Esha deol: స్త్రీలను ఇబ్బందిపెట్టే హక్కు ఎవరికీ లేదు
ABN , Publish Date - Sep 14 , 2024 | 04:25 PM
చాలామంది బౌన్సర్ల మధ్య ఫంక్షన్ హాల్‌లోకి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి నన్ను అభ్యంతరకర రీతిలో తాకాడు. నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది.
పని చేసే ప్రాంతంలో వేధింపులపై మహిళ తప్పకుండా స్పందించాలని నటి ఈషా దేవోల్ (Eesha Deol) తెలిపారు. ఓ సినిమా ఫంక్షన్‌లో గుర్తు తెలియని వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని, తట్టుకోలేక చెంప మీద కొట్టానని చెప్పారు. ఆమె మాట్లాడుతూ ‘‘2005లో తెరకెక్కిన ‘దాస్’ (Dass) ప్రీమియర్ ఈవెంట్‌లో ఒక సంఘటన చోటుచేసుకుంది. ఆ సినిమా ప్రమోషన్స్ భాగంగా పుణెలో ఈవెంట్ నిర్వహించారు. ప్రధాన నటీనటులతో కలిసి నేనూ ఆ కార్యక్రమానికి వెళ్లా. మమ్మల్ని చూసేందుకు జనాలు పెద్ద ఎత్తున వచ్చారు. చాలామంది బౌన్సర్ల మధ్య ఫంక్షన్ హాల్‌లోకి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి నన్ను అభ్యంతరకర రీతిలో తాకాడు. నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. వెంటనే, అతని చేయి పట్టుకొని గుంపులో నుంచి బయటకు లాగి.. చెంప చెళ్లుమనిపించా. అందరూ షాక్ అయ్యారు. సాధారణంగా నేను సరదాగా ఉండే వ్యక్తిని. నా సహనాన్ని పరీక్షిస్తూ ఎవరైనా తప్పుగా ప్రవర్తిేస్త తప్పకుండా రియాక్ట్ అవుతా. నేనే కాదు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రతి మహిళా స్పందించాలి. శారీరకంగా పురుషులు బలవంతులు కావచ్చు. అంతమాత్రాన స్ర్తీలను ఇబ్బందిపెట్టే హక్కు వారికి లేదు’’ అని ఈషా అన్నారు.
బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర, నటి హేమామాలిని దంపతుల కుమార్తెగా ఈషా దేవోల్ ఇండస్ర్టీలోకి అడుగుపెట్టారు. ‘కుచ్ తో హై’, ‘యువ’, ‘ధమ్’, ‘కాల్’, ‘క్యాష్’, ‘హైజాక్’ వంటి చిత్రాల్లో ఆమె నటించారు. ప్రస్తుతం ఆమె చేతిలో ‘హీరో హీరోయిన్’ అనే మూవీ ఉంది.