IC 814: ట్రెండింగ్‌లో బాయ్‌కట్ నెట్‌ఫ్లిక్స్.. రంగంలోకి కేంద్రం
ABN , Publish Date - Sep 03 , 2024 | 09:25 AM
గతవారం నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్‌కు వచ్చిన వెబ్ సిరీస్ ‘ఐసీ 814: ది కాందహార్ హైజాక్ సిరీస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.
పాతిక సంవత్సరాల క్రితం 1999లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాందహార్ హైజాక్ ఉదంతం నేపథ్యంలో రూపొందిన వెబ్ సిరీస్ ‘ఐసీ 814: ది కాందహార్ హైజాక్ (IC 814: The Kandahar Hijack). గతవారం నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ సిరీస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. గతంలోను ఇలానే ఓ నాలుగైదు సినిమాలు, సిరీస్‌ల విషయంలో విమర్శలు, వివాదాలు తెచ్చుకున్న నెట్‌ఫ్లిక్స్ మరోమారు అలాంటి ఇష్యూతో సతమతమవడమే కాక అసలు ఇండియాలో నెట్‌ఫ్లిక్స్‌ను బాయ్‌కట్ (#BoycottNetflix) చేయాలనే విమర్శలు తీవ్రంగా ఎదుర్కొంటోంది. చివరకు కేంద్రం రంగంలోకి దిగాల్సి వచ్చింది.
విషయానికి వస్తే.. నేపాల్ రాజధాని ఖాట్మాండు నుంచి బయలుదేరిన భారతీయ విమానాన్ని పాకిస్థాన్‌కు చెందిన కొందరు ఉగ్రవాదులు హైజాక్ చేసి కాందహార్‌కు తరలించడం, ఉగ్రవాదుల నుంచి ప్రయాణికులను విడిపించడానికి అప్పటి భారత ప్రభుత్వం చేపట్టిన చర్యల నేపథ్యంలో తెరకెక్కించిన సిరీస్ ‘ఐసీ 814: ది కాందహార్ హైజాక్’ (IC 814: The Kandahar Hijack) ను గతవారం ఆగస్టు 29న నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో రిలీజ్ చేశారు. విజయ్‌వర్మ, నసీరుద్దీన్‌షా, అరవింద స్వామి వంటి మహామహులు కీలక పాత్రల్లో నటించారు.
అయితే.. నాడు విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాదుల పేర్లను అయితే ఈ సిరీస్‌లో భోళాశంకర్, బర్గర్, డాక్టర్ అనే పేర్లతో చూపించారు. దీనిపై సోషల్‌మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రేక్షకుల్ని తప్పుదోవ పట్టించేలా కావాలని ఉగ్రవాదుల పేర్లను మార్చారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బాయ్ కాట్ నెట్‌ఫ్లిక్స్ అనే యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. గతంలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసిన వివాద సినిమాల క్లిప్పులను జత చేస్తూ తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోశారు.
దీంతో ఇప్పుడు ఈ వివాదం కేంద్ర ప్రభుత్వ దృష్టికి చేరడంతో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని.. ఈ వివాదాంశాలపై స్వయంగా వివరణ ఇవ్వాలని నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఇండియా కంటెంట్ హెడ్‌కు సమన్లు జారీ చేసింది. అయితే పేర్లు మార్చడం వెనక దురుద్దేశ్యం ఏమీ లేదని, విస్త్రృతంగా పరిశోధన చేసిన తర్వాతే ఈ స్క్రిప్ట్‌ను రూపొందించామని, హైజాక్ ఆపరేషన్ సమయంలో భారత ఇంటెలిజెన్స్ వర్గాలకు అనుమానం రాకుండా ఉగ్రవాదులు తమ పేర్లు మార్చుకొని పిలుచుకునేవారని ఈ సిరీస్ దర్శకుడు అనుభవ్ సిన్హా ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చాడు. అయితే ఈ వివాదంపై నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఎలా స్పందిస్తుందోనని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.