అనౌన్స్‌మెంట్ వీడియోతోనే సంచలనం
ABN , Publish Date - Jul 12 , 2024 | 01:33 AM
సత్యం రాజేశ్, బాలాదిత్య, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘పొలిమేర 2’ బాక్సాఫీస్ వద్ద ఊహించని సక్సెస్‌ను అందుకుని హారర్ థ్రిల్లర్ జానర్ సినిమాల్లో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన...
సత్యం రాజేశ్, బాలాదిత్య, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘పొలిమేర 2’ బాక్సాఫీస్ వద్ద ఊహించని సక్సెస్‌ను అందుకుని హారర్ థ్రిల్లర్ జానర్ సినిమాల్లో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. 2021లో ‘మా ఊరి పొలిమేర’ చిత్రం ఓటీటీ సంస్థ ‘డిస్నీ ప్లస్ హాట్‌స్టార్’లో విడుదలై అందరినీ మెప్పించింది .‘మా ఊరి పొలిమేర’కు సీక్వెల్‌గా వచ్చిందే ‘పొలిమేర 2’. గతేడాది నవంబరులో విడుదలైన ఈ సక్సెస్‌ఫుల్ హారర్ థ్రిల్లర్ ఫిల్మ్‌కు కొనసాగింపుగా ఇంకో భాగం ఉంటుందని మేకర్స్ అప్పుడే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించారు. తాజాగా, ‘పొలిమేర 3’ను మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ వీడియో సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియో రిలీజైన కొద్దిసేపటికే ఎక్స్‌లో దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతూ టాప్ ప్లేస్‌ను ఆక్రమించింది. మూడో భాగాన్ని మొదటి రెండు పార్టులకు దర్శకత్వం వహించిన అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించనున్నారు.
భోగేంద్ర గుప్తా, వంశీ నందిపాటి సంయుక్తంగా నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నట్లు మేకర్స్ వెల్లడించారు. ‘పొలిమేర 3’ లో సత్యం రాజేష్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రవి వర్మ, రాకేందు మౌళి, చిత్రం శ్రీను, సాహిత్య దాసరి ప్రధాన పాత్రల్లో నటించనున్నారు.