Siddharth: మారని సిద్ధార్థ్, ఓవర్ యాక్టింగ్ చేస్తూ తెలుగు మీడియాపై సెటైర్లు

ABN , Publish Date - Jul 08 , 2024 | 04:41 PM

తమిళ నటుడు సిద్ధార్థ్, తెలుగు సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని, తెలుగు సినిమాలతో ఒక స్టార్ డమ్ ఏర్పరచుకున్నాడు. తెలుగు సినిమాలు చేస్తున్నప్పుడు కూడా తన మాటలతో అనేక వివాదాలు తెచ్చుకున్నాడు, చాలా సంవత్సరాల తరువాత 'భారతీయుడు 2' పాత్రికేయుల సమావేశంలో తానేమీ మారలేదని, తన వివాదాలతో అలాగే వున్నానని చెప్పడానికి అన్నట్టుగా తెలుగు మీడియాపై సెటైర్స్ వేశాడు.

Actor Siddharth

నటుడు సిద్ధార్థ్ ఇంతకుముందు ఎన్నో వివాదాల్లో వున్నారు, ఉంటూ వుంటారు కూడా. అది అతనికి అలవాటే! ఎందుకంటే అందరి అటెన్షన్ తనపై ఉండాలంటే తాను ఎదో వ్యంగ్యంగా, ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉండాలి. అప్పుడే కదా అందరి కళ్ళు అతనిపై ఉంటాయి. ఈరోజు జరిగిన 'భారతీయుడు 2' ప్రెస్ మీట్ లో కూడా సిద్ధార్థ్ తను ఏమీ మారలేదు, ఎప్పటిలానే సెటైర్లు మీడియాపైన వేస్తాను అని మరోసారి నిరూపించాడు.

ఇక్కడ ఒక్క విషయం గమనించాలి, సిద్ధార్థ్ అనే నటుడు ప్రపంచానికి బాగా పరిచయం అయింది కేవలం తెలుగు సినిమాల వలెనే అని అందరికీ తెలిసిన విషయమే. తెలుగు సినిమాలే అతనికి స్టార్ డమ్ ని తెచ్చిపెట్టాయన్నది నిర్విదాంశం. ఇంతకు ముందు కూడా తన మాటలతో వివాదాల్లో వున్న సిద్ధార్థ్ ఈరోజు కూడా తన ఓవర్ యాక్టింగ్ తో 'భారతీయుడు 2' ప్రెస్ మీట్ లో కొంచెం అతిగా ప్రవర్తించాడు అని మీడియా వాళ్ళు అందరూ అనుకుంటున్న మాట వాస్తవం.

ఒక పాత్రికేయుడు కమల్ హాసన్ కి ఒక ప్రశ్న అడిగితే, కమల్ హాసన్ ఏమీ అనుకోకుండా చాలా గౌరవంగా, హుందాగా సమాధానం చెప్పారు. అలాగే దర్శకుడు కూడా అంతే హుందాగా సమాధానం చెప్పారు. మధ్యలో సిద్ధార్థ్ మాత్రం కొంచెం వ్యంగ్యంగా మాట్లాడుతూ తనదైన రీతిలో ప్రవర్తించాడు. కమల్ హాసన్ పాత్ర 'కల్కి 2898ఏడి' సినిమాలో కేవలం రెండు సన్నివేశాల్లో మాత్రమే కనపడతారు. అదే విధంగా కమల్ హాసన్ ని పాన్ ఇండియా సినిమా అని చెప్పి కేవలం ప్రచారం కోసం అతన్ని వాడుకొని, అతని పాత్ర నిడివి తగ్గించేస్తున్నారు అనేది ప్రశ్న. దానికి కమల్ హాసన్, శంకర్ ఇద్దరూ సరైన సమాధానం చెప్పారు. ఈ సినిమాలో మొదటి నుండి చివరి వరకు కమల్ ఉంటారని, ఇది సేనాపతి సినిమా అని.

వాళ్లిద్దరూ గౌరవంగా సమాధానం చెప్పారు, కానీ మధ్యలో సిద్ధార్థ్ కి ఏమయిందో మరి. "కమల్ గారూ, శంకర్ గారూ, బయట ప్రపంచంలో ఇలాంటి ప్రశ్నలు లేవు, కమల్ గారు సినిమాలో కొంతసేపు మాత్రమే వస్తారు అని, ఈ ఒక్క మనిషికి వచ్చింది ఆ డౌట్, ఆ ఒక్క మనిషికి మనం బయటకి వెళ్లి సమాధానం చెపుదాం. ఇది కమల్ హాసన్ సినిమా, కమల్ హాసన్ గారు ప్రతి ఫ్రేమ్ లో ప్రతి హార్ట్ బీట్ లో వుంటారు," అని చాలా వ్యంగంగా ఆ పాత్రికేయుడికి సమాధానం చెప్పాడు.

Siddharth.jpg

అదే కాదు, ఇంకొక ప్రశ్న అడిగినప్పుడు కూడా, "నా పేరు సిద్ధార్థ్, నేను 20 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం వున్నాను" అంటూ ఇంకో వ్యంగమైన సమాధానం చెప్పాడు. తను సమాధానం చెప్పిన తరువాత, కమల్ సార్, రకుల్ మీరు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పనవసరం లేదు అంటూ తనే వాళ్ళకి చెప్పేసాడు. అదొక్కటే కాదు, పాత్రికేయులు అడుగుతుంటే మధ్యలో తనే కావాలని కలుగచేసుకొని మరీ ఆ అడుగుతున్న పాత్రికేయులను కట్ చేసాడు. చివర్లో ఒక వుమన్ జర్నలిస్ట్ ఎదో అడగబోతుంటే, 'సారీ మీరు మొదటి నుండీ లేరు' అని ఆమె ప్రశ్న వినకుండానే కట్ చేసాడు. ఇలాంటివి చాలానే వున్నాయి ఈరోజు జరిగిన 'భారతీయుడు 2' పాత్రికేయుల సమావేశంలో.

అయితే పాత్రికేయులకు, తెలుగు మీడియాకి సిద్ధార్థ్ గురించి ఇదేమీ కొత్తకాదు. ఇంతకుముందు కూడా తెలుగు మీడియాపై చాలా వ్యంగాస్త్రాలు వేశాడు, అప్పుడు వివాదాల్లో వున్నాడు కూడా. అప్పుడు దాసరి లాంటి కొంతమంది పెద్దలు కలుగుజేసుకున్నారు కూడా. అయినా సిద్ధార్థ్ లాంటి నటులు పని వున్నప్పుడు ఒకలాగ, పని లేనప్పుడు ఇంకోలాగ మాట్లాడటం తెలుగు పాత్రికేయులకు అలవాటే! సిద్ధార్థ్ గురించి తెలియంది ఏముంది, ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు అని ఒక మాట అనేసి ఊరుకున్నారు తెలుగు పాత్రికేయులు.

Updated Date - Jul 08 , 2024 | 04:41 PM