Sunny Leone: సన్నీ లియోన్‌కి పెన్షన్.. ఖంగుతిన్న కలెక్టర్
ABN , Publish Date - Dec 23 , 2024 | 04:18 PM
మాజీ శృంగార తార, బాలీవుడ్ నటి సన్నీ లియోన్ కి నెలకు రూ. 1000 రూపాయిల పెన్షన్ ని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అందిస్తుంది. అసలు సన్నీకి పెన్షన్ తీసుకోవాల్సినంత కష్టం ఏమొచ్చింది. జిల్లా కలెక్టర్ ఎందుకు కంగుతిన్నారంటే..
ఆర్థికంగా వెనుకబడిన వివాహిత మహిళల కోసం పెన్షన్ అందించేందుకు మహాతరి వందన్ యోజన స్కీమ్ ప్రవేశపెట్టింది ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం. ఈ పథకం ద్వారా ప్రతి నెలా రూ.1000 అందిస్తోంది. మహిళలకు మాత్రమే అందించే ఈ పథకం కింద ఊహించని వ్యక్తి లబ్ధి పొందుతున్నట్లు కనుగొన్నారు ఛత్తీస్‌గఢ్ అధికారులు. పెన్షన్ లబ్ధిదారుల జాబితాలో నటి సన్నీలియోన్ పేరు చూసి ఆశ్చర్యపోయారు. ఇటీవల అధికారులు మహిళల ఖాతాలను పరిశీలిస్తుండగా బాలీవుడ్ నటి సన్నీలియోన్ పేరుతోనూ ఖాతా ఉన్నట్లు బయటపడింది.
ప్రభుత్వం మహిళలకు మాత్రమే అందించే పథకం ద్వారా తానూ లబ్ది పొందాలనుకున్న ఓ వ్యక్తి తనపేరును నటి సన్నీలియోన్‌గా, భర్త పేరును అమెరికన్ నటుడు జానీ సిన్స్గా పేర్కొంటూ పథకానికి దరఖాస్తు చేసుకున్నాడు. 10 నెలలుగా మహాతరి వందన్ యోజన స్కీమ్ కింద ప్రయోజనం పొందుతున్నాడు. అధికారుల అవగాహనరాహిత్యం వల్ల జరిగిన ఈ ఘటనపై విచారణ జరపాలని ఆదేశించారు బస్తర్ కలెక్టర్ హరీస్ ఎస్. మహిళా,శిశు అభివృద్ధి శాఖ చేపట్టిన దర్యాప్తులో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి.
బస్తర్‌కు చెందిన వీరేంద్ర జోషి అనే వ్యక్తి సన్నీలియోన్ పేరిట పెన్షన్ అందుకుంటున్నట్లు తేలింది. అంగన్వాడీ వర్కర్ వేదమతి జోషికి చెందిన పత్రాలు వాడుకుని మహతరీ వందన్ స్కీమ్‌లో నమోదు చేసుకున్నాడు. ఈ ఏడాది మార్చి నుంచి ప్రతి నెలా ఫేక్ అకౌంట్లో ఉన్న నిధులను తన ఖాతాలోకి మార్చుకుంటున్నాడని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వాన్ని మోసగించినందుకు వీరేంద్ర జోషిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.