నింగికెగసిన పాటల కెరటం

ABN , Publish Date - Nov 27 , 2024 | 06:29 AM

‘ఊహల పల్లకిలో ఊరేగించనా...’ పాట ఇవాల్టికీ తెలుగు ప్రేక్షకుల నాలుక మీద ఆడుతుంటుంది. ‘దేశం మనదే తేజం మనదే...’ గీతం ప్రతి జెండా పండుగనాడు తెలుగువారిని పలకరిస్తుంది. ‘పాటల పల్లకిలోన చిగురాకుల...

‘ఊహల పల్లకిలో ఊరేగించనా...’ పాట ఇవాల్టికీ తెలుగు ప్రేక్షకుల నాలుక మీద ఆడుతుంటుంది. ‘దేశం మనదే తేజం మనదే...’ గీతం ప్రతి జెండా పండుగనాడు తెలుగువారిని పలకరిస్తుంది. ‘పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం...’ అంటూ మనసును ఆహ్లాదపరిచే సాహిత్యమైనా.... ‘రాను రానంటూనే సిన్నదో సిన్నదో...’ అంటూ హుషారెత్తించే పాటలైనా, ‘ఏమైందీ ఈ వేళ ఎదలో ఈ సందడేలా...’ లాంటి ప్రణవగీతమైనా, ‘ప్రియతమా ఓ ప్రియతమా...’ ప్రేమరాగమైనా... ఇలా తెలుగు సినీపాటల పూదోటలో పదికాలాల పాటు నిలిచే కవితాక్షరాలను పండించిన ప్రముఖ గేయ రచయిత కులశేఖర్‌. ఎన్నో సూపర్‌హిట్‌ పాటలను అందించిన ఆయన మరణం సినిమాకథను తలపించడం విషాదం.


ప్రముఖ సినీగీత రచయిత తిరుమల పన్నేర్లమూడి కులశేఖర్‌(53) ఇకలేరు. అమీర్‌పేట రోడ్డుమీద ఓ గుర్తుతెలియని వ్యక్తి కుప్పకూలాడు అంటూ సోమవారం ఉదయం స్థానికులు 100కు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికెళ్లిన పంజాగుట్ట పోలీసులు గుర్తుతెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసుకొని, 108 సహాయంతో గాంధీ ఆస్పత్రిలో చేర్పించినట్టు సమాచారం. అదే రోజు రాత్రి చికిత్సపొందుతూ అతను తుదిశ్వాసవిడిచారు. అనామక శవంగానే మార్చురీకి తరలిస్తున్న సమయంలో గాంధీ ఆస్పత్రిలో పనిచేసే ఓ నర్సు ఆయన్ను ప్రముఖ పాటల రచయిత కులశేఖర్‌గా గుర్తించారు. అలా కులశేఖర్‌ మరణ వార్త వెలుగులోకి వచ్చింది. అంతకు కొన్నినెలలముందు ఆయనకు శస్త్రచికిత్స జరిగినట్టు సమాచారం. వ్యక్తిగత నిర్లక్ష్యం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ అవ్వడంతో మరింత అనారోగ్యానికి లోనయినట్లు స్నేహితులు చెబుతున్నారు. అదే అతని మరణానికి కారణమని వారంతా భావిస్తున్నారు. కులశేఖర్‌ స్వస్థలం విశాఖపట్నం జిల్లా సింహాచలం. కులశేఖర్‌ తండ్రి దివంగత టీపీ శ్రీరామచంద్రాచార్యులు ప్రముఖ సంస్కృత పండితుడు, మహామహోపాధ్యాయ బిరుదాంకితుడు. తల్లి రంగనాయకమ్మ ప్రస్తుతం సింహాచలంలో ఉంటున్నారు. కులశేఖర్‌ భార్య విద్యావతి.


వీరి కుమార్తె సౌందర్య లహరి, కుమారుడు సరస్వతి చరణతేజ. అనారోగ్యకారణంగా కులశేఖర్‌ కొంతకాలంగా కుటుంబానికి దూరంగా ఉండడంతో భార్య ప్రైవేటు ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం చేస్తూ పిల్లల బాధ్యతను నిర్వర్తిస్తున్నారని బంధువుల ద్వారా తెలిసింది. వారంతా మంగళవారం కులశేఖర్‌ భౌతికకాయాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. ఈ వార్త తెలిసిన వెంటనే వైజాగ్‌లోని ముగ్గురు సోదరులు నగరానికి బయలుదేరినట్టు కులశేఖర్‌ బంధువు గోపాల్‌ చెప్పారు.


సినీగేయ రచయితగా ప్రస్థానం...

