Rajinikanth: బచ్చన్‌ను చూసి బాలీవుడ్‌ నవ్వింది.. రజనీ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Sep 21 , 2024 | 09:27 PM

అమితాబ్‌ బచ్చన్‌ గురించి రజనీకాంత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. "ఒకానొక సమయంలో అమితాబ్‌ బచ్చన్‌ ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆర్థిక సమస్యలు చవి చూశారు.


రజనీకాంత్‌(Rajinikanth), అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) కలిసి నటిస్తోన్న చిత్రం ‘వేట్టయాన్‌’ (vettaiyan) . ఈ సినిమా ఆడియో విడుదల చెన్నైలో జరిగింది. ఈ వేదికపై అమితాబ్‌ బచ్చన్‌ గురించి రజనీకాంత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. "ఒకానొక సమయంలో అమితాబ్‌ బచ్చన్‌ ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆర్థిక సమస్యలు చవి చూశారు. గాంధీ కుటుంబంతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నప్పటికీ ఆయన ఎవరి సాయం తీసుకోలేదు. తనకు తానుగా అన్ని సమస్యలను ఎదుర్కొని నిలబడ్డారు. అమితాబ్‌ బచ్చన్‌ సినీ నిర్మాతగా ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నారు. నష్టాలు చవిచూశారు. వాచ్‌మెన్‌కూ జీతం చెల్లించలేని స్థితికి చేరారు. జూహూ ఇంటిని వేలానికి పెట్టారు. ఆ సమయంలో బాలీవుడ్‌ మొత్తం ఆయన్ని చూసి నవ్వింది. గతంలో అమితాబ్‌ బచ్చన్‌కు ఒక ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఇందిరా గాంధీ ఒక సమావేశం కోసం విదేశాలకు వెళ్లారు. అమితాబ్‌కు జరిగిన ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఆమె ఇండియా తిరిగి వచ్చేశారు. అప్పుడే అందరికీ తెలిసింది రాజీవ్‌ గాంధీ, అమితాబ్‌ కలిసి చదువుకున్నారని. గాంధీ కుటుంబంతో బచ్చన్‌కు సత్సంబందాలు ఉన్నాయని. అమితాబ్‌ బచ్చన్‌ తండ్రి హరివంశరాయ్‌ బచ్చన్‌ గొప్ప రచయిత. తండ్రి పేరు ప్రఖ్యాతలతో అమితాబ్‌ కావాలంటే ఎవరి సాయం అయినా అడగవచ్చు. కానీ, సమస్యలే వచ్చినప్పుడు..  ఆయన ఎవరి సాయం తీసుకోలేదు.  ఎన్ని సవాళ్లు ఎదురైనా ఆయన ఎప్పుడూ కుంగిపోలేదు. మళ్లీ తిరిగీ నిలబడటం కోసం ఎంతో శ్రమించారు. మూడేళ్ల పాటు ప్రతి యాడ్‌, కౌన్‌ బనేగా కరోడ్‌పతి.. ఇలా వచ్చిన అన్ని అవకాశాలు సద్వినియోగం చేసుకున్నారు. తాను పొగొట్టుకున్న వాటిని తిరిగి పొందారు. జూహూలోని ఇంటితోపాటు అదే వీధిలో మరో మూడు ఇళ్లు కొనుగోలు చేశారు. 82 ఏళ్ల వయసులోనూ రోజూ 10 గంటలు పని చేస్తూనే ఉంటారాయన. ఆయన ఎంతోమందికి స్ఫూర్తి.’’ అని అన్నారు.

Updated Date - Sep 21 , 2024 | 09:27 PM