నిజాన్ని అంగీకరించండి లేదా పోరాడండి

ABN , Publish Date - Sep 20 , 2024 | 01:28 AM

కొరియోగ్రాఫర్‌ షేక్‌ జానీభాషా (జానీ మాస్టర్‌) లైంగిక ఆరోపణలు ఎదుర్కోవడంతో ఆయనపై పోక్సో కేసు నమోదు చేసి ఆరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై నటుడు మంచుమనోజ్‌ స్పందించి...

కొరియోగ్రాఫర్‌ షేక్‌ జానీభాషా (జానీ మాస్టర్‌) లైంగిక ఆరోపణలు ఎదుర్కోవడంతో ఆయనపై పోక్సో కేసు నమోదు చేసి ఆరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై నటుడు మంచుమనోజ్‌ స్పందించి.. ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. ‘తప్పు చేస్తే అంగీకరించండి లేదా పోరాటం చేయండి. అంతేకాని పారిపోవదు’్ద అని ఆయన హితవు పలికారు. ‘‘జానీ మాస్టర్‌.. కెరీర్‌ పరంగా ఈ స్థాయికి వచ్చేందుకు మీరు ఎంతలా శ్రమించారో అందరికీ తెలుసు. ఈరోజు మీపై ఇలాంటి ఆరోపణలు రావడం చూస్తుంటే నా హృదయం ముక్కలవుతోంది. నిజం ఎప్పటికేౖనా బయటపడుతుంది. తప్పు ఎవరిది అనేది చట్టం నిర్ణయిస్తుంది. ఒక మహిళ తన స్వరాన్ని వినిపించినప్పుడు పారిపోవడం అనేది సమాజానికి, రానున్న తరాలకు ఒక ప్రమాదకరమైన సందేశాన్ని ఇస్తుంది.


జానీ మాస్టర్‌.. నిజాన్ని ఎదుర్కొండి. మీరు ఏ తప్పూ చేయకపోతే పోరాటం చేయండి. మీరు దోషి అయితే.. దానిని అంగీకరించండి ఈ కేసు విషయంలో వేగంగా స్పందించి చర్యలు తీసుకున్న హైదరాబాద్‌ సిటీ పోలీ్‌సలకు అభినందనలు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఇది తెలియజేస్తుంది. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఇచ్చిన మాట ప్రకారం ఉమెన్స్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ని వెంటనే సిద్థం చేయాలని కోరుతున్నా. దానికంటూ ప్రత్యేకంగా సోషల్‌మీడియా ఖాతాలు ఏర్పాటు చేయండి. మన పరిశ్రమలోని మహిళలకు గళంగా నిలవండి. ఇబ్బందుల్లో ఉన్న మహిళల బాధను వింటామనే విషయాన్ని ప్రతి మహిళకు తెలియజేయండి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అండగా నిలబడిన మన పరిశ్రమ పెద్దలు, కో వర్కర్స్‌కు నా మద్దతు తెలియజేస్తున్నా. న్యాయం, గౌరవం అనేది మాటల్లో మాత్రమే కాకుండా చేతల్లోనూ చూపించే విధమైన సమాజాన్ని నిర్మిద్దాం.


కూతురు, సోదరి, తల్లి.. ఇలా ప్రతి మహిళ కోసం ఈ పోరాటం. వారికి అన్యాయం జరగకుండా చూద్దాం’’ అని మనోజ్‌ పేర్కొన్నారు. అలాగే, మరో నటుడు నాగబాబు చేసిన ఓ ట్వీట్‌ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆయన చేసిన ట్వీట్‌ జానీ భాషాని ఉద్ధేశించినదే అని నెటిజనులు అనుకుంటున్నారు. ఇంతకీ ఆ ట్వీట్‌లో ఏముందంటే.. ‘‘తప్పు చేసిన వ్యక్తి చట్టపరంగా దోషిగా తేలనంతవరకూ.. ఆ వ్యక్తి తప్పు చేసినట్లు కాదు’’ అని సర్‌ విలియమ్‌ గ్యారో అనే రచయిత కొటేషన్‌ను నాగబాబు పోస్ట్‌ చేశారు.

Updated Date - Sep 20 , 2024 | 01:28 AM