javed akhtar: ఒకటి కాదు.. మూడు యానిమల్ చిత్రాలు తీసుకోండి!
ABN , Publish Date - Mar 17 , 2024 | 09:12 PM
‘యానిమల్’ సినిమా విషయంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, బాలీవుడ్ సీనియర్ దర్శకుడు, రచయిత జావేద్ అక్తర్ మధ్య ఆ చిత్రం విడుదలైనప్పటి నుంచి వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే!
‘యానిమల్’ సినిమా విషయంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, బాలీవుడ్ సీనియర్ దర్శకుడు, రచయిత జావేద్ అక్తర్ మధ్య ఆ చిత్రం విడుదలైనప్పటి నుంచి వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే! ఇటీవల సందీప్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపై తాజాగా జావేద్ స్పందించారు. తాను ఇప్పటివరకూ చేసిన చిత్రాల్లో ఒక్క అసభ్య సన్నివేశం కూడా సందీప్‌కు కనిపించలేదని కామెంట్ చేశారు. ఆయన మాట్లాడుతూ ‘‘యానిమల్ చిత్ర దర్శకుడిని నేను ఏమాత్రం విమర్శించడం లేదు. ప్రజాస్వామ్య దేశంలో నచ్చిన చిత్రాన్ని తెరకెక్కించుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. ఒక్కటి కాకపోతే మరో రెండు మూడు ‘యానిమల్’ చిత్రాలు చిత్రీకరించుకోమనండి. నా బాధ అంతా ప్రేక్షకుల గురించే. నేను చేసిన వ్యాఖ్యలపై అతడు మాట్లాడినందుకు ధన్యవాదాలు. 53 ఏళ్ల నా సినీ కెరీర్‌లో ఆయనకు ఎక్కడా అసభ్య సన్నివేశాలు కనిపించలేదు, మాటలు వినిపించలేదు. అందుకే ఆయన నా తనయుడు ఫర్హాన్ అక్తర్ నిర్మించిన ‘మిర్జాపూర్’ను ఉదాహరణగా చెబుతున్నాడు. అందులో ఫర్హాన్ యాక్ట్ చేయలేదు. దానికి దర్శకత్వం వహించలేదు. వేరే వాళ్లతో కలిసి నిర్మించాడంతే’’ అని అన్నారు.
అసలు ఏం జరిగిందంటే.. ‘యానిమల్’ చిత్రం రిలీజ్ తర్వాత ఓ కార్యక్రమంలో పాల్గొన్న జావేద్ అక్తర్ ఆ చిత్రంపై కామెంట్ చేశారు. ఇలాంటి చిత్రాలు ప్రేక్షకులకు ఏం సందేశాలు ఇస్తున్నాయని ప్రశ్నించారు. స్ర్తీని తక్కువ చేసి చూపించే చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అందుకోవడం నిజంగా ప్రమాదకరమన్నారు.
దీనికి సందీప్ రెడ్డి వంగా స్పందిస్తూ.. ‘‘మిర్జాపూర్’ నిర్మించిన సమయంలో ఇదే విషయాన్ని ఆయన తన తనయుడు ఫర్హాన్ అక్తర్‌కు ఎందుకు చెప్పలేదు. ఆ సిరీస్‌లో చాలా అసభ్య పదాలున్నాయి. ఇప్పటివరకు నేను ఆ సినిమా చూడలేదు. మా సినిమాలపై వ్యాఖ్యలు చేసే ఆయన తన కుమారుడి వర్క్‌ను ఎందుకు చెక్ చేయడం లేదు’’ అని విమర్శించారు.