పాటల రేవులో సాహితీ సంగమం

ABN , Publish Date - Jul 25 , 2024 | 06:19 AM

మత్స్యకారుల జీవితాలను ఆవిష్కరించే ఇతివృత్తంతో రూపుదిద్దుకున్న చిత్రం ‘రేవు’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు రెండో వారంలో విడుదల కోసం సిద్ధమైంది. ఈ సినిమా ఆడియో వేడుక బుధవారం ప్రసాద్‌ ప్రీవ్యూ థియేటర్‌లో జరిగింది...

మత్స్యకారుల జీవితాలను ఆవిష్కరించే ఇతివృత్తంతో రూపుదిద్దుకున్న చిత్రం ‘రేవు’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు రెండో వారంలో విడుదల కోసం సిద్ధమైంది. ఈ సినిమా ఆడియో వేడుక బుధవారం ప్రసాద్‌ ప్రీవ్యూ థియేటర్‌లో జరిగింది. ఐదుగురు ప్రముఖ గీతరచయితలు చంద్రబోస్‌, రామజోగయ్య శాస్త్రి, సుద్దాల అశోక్‌తేజ, అనంత్‌ శ్రీరామ్‌, కాసర్ల శ్యామ్‌ ముఖ్య అతిధులుగా ఈ వేడుకలో పాల్గొనడం ఒక విశేషమైతే, చాలా ఏళ్ల తర్వాత క్యాసెట్‌ రూపంలో ఈ ఆడియోను విడుదల చేయడం మరో విశేషం. గీత రచయిత చంద్రబోస్‌ మాట్లాడుతూ ‘నవ్యత, నాణ్యత ఈ చిత్రంలో కనిపించాయి. సినిమా విజయం సాధించాలి’ అని కోరారు. ‘కంటెంట్‌ ఉన్న వైవిధ్యమైన సినిమాలు రావాలంటే పర భాషల వైపు చూస్తుంటాం. కానీ ‘రేవు’ సినిమా పాటలు విన్నాక కొత్తతరం ప్రతిభావంతులపై నమ్మకం ఏర్పడుతోంది’ అన్నారు రామజోగయ్య శాస్త్రి. తనలాగానే గీత రచయిత ఇమ్రాన్‌ శాస్త్రి మొదటి సినిమాకే సింగిల్‌ కార్డ్‌ పొందారని అనంత శ్రీరామ్‌ అభినందించారు.


అక్షరాలన్నీ కలసినట్టుగా ఈ వేదిక ఉందని సుద్దాల అశోక్‌తేజ అభినందించారు. ‘రేవు’ చిత్ర నిర్మాణ పర్యవేక్షకుడు ప్రభు మాట్లాడుతూ ‘ఒక చిన్న సినిమాను సపోర్ట్‌ చేయడానికి ఇంతమంది గీత రచయితలు రావడం ఆనందంగా ఉంది. దర్శకుడు హరనాథ్‌ మత్య్సకారుల జీవన పోరాటాన్ని అద్భుతంగా తెరకు ఎక్కించారు’ అని చెప్పారు. ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత పర్వతనేని రాంబాబు మాట్లాడుతూ ‘ఈ చిత్ర నిర్మాతలు, మిత్రులు మురళీ గింజుపల్లి,నవీన్‌ పారుపల్లి నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టాలా ‘రేవు’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళతాం’ అని చెప్పారు.

Updated Date - Jul 25 , 2024 | 06:19 AM