Chiranjeevi: కేసీఆర్‌ని పరామర్శించిన చిరు.. ఇండస్ట్రీ పెద్దన్న అంటూ ఒకటే కామెంట్లు!
ABN , First Publish Date - 2023-12-11T19:20:08+05:30 IST
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పరామర్శల వెళ్లువ కొనసాగుతూనే ఉన్నది. యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను ఈ రోజు రాత్రి మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)కు రాజకీయ నాయకులు, సినిమా ఇండస్ట్రీ నుంచి పరామర్శల వెళ్లువ కొనసాగుతూనే ఉన్నది. యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను ఈ రోజు (సోమవారం) రాత్రి మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్యం గురించి తెలసుకున్నారు.
రెండు రోజుల క్రితం ఫామ్‌హౌస్‌లో కిందపడడంతో గాయపడ్డ కేసీఆర్‌ను వెంటనే సోమాజిగూడ యశోదా దవాఖాన (Yashoda Hospital)కు తరలించగా పరీక్షలు నిర్వహించిన వైద్యులు తుంటి ఎముక ఫ్యాక్చర్ అయిందని తెలిపి అదే రోజు రిప్లేస్‌మెంట్ సర్జరీ కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే.
విషయం తెలుసుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఆదివారం స్వయంగా ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్‌ను పరామర్శించగా ఈ రోజు (సోమవారం) సాయంత్రం ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాత్రి సమయంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) యశోదా దవాఖానకు వెళ్లి కేసీఆర్‌ను పరామర్శించారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ కేసీఆర్ చాలా హెల్తీగా ఉన్నారని త్వరలోనే దైనందిన జీవితంలోకి వస్తారంటూ తెలిపారు. సర్జరీ చేసిన 24 గంటల్లోనే నడిపించిన డాక్టర్ల కృషి అభినందనీమయమన్నారు. కేసీఆర్ సినీ ఇండస్ట్రీ గురించి కూడా అడిగారని అంతా బావుందని చెప్పానన్నారు. డాక్టర్లు 8 వారాల విశ్రాంతి తీసుకోవాలని చెప్పారని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు.
అదేవిధంగా సోమవారం సాయంత్రం తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో పాటు పలువురు నాయకులు కేసీఆర్‌ను పరామర్శించారు. ఇవాళ మధ్యాహ్నం సినీ నటుడు ప్రకాశ్ రాజ్, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు తదితరులు కేసీఆర్(KCR)ను పరామర్శించిన వారిలో ఉన్నారు.
అయితే ఇదిలాఉండగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఇటీవల సీఎం కేసీఆర్ ఆరోగ్యంపైనే కాకుండా ఇతర సమస్యలపై స్పందిస్తుండడంతో ఇండస్ట్రీకి పెద్దన్న అంటూ అభిమానులు ఒకటే కామెంట్లు పెడుతున్నారు. పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అందుకే అతను మెగాస్టార్ అయ్యాడు అంటూ కొనియాడుతున్నారు.