Tollywood: ఇప్పుడు ఇదే ట్రెండ్.. కనిపించినోడిని కాల్చి పడేయ్, అడ్డొచ్చినోడి తల నరికేయడమే!
ABN , First Publish Date - 2023-10-24T17:12:08+05:30 IST
సినిమాలలో హింస రోజురోజుకు పెట్రేగి పోతున్నది. ఇప్పుడు ఎవరు ఎంత ఫీల్‌గుడ్ సినిమా తీశామని కాకుండా సినిమాలో ఎంత వయలెన్స్ చూపించామన్నదే ప్రధాన వనరుగా మారింది. ఫలానా సినిమాలో ఆ హీరో అన్ని తలలు నరికాడంటే మరో సినిమాలో దానిని మించి సన్నివేశాలు ఉండాల్సిందే అన్న చందంగా మారాయి. టాలీవుడ్‌లో ఇప్పుడిదే ట్రెండ్ అన్నట్లుగా మారిపోయింది.
సినిమాలలో హింస రోజురోజుకు పెట్రేగి పోతున్నది. ఇప్పుడు ఎవరు ఎంత ఫీల్‌గుడ్ సినిమా తీశామని కాకుండా సినిమాలో ఎంత వయలెన్స్ చూపించామన్నదే ప్రధాన వనరుగా మారింది. ఫలానా సినిమాలో ఆ హీరో అన్ని తలలు నరికాడంటే మరో సినిమాలో దానిని మించి సన్నివేశాలు ఉండాల్సిందే అన్న చందంగా మారాయి. ఐదారేండ్ల క్రితం వరకు ఓ మోస్తరు యాక్షన్ సీన్లకే అహా.. ఒహో అంటూ ఎంజాయ్ చేసిన అభిమానులకు హలీవుడ్ చిత్రం జాన్‌విక్ రాకతో సినిమాల ఒరవడే పూర్తిగా మారిపోయింది. ఆ సినిమా ప్రారంభం మొదలు క్లైమాక్స్ వరకు కత్తి ఫైటింగ్స్, తుఫాకుల మోత ఓ రేంజ్‌లో ఉంటుంది. ఇది ప్రేక్షకులకు తెగ నచ్చడంతో వరుస బెట్టి నాలుగు పార్ట్స్ వచ్చేశాయి. ఇక దీన్ని మన సౌత్ దర్శకులు ఆదర్శంగా తీసుకున్నారేమో తమ సినిమాల్లోనూ మోతాదుకు మించి హింసా సన్నివేశాలను చొప్పిస్తున్నారు. (Trend in Tollywood)
ఈ క్రమంలోనే వచ్చిన ‘కేజీఎఫ్ (KGF), ఖైదీ (Khaidi)’ సినిమాల్లో అయితే ఏకంగా పెద్ద ఆయుధాలను ప్రవేశపెట్టి కనిపించినోడిని కాల్చి పారేసే కొత్త పంథాకు తెర లేపారు. అనంతరం వచ్చిన కమల్ హాసన్ సినిమా ‘విక్రమ్’ (Kamal Haasan Vikram)లోనూ అలాంటి ఆయుధాలనే వాడి అడ్డొచ్చిన వారిని కాల్చేసుకుంటూ వెళ్లిపోయారు. ఇప్పుడు వీరందరిని తలదన్నేలా మన తెలుగు దర్శకులు ఓ అడుగు ముందుకేశారు.
ముఖ్యంగా ఈ దసరా పండుగకు విడుదలైన ‘స్కంద, భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు’ (Skanda, Bhagavanth Kesari, TNR) సినిమాల్లో అయితే చేతులతో కొట్టడం, తుపాకులతో కాల్చడం చిన్నతనం అనుకున్నారేమో ఒకరినిమించి మరొకరు కనిపించిన తలలన్నీ నరుక్కుంటూ వెళ్లారు. త్వరలో శైలేష్ కొలను దర్వకత్వంలో వెంకటేశ్ హీరోగా రాబోతున్న ‘సైంధవ్’ (Saindhav)లోనూ, పవన్ కళ్యాణ్ ‘OG’లోనూ గన్నులు, కత్తులే కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే.. ఎన్టీఆర్, కొరటాల సినిమా ‘దేవర’ (Devara) అయితే కత్తుల కోసమే అన్నట్లుగా రకరకాల కత్తులని ఇప్పటికే పరిచయం చేశారు.
అయితే యువత ఇలాంటి చిత్రాలను బాగా ఆదరిస్తుండడంతో దర్శకులు, నిర్మాతలు వాటికే జై కొడుతున్నారు. ముఖ్యంగా ఓటీటీల్లో వస్తున్న రా కంటెంట్ యూత్‌పై అధికంగా ప్రభావం చూపుతుండడంతో వారిని సినిమా థియేటర్లకు రప్పించడం కోసం ఇప్పుడు వస్తున్న దర్శకులు హింసకే కాకుండా, బోల్డ్ సన్నివేశాలతో నింపి పడేస్తున్నారు. రానురాను ఈ ట్రెండ్ యువతను ఏ వైపుకు తీసుకెళుతుందనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.