సెప్టెంబర్ ఒకటిన బాలకృష్ణకు భారీ సన్మానం
ABN , Publish Date - Jul 12 , 2024 | 01:39 AM
‘తాతమ్మ కల’ (1974) చిత్రంతో తన నట జీవితాన్ని ప్రారంభించారు నందమూరి బాలకృష్ణ. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ 50 ఏళ్లుగా హీరోగా కొనసాగుతున్న ఏకైక కళాకారుడు ప్రపంచంలో ఆయన ఒక్కరే అంటే...
‘తాతమ్మ కల’ (1974) చిత్రంతో తన నట జీవితాన్ని ప్రారంభించారు నందమూరి బాలకృష్ణ. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ 50 ఏళ్లుగా హీరోగా కొనసాగుతున్న ఏకైక కళాకారుడు ప్రపంచంలో ఆయన ఒక్కరే అంటే అది అతిశయోక్తి కాదు. అంతేకాదు తండ్రి, మహానటుడు ఎన్టీఆర్ మార్గాన్ని అనుసరించి రాజకీయాల్లోకి ప్రవేశించి హిందూపురం నియోజక వర్గం నుంచి మూడు సార్లు వరుసగా శాసనసభ్యుడిగా ఎన్నికై హ్యాట్రిక్ సాధించారు. ఇలా సినీరంగంలోనూ, రాజకీయ రంగంలోనూ సత్తా చాటుతూ 50 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న బాలకృష్ణను తెలుగు చిత్రపరిశ్రమ సెప్టెంబర్ ఒకటిన ఘనంగా సత్కరించనుంది. ఈ మేరకు తెలుగు నిర్మాతలమండలి కార్యదర్శి దామోదర ప్రసాద్, నిర్మాతలమండలి కార్యదర్శి ప్రసన్నకుమార్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు సునీల్ నారంగ్, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కలవగా, బాలకృష్ణ ఈ సన్మానానికి తన అంగీకారం తెలిపారు. బాలీవుడ్, ఇతర సినీ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఈ సన్మాన సభకు హాజరవుతారని సమాచారం.