Skanda: ఇందులో ఆ వ్యంగ్య సన్నివేశం అతన్ని ఉద్దేశించి పెట్టిందేనా ...
ABN , First Publish Date - 2023-10-10T14:47:58+05:30 IST
'స్కంద' సినిమాలో రాజకీయ విశ్లేషకుడు లేదా వ్యూహకర్తని రాజాకీయాలను ఎలా విశ్లేషిస్తావు అని అడిగితే ఆ పాత్రలో వున్న రచ్చ రవి చేత ఒక పెద్ద డైలాగ్ చెప్పించాడు బోయపాటి. ఆ మాటలు ప్రస్తుతం ఒక ముఖ్యమంత్రి, ఒక రాజకీయ వ్యూహకర్తకి సరిగ్గా సరిపోతాయి అని అంటున్నారు. ఇంతకీ వైరల్ అవుతున్న ఈ మాటలు అతన్ని ఉద్దేశించి అన్నవేనా...
బోయపాటి శ్రీను (BoyapatiSreenu), రామ్ పోతినేని (RamPothineni) కాంబినేషన్ లో వచ్చిన 'స్కంద' #Skanda సినిమా విడుదలై సుమారు రెండు వారాలు అవుతోంది. ఈ సినిమాలో హింస ఎక్కువగా ఉండటం, కథలో కొంచెం లాజిక్ మిస్సవటం వంటివి ఉండటంతో అంతగా ప్రేక్షకులకు నచ్చలేదు, అలాగే క్రిటిక్స్ కూడా నచ్చలేదు. ఇక ఈ సినిమాలో కథానాయకుడు రామ్ పోతినేని ఢీ కొట్టిన విలన్స్ ఇద్దరు, చాలా బలం, బలగం వున్నవాళ్లు, ఒకరు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, రెండోవారు తెలంగాణా ముఖ్యమంత్రి. ఇక్కడే బోయపాటి సినిమాలో లాజిక్ మిస్సయింది అని అంటున్నారు.
అయితే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సినిమాలో విలన్స్ అయితే మరి వ్యంగ్య సన్నివేశాలు ఏమైనా ఉంటాయా అని అనుకుంటే, ఒక దగ్గర మాత్రం పెట్టాడు బోయపాటి. అది కూడా రాజకీయ నాయకుల మీద కాకుండా, రాజకీయ విశ్లేషకుల మీద ఒక వ్యంగ్య సన్నివేశం ఉంటుంది. ప్రశాంత్ కిషోర్ (PrashanthKishore) లేదా పీకె అని పిలవబడే అతను రాజకీయ విశ్లేషకునిగా ఇంతకు ముందు చాలామంది రాజకీయ పార్టీలకు, నాయకులకు సలహాలు ఇచ్చాడు, ఫలితాలు కూడా బాగున్నాయి. అందుకే అతని పేరు అందరికీ తెలిసింది.
ఈ సినిమాలో రచ్చరవితో (RachaRavi) చెప్పించిన ఒక సన్నివేశం వుంది. అది గత ఎన్నికలలో వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ పై ఉండవచ్చని చాలామంది అంటున్నారు, అందుకే ఆ సెటైరికల్ డైలాగ్స్ సాంఘీక మాధ్యమంలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం నడుస్తున్న రాజకీయ సంఘటనలకు ఈ సన్నివేశంలో వున్న మాటలు అందుకు సరిపోయాయని అందుకే అవి నెటిజెన్స్ ఆకట్టుకుంటున్నాయి అని అంటున్నారు.
అలాగే రామ్ పోతినేనిని కూడా తన విశ్లేషణను చెపుతూ తీయాలి, పోయాలి, గట్టిగా అరిస్తే తొయ్యాలి, అడ్డమొస్తే లేపాలి అంటూ చెపుతాడు. ఈ మాటలను సినిమా ట్రైలర్ లో కూడా విడుదల చేశారు. ఇందులో గట్టిగా అరిస్తే, తొయ్యాలి, అడ్డమొస్తే లేపాలి అనేవి ఎవరికీ వర్తిస్తాయి అందరికీ తెలిసిన విషయమే అంటూ నెటిజన్స్ అంటున్నారు. ఈ మాటలు ఇప్పుడు సాంఘిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.