సంగీత, సాహిత్య వాతావరణంలో పుట్టి, పెరిగిన కులశేఖర్‌ వైజాగ్‌లోని బీవీకే కాలేజీలో డిగ్రీ పూర్తిచేశారు. కళాశాల రోజుల్లోనే పాటలు రాసి ఎన్నో బహుమతులు అందుకున్నారు. ఈనాడు టెలివిజన్‌ జర్నలిస్టుగా ఢిల్లీ, చెన్నై తదితర నగరాల్లో కొంతకాలం పనిచేశారు. కులశేఖర్‌ సాహిత్య సృజనకు మెచ్చిన సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆయన్ను తన శిష్యుడిగా ప్రోత్సహించారు. అలా ‘చిత్రం’ సినిమాతో గేయ రచయితగా తెలుగుచిత్రసీమకు కులశేఖర్‌ పరిచయమయ్యారు. ఆ తర్వాత తేజ దర్శకత్వంలో సినీసంగీత దర్శకుడిగా ఆర్పీ పట్నాయక్‌, గీత రచయిత కులశేఖర్‌ది సూపర్‌హిట్‌ కాంబినేషన్‌గా పేరు పొందింది. ఈ ముగ్గురి కలయికలో వచ్చిన ‘చిత్రం’, ‘జయం’, ‘నువ్వు నేను’ సినిమాలే కాదు పాటలు కూడా అమితాదరణపొందిన సంగతి తెలిసిందే. ‘జై’, ‘మృగారాజు’, ‘వసంతం’, ‘ఘర్షణ’, ‘సంతోషం’, ‘బొమ్మరిల్లు’, ‘ఆడవారిమాటలకు అర్థాలే వేరులే’, ‘అమ్మాయి బావుంది’ తదితర సినిమాల్లో వందకుపైగా పాటలు రాశారు. కులశేఖర్‌ రాసింది రాశిలో తక్కువైనా, వాసిలో మాత్రం ఘనమైనవే అనడంతో అతిశయోక్తిలేదు.


కుంగదీసిన సినిమా...

‘ప్రేమలేఖ రాశా’ సినిమాకు ఆయన దర్శకత్వం వహించారు. సినీగేయ రచయితగా చేతినిండా అవకాశాలతో ఆకాశంలోని తారాజువ్వలా వెలుగొందుతున్న కులశేఖర్‌ జీవితం 2013 తర్వాత ఒక్కసారిగా తలకిందులైంది. అందుకు కారణం ఆయన దర్శకత్వం వహించిన సినిమా ఆశించినంతగా ఆడకపోవడమే కులశేఖర్‌ను మానసికంగా కుంగదీసింది అని కొందరు అంటారు. అదే సమయంలో కొన్నాళ్లపాటు ఆయన కోమాలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. కోలుకున్నాక కూడా కొద్దిరోజులు మనుషులను గుర్తుపట్టలేకపోయారు. తర్వాత సాధారణ స్థితికి వచ్చినా, ఇదివరకటిలా పాటలు రాయలేకపోయారని స్నేహితులు చెబుతున్నారు. కాకినాడలోని ఓ దేవాలయంలో శఠగోపం దొంగిలించాడన్న ఆరోపణతో కులశేఖర్‌ జైలు జీవితాన్ని గడిపారు. అయితే, తనకు ఏ పాపం తెలియదని, గిట్టనివారు తనమీద నేరాన్ని మోపారని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆపై పాటల అవకాశాల కోసం ప్రయత్నించినా, ఫలితంలేకపోయింది. దాంతో మరింత కుంగుబాటుతో బాధపడుతున్న క్రమంలో కుటుంబ సభ్యులకు, స్నేహితులకు దూరమయ్యారు. తనపాటలతో కోట్లమందిని అలరించిన ఆయన ఓ అనామకుడిగా కన్నుమూశారు. కులశేఖర్‌ అంత్యక్రియలు బుధవారం ఉదయం 10గంటలకు జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో జరగనున్నాయి. ఆ ఏర్పాట్లను ఆర్పీ పట్నాయక్‌ దగ్గరుండి చూసుకుంటున్నట్లు సమాచారం.

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి)


అనామకుడిగా చనిపోవడం బాధించింది

- ఆర్పీ పట్నాయక్‌, సంగీత దర్శకుడు

పంజాగుట్ట, హిందీకాలనీలో సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి ఎదురింటిలోని ఒక గదిలో త్రివిక్రమ్‌, సునీల్‌, నేను కలిసి ఉంటున్న రోజులవి. అప్పుడే శాస్త్రిగారి దగ్గర శిష్యరికం చేస్తున్న కులశేఖర్‌ నాకు పరిచయం అయ్యాడు. అలా ఒకరోజు తను రాసిన రామాయణ గేయకావ్యం ‘రామరసవాణి’ తీసుకొచ్చి చూపించాడు. అది నాకు బాగా నచ్చింది. అదే సమయంలో తేజగారి ‘చిత్రం’ సినిమాకు సంగీత దర్శకుడిగా నాకు అవకాశం వచ్చింది. ఆయనకు కులశేఖర్‌ను పరిచయం చేశాను. అంతే.! మనోడి శైలి నచ్చి, ఆ సినిమాకు సింగిల్‌కార్డు అవకాశం ఇచ్చారు. అలా తేజగారితో నా అనుబంధం మరింత బలపడడానికి కులశేఖరే ప్రధాన కారణం. ఆ తర్వాత మాది హిట్‌ కాంబినేషన్‌గా పేరు రావడం తెలిసిందే. కారణం తెలియదుకానీ, కులశేఖర్‌ మధ్యలో కొన్నాళ్ల పాటు కోమాలో ఉన్నాడు. అనారోగ్యం నుంచి కోలుకున్నా, పాటలు రాయలేకపోయాడు. ఎప్పుడు ఎక్కడికి వెళతాడో కుటుంబ సభ్యులకు కానీ మాకు కానీ తెలిసేది కాదు. అలా మాకు దూరమయ్యాడు. ఏదేమైనా, కులశేఖర్‌ ఒక గుర్తుతెలియని వ్యక్తిగా చనిపోవడం నన్ను మరింత బాధించింది.

Updated Date - Nov 27 , 2024 | 06:29 AM