Venu Udugula: ఎవరొచ్చిరి ఏమిచ్చిరి.. ఏ మాటలు ఎక్కడెక్కడ గుచ్చిరి?

ABN , First Publish Date - 2023-06-27T17:01:57+05:30 IST

‘నీదీ నాదీ ఒకే కథ’ చిత్రంతో టాలీవుడ్‌లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు వేణు ఊడుగుల. తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా తనేంటో నిరూపించుకున్నాడు. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘విరాటపర్వం’ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది కానీ.. కమర్షియల్‌గా వర్కవుట్ కాలేదు. ప్రస్తుతం మరో ప్రాజెక్ట్ పనిలో ఉన్న వేణు ఊడుగుల తాజాగా ఓ కవితను తన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ కవితకు మంచి స్పందన వస్తోంది.

Venu Udugula: ఎవరొచ్చిరి ఏమిచ్చిరి.. ఏ మాటలు ఎక్కడెక్కడ గుచ్చిరి?
Director Venu Udugula

‘నీదీ నాదీ ఒకే కథ’ (Needi Naadi Oke Katha) చిత్రంతో టాలీవుడ్‌లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు వేణు ఊడుగుల (Venu Udugula). తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా తనేంటో నిరూపించుకున్నాడు. తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో చక్కటి ఎమోషన్స్‌తో తెరకెక్కిన ఆ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందించింది. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో రానా దగ్గుబాటి (Rana Daggubati), సాయిపల్లవి (Saipallavi) జోడీగా తెరకెక్కిన చిత్రం ‘విరాటపర్వం’ (Virataparvam). నక్సల్స్ నేపథ్యంలో రూపొందిన ఈ ప్రేమకథకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. నిజాయితీ గల కథను తెరకెక్కించాడని అభినందనలు అందాయి.. కానీ కమర్షియల్‌గా మాత్రం ‘విరాటపర్వం’ బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. ఈ విషయంపై ఇటీవల ఈ సినిమా విడుదలై సంవత్సరకాలం పూర్తయిన సందర్భంగా వేణు రియాక్ట్ అయ్యాడు కూడా. సరే ఆ విషయం పక్కన పెడితే.. తాజాగా వేణు ఊడుగుల రాసిన కవిత ఆంధ్రజ్యోతి (Andhrajyothy) డైలీలో ప్రచురితమైంది. ఈ విషయం తెలుపుతూ ట్విట్టర్ వేదికగా అందరినీ ఈ కవిత (Director Venu Udugula Poem) చదవమని వేణు ఊడుగుల కోరారు. ఆ కవిత ఇదే..

‘‘నిప్పు కణికల పాన్పు ఇది

పడగలెత్తిన విషసర్పములటువైపు

ముడుచుకుని వేచివున్న మృగములిటువైపు

ఒక కాలు దివిన ఒక కాలు భువిన

కాలసలు కదలదు కాలమసలు గడవదు

కన్ను చూడదు కంఠమాడదు

కనుదోయి సైగలకు కనుబొమ్మలే బదులు

నోరు మండే ఎడారిధూపమాయే

Venu.jpg

నిలువెల్లా నిర్వాణరూపమాయె

సంద్రాన అలలు లేవు

బంగారు కలలు లేవు

ఏమానందం ఉందని ఈ భూతలాన

ఎవరొచ్చిరి ఏమిచ్చిరి

ఏ మాటలు ఎక్కడెక్కడ గుచ్చిరి

ఈ గాయమెవ్వడు చేసెను

ఈ గానమెవ్వడు పాడెను

ఎందుకింత నిర్దయ

దేహం రక్తపాశముతో బంధించినప్పుడు

కొత్త కుండ భళ్ళున పగిలినప్పుడు

చెరువుకట్ట కాడ కట్టె కాలినప్పుడు

దాపురించేటి సమస్త శూన్యమయం

నల్ల కలువలు నలుదిక్కుల విచ్చు విధాన

పగటి చీకట్లు గొప్పగా కప్పెడు విధాన

చిరునవ్వు పొరలపై జారు కన్నీరు

ఆరునెల్లు మంచానే తెలవారునని

దిక్కుదిక్కునెల్ల దివ్యనేత్రోత్సవం

గుత్తులు గుత్తులుగా రాలేటి

గొంతుకోసే పువ్వులు

ధగధగ మెరిసేటి నిగూఢ నవ్వులు

మనవాడెవ్వడు కానివాడెవ్వడు

గగన వనమున కలుగు స్థలమున

శోకమెరుగని తలమున

అమ్మా నువ్వెట్లున్నావే?

అంతా క్షేమమేనా?’’

-వేణు ఊడుగుల

(udugulavenu@gmail.com)

ఇవి కూడా చదవండి:

**************************************

*Rashmika Mandanna: నెటిజన్ షేర్ చేసిన వీడియో చూసి రష్మిక ఫుల్ ఖుష్.. అందులో ఏముందంటే?


**************************************

*NTR: ఎన్టీఆర్ ‘శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం’ మూవీ గురించి ఈ విషయాలు తెలుసా?

**************************************

*KS Ramarao: ప్రేక్షకులు బాగుంది అని చెప్తే.. సినిమా సక్సెస్ అయినట్టే!


**************************************

*Varun Tej: మెగా ప్రిన్స్‌ నుంచి మరో అనౌన్స్‌మెంట్ రాబోతోంది


**************************************

* Prithviraj Sukumaran: షూటింగ్‌లో ప్రమాదం.. పృథ్వీరాజ్ సుకుమారన్‌కు గాయాలు


**************************************

Updated Date - 2023-06-27T17:01:57+05:30 IST