిర్మాత నిరంజన్‌రెడ్డికి హ్యాట్సాఫ్ చెప్పాలి. ‘హను-మాన్’ అద్భుతంగా నిర్మించారు. దర్శకుడి విజన్‌ని అర్థం చేసుకునే నిర్మాత దొరకడం టీమ్ అదృష్టం. సినిమా ఒప్పుకున్న రోజున చిన్న సినిమా అనుకున్నాను. తొలిరోజు సెట్‌లోకి అడుగుపెట్టగానే ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్స్ కనిపించాయి. అప్పుడర్థమైంది ఇది చిన్న సినిమా కాదు అని. ఏ విషయంలోనూ నిర్మాత రాజీ పడలేదు.
క్రాక్, వీరసింహారెడ్డి, కోటబొమ్మాళీ చిత్రాల్లోని నా పాత్రల్లో గ్రే షేడ్స్ ఉంటాయి. కానీ ఇందులో ఆ షేడ్ ఉండదు. ఇది పాజిటీవ్ పాత్ర. అయినా ప్రేక్షకులకు బాగా నచ్చేస్తుంది. అంజమ్మ పాత్ర చాలా విభిన్నమైనది. కచ్చితంగా నాకు మంచి పేరు తెచ్చిపెడుతుంది.
చిరంజీవిగారు అభినందించడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. అలాగే ‘కోటబొమ్మాళీ’ చూసి నాన్న తెగ మెచ్చుకున్నారు. మంచి పాత్రలు దొరకడం.. అందరూ మెచ్చుకోవడం చాలా ఆనందంగా ఉంది. తెలుగులో లభిస్తున్న ఆదరణ నాకు ఏ భాషలోనూ లభించలేదు. అందుకే హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిపోయాను. ఇక్కడే ఉంటున్నాను. ప్రస్తుతం సుదీప్‌గారి ‘మ్యాక్స్’, ధనుష్ ‘డి50’లో నటిస్తున్నాను. ఓ తెలుగు సినిమాలో అద్భుతమైన పాత్ర చేస్తున్నాను. ఆ వివరాలు త్వరలో తెలియజేస్తా